డామిట్.. కథ అడ్డం తిరిగింది
→రూ.కోటి విలువైన స్థలం కబ్జాకు యత్నం
→బోరు తీసి, చురుగ్గా నిర్మాణ పనులు
→స్థల రక్షణదారుని ఫిర్యాదుతో బాగోతం బట్టబయలు
→కటకటాల పాలైన భూకబ్జాదారు
పీఎం పాలెం(భీమిలి): సూమారు రూ.కోటి విలువ చేసే భూమిని దర్జాగా కబ్జా చేయడానికి యత్నించి కథ అడ్డం తిరగడంతో ఓ పెద్దమనిషి కటకటాల పాలయ్యాడు. మధురవాడ నార్త్ జోన్ ఏసీపీ నాగేశ్వరరావు సామవారం సాయంత్రం పీఎంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్ బండారు మహేశ్వరరావు తన కుమార్తె సుమలతకు పీఎం పాలెం తులసీనగర్ సర్వే నంబరు 53/3లో ప్లాట్ నంబరు 77లో 340 చదరపు గజాల స్థలం గిఫ్ట్‌డీడ్ కింద ఇచ్చారు. ప్రస్తుతం ఆమె భర్తతో పాటు అమెరికాలో ఉంటున్నారు. నగరంలోని పెదవాల్తేరులో నివసిస్తున్న ఆమె మామ చుక్క అప్పలప్రకాశరావు సదరు స్థలం వద్దకు అప్పుడప్పుడూ వస్తూ చూస్తున్నారు.
కబ్జాకు స్కెచ్ ఇలా..
ఇదిలా ఉండగా ఈ భూమిని కొట్టేయడానికి అక్కయ్యపాలెంలో నివసిస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన గంధంనేని సూర్యమణిధర్మరాజు కొంతమంది స్థానికుల సహకారంతో పథకం రచించాడు. బండారు మహేశ్వరరావు.. మొయ్యి వాసంతి అనే మహిళకు 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చినట్టు అనామతు పత్రం సృష్టించాడు. సుమారు 10 రోజుల కిందట ఆక్రమించిన భూమిలోకి దర్జాగా ప్రవేశించి బోరు తీయించాడు. అంతటితో ఆగకుండా బేస్‌మెంట్ నిర్మాణపు పనులు కూడా చేపట్టాడు. విషయం తెలుసుకున్న అప్పల ప్రకాశరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సీఐ కె.లక్ష్మణమూర్తి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సూర్యమణిధర్మరాజును కబ్జా స్థలంలోనే సోమవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రిమాండుకు తరలించామని ఏసీపీ తెలిపారు.