దారుణం!
♦ కాలికి గాయమై ఏడుస్తున్న కుమార్తెను గోడకేసి కొట్టిన పెంపుడు తండ్రి.. తీవ్రంగా గాయపడి చిన్నారి మృతి..
♦ మైలార్‌దేవ్‌పల్లిలో మూగ, చెవిటి చిన్నారిపై క్రూరత్వం
హైదరాబాద్: ఆ చిన్నారికి పుట్టుకతో మాటలు రావు.. వినికిడి శక్తి లేదు.. ప్రమాదవశాత్తు గాయపడి నడవలేని స్థితిలో ఉంది. అలాంటి చిన్నారి ఆలనాపాలనా చూడాల్సిన తండ్రి.. కాలయముడిగా మారి గోడకు కొట్టి చంపాడు. హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జయమ్మకు కుమార్తె లక్ష్మి(3) ఉంది. భర్త మృతి చెందడంతో బసవరాజు(38)ను జయమ్మ రెండో వివాహం చేసుకుంది. బసవరాజుకు కూడా ఇది రెండో వివాహమే. కొంతకాలంగా మైలార్‌దేవ్‌పల్లిలో నివసిస్తున్నారు. కాగా, 15 రోజుల క్రితం ప్రమాదవశాత్తు లక్ష్మి డ్రైనేజీలో పడి కాలికి తీవ్ర గాయమైంది. తాగుడుకు బానిసలైన జయమ్మ, బసవరాజు ఉదయం పని చేసుకొని రాత్రిళ్లు తాగి ఇంటికి వచ్చేవారు. దీంతో లక్ష్మి.. తన బాధను తల్లిదండ్రులతో చెప్పుకోలేకపోయింది.
శుక్రవారం రాత్రి లక్ష్మి ఏడుపులకు విసిగిపోయిన బసవరాజు చిన్నారిని గోడకు వేసి కొట్టాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని ఆసుపత్రికి తరలించకుండా నిర్లక్ష్యం చేశారు. చిన్నారి కేకలు విని చుట్టుపక్కల వారు వచ్చి ప్రశ్నించడంతో విషయం బయటపడింది. తల్లిదండ్రులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు హుటాహుటిన లక్ష్మిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు జయమ్మ, బసవరాజులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ముందుకు వెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.