పతాక స్థాయికి పోరాటం
పతాక స్థాయికి పోరాటం
Published Sat, Apr 8 2017 10:37 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM
ముదునూరి దీక్షతో వేడేక్కిన ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమం
మేధా పాట్కర్ పర్యటనతో జాతీయ స్థాయికి ’తుందుర్రు’ అంశం
ఫ్యాక్టరీ యాజమాన్యానికి చంద్రబాబు అమ్ముడుపోయారంటూ రోజా ధ్వజం
ప్రజాస్వామ్యం ముసుగులో అరాచక పాలన సాగిస్తున్నారంటూ అంబటి విసుర్లు
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన తీరం
రాష్ట్ర సర్కారు వెన్నులో వణుకు
నరసాపురం :
ఏడాదిన్నరగా ఉధృతంగా సాగుతున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమం పతాక స్థాయికి చేరింది. ఆక్వా పార్క్‌ను జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించాలంటూ ప్రజలు సాగిస్తున్న ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసుల సాయంతో ప్రభుత్వం దమనకాండకు దిగుతున్న విషయం విదితమే. సర్కారు తీరు, ఆక్వా పార్క్ యాజమాన్యం అనుసరిస్తున్న మొండివైఖరి, నిత్యం ముట్టడిస్తున్న పోలీసు బలగాల నడుమ 40 గ్రామాల ప్రజలు సుమారు ఏడాది కాలంగా కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సాగిస్తున్న అరాచకాలతో వణికిపోతున్నారు. తమ జీవనాన్ని కాపాడుకునేందుకు.. భవిష్యత్ తరాలను కాలుష్యం బారినుంచి రక్షించుకునేందుకు అక్కడి ప్రజలు అన్నిటినీ భరిస్తూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఎప్పుడూ రోడ్డెక్కని మహిళలు లాఠీదెబ్బలు సైతం తిన్నారు. చివరకు జైళ్లకు కూడా వెళ్లారు. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాలకు పొరుగునే ఉన్న మొగల్తూరులోని నల్లంవారి తోటలో గల ఆనంద ఆక్వా ప్లాంట్‌లో విషవాయువులు వెలువడి ఐదుగురు యువకులు మృత్యువాత పడటంతో వణికిపోయారు. తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మాణం పూర్తయితే ఇంతకంటే తీవ్రమైన దుర్ఘటనలు చోటుచేసుకుంటాయనే ఆందోళన వారిని వెన్నాడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తుందుర్రు ప్రాంత ప్రజల పక్షాన పోరాడుతున్న వైఎస్సార్ సీపీ ఉద్యమ తీవ్రతను పెంచింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షతో ఉద్యమం మరింత వేడెక్కింది. నరసాపురం అంబేడ్కర్ సెంటర్‌లో ముదునూరి ప్రసాదరాజు చేపట్టిన దీక్ష విజయవంతంగా ముగిసింది. రాజకీయాలకు అతీతంగా జనం, సీపీఎం, ప్రజా సంఘాలు ముదునూరి దీక్షకు మద్దతు తెలిపాయి. నరసాపురం, మొగల్తూరు, భీమవరం, పాలకొల్లు, వీరవాసం మండలాల పరిధిలోని గొంతేరు డ్రెయిన్ పరీవాహక ప్రాంతాల్లో గల దాదాపు 40 గ్రామాల ప్రజలు తరలివచ్చి ముదునూరి దీక్షకు సంఘీభావం తెలిపారు. ఆక్వా పార్క్ నిర్మాణం పూర్తయితే గొంతేరు డ్రెయిన్ కాలుష్య కాసారం అవుతుందని జనం మరోసారి గగ్గోలు పెట్టారు. పంటలు నాశనమైపోతాయని రైతులు, ఉపాధి కరువవుతుందని మత్స్యకారులు, ఆరోగ్యాలు పాడవుతాయని దీక్షా వేదిక సాక్షిగా ప్రజలు కన్నీటి పర్వంతమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు బాధిత గ్రామాల్లో మిన్నంటాయి. ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవకుంటే సత్తా చూపుతామని, ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ముదునూరి చేపట్టిన దీక్ష శనివారం సాయంత్రం ముగిసింది. ఈ పోరాటం ఇక్కడితో అంతం కాదని, ఇకపై మరింతగా ఆరంభమవుతుందని దీక్ష అనంతరం ముదునూరి ప్రసాదరాజు ప్రకటించారు.
నిప్పులు చెరిగిన రోజా
ఆక్వా పార్క్ విషయంలో చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న విధానం, ప్రజలపై సాగిస్తున్న దమనకాండపై వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే రోజా నిప్పులు చెరిగారు. చంద్రబాబు లంచాలు తీసుకున్నారు కాబట్టే ఆక్వా పార్క్ యాజమాన్యానికి కొమ్ము కాస్తున్నారని ధ్వజమెత్తారు. ’మహిళా దినోత్సవం రోజునే మహిళలను కొట్టిస్తావా చంద్రబాబూ.. 15 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లాకు నీవిచ్చే బహుమతి ఇదేనా’ అంటూ నిలదీశారు. ఆక్వా పార్క్‌ను తుందుర్రు ప్రాంతం నుంచి జనావాసాలు లేని సముద్ర తీరానికి తరలించాల్సిందేనని డిమాండ్ చేశారు. మొగల్తూరు నల్లంవారి తోటలో ఇదే యాజమాన్యం నిర్వహిస్తున్న 10 టన్నుల సామర్థ్యం గల ఆక్వా ప్లాంట్‌లో విషవాయువులు వెలువడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని.. తుందుర్రులో ఆక్వా పార్క్ నిర్మించి ఇంకెంతమంది ప్రాణాలు పొట్టన పెట్టుకుంటారని నిలదీశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దలుపుకుంటే ప్రభుత్వం సరిపోతుందా అని ప్రశ్నించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవడం, ఫ్యాక్టరీ లైసెన్స్‌లు రద్దు చేయడం, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టం ప్రభుత్వ కనీస బాధ్యత అని గుర్తు చేశారు.
మేధా పాట్కర్ రాకతో..
వైఎస్సార్ సీపీ పోరాట తీవ్రతతో ఒక్కసారిగా మళ్లీ రగిలిన ఉద్యమం ప్రముఖ పర్యావరణవేత్త, నర్మదా బచావో ఉద్యమ నిర్మాత మేధా పాట్కర్ శనివారం రాత్రి కంసాలి బేతపూడి, తుందుర్రు గ్రామాల్లో పర్యటించారు. ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలతో భేటీ అయ్యారు. తుందుర్రులోని ఆక్వా పార్క్‌ను సందర్శించి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొగల్తూరులో ఆనంద ఆక్వా ప్లాంట్‌లో వెలువడిన విషవాయువుల వల్ల మరణించిన యువకుల కుటుంబాల వారితో మాట్లాటాడు. తుందుర్రు, కంసాలిబేతపూడి తదితర గ్రామాల్లో ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండను తెలుసుకున్న ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తుందుర్రులో అరాచకాలు, పర్యావరణ ముప్పునకు రాష్ట్ర ప్రభుత్వమే బీజాలు వేసే ప్రయత్నాలపై జాతీయ స్థాయిలో చర్చ పెడతానని ప్రకటించారు. మొత్తంగా తుందుర్రు ఆక్వా పార్క్ ఉద్యమంలో వేడి మరింత రాజుకుంది.
Advertisement
Advertisement