గట్టెక్కేదెలా!
గట్టెక్కేదెలా!
Published Fri, Nov 25 2016 10:50 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
17 రోజులైనా అవే కష్టాలు
సొమ్ముల్లేక రైతన్నల గగ్గోలు
ఫీజులు కట్టలేక విద్యార్థుల అగచాట్లు
పింఛన్ సొమ్ము వేసేది బ్యాంకు ఖాతాల్లోనే
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు :
పెద్ద నోట్ల రద్దు కారణంగా వ్యవసాయాధారితమైన ’పశ్చిమ’లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. త్వరలో రబీ సీజన్ ప్రారంభం అవుతోంది. కనీసం పొలం పనులు చేయడానికి, పొలానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి అవకాశం లేకపోవడంతో రబీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరి కోతలు ప్రారంభం కావడంతో కూలీలకు డబ్బులు సర్దుబాటు చేయడం సమస్యగా మారింది. ఫీజు కట్టే పరిస్థితి లేక విద్యార్థులు ఆగచాట్లు పడుతున్నారు. లింగపాలెం మండలం కొణిజర్ల గ్రామానికి చెందిన నిమ్మగడ్డ రవితేజ ఎస్సై పరీక్షకు అవసరమైన శిక్షణ కోసం రూ.30 వేలు చెల్లించాల్సి ఉండగా, డబ్బు సమకూరకపోవడంతో కోచింగ్‌కు వెళ్లలేక రెండు వారాలుగా ఇంటికే పరిమితమయ్యాడు. కామవరపుకోటకు చెందిన ఎం.బాలాజీకి బ్యాంకు రుణం మంజూరు కాగా, రేపోమాపో సొమ్ము చేతికి వస్తుందని సంబరపడ్డాడు. ఈ లోగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయడంతో బ్యాంకు అధికారులు రుణం ఇవ్వడానికి నిరాకరించారు. ప్రస్తుత గందరగోళానికి తెరపడ్డాక వెలువడే ఆదేశాలను అనుసరించి రుణమిచ్చేదీ లేనిదీ చెబుతామన్నారు. ప్రక్కిలంక గ్రామానికి చెందిన చదరాసి శ్రీనివాస్ తన బంధువును ఇటీవల ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే పెద్దనోట్లు తీసుకోలేదని వాపోయాడు. జిల్లాలో ఎవరిని కదిపినా ఇవే కష్టాలు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ విభేదించకపోయినా.. సరైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఒకటి రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుందని భావించగా.. 17 రోజుల తర్వాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. జేబులో పెద్ద నోట్లు కావలసినన్ని ఉన్నా ఇంట్లోకి కావలసిన సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి తలెత్తడంపై సామాన్య మధ్య తరగతి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చిల్లర సమస్యతో పెద్ద నోట్లు మార్చుకునే అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బ్యాంకులకు వెళ్లినా సొమ్ము రావట్లేదు
ఇదిలావుంటే.. పాత నోట్లు తీసుకుని, కొత్తనోట్లు ఇచ్చే కార్యక్రమం నిలిచిపోవడంతో శుక్రవారం కూడా బ్యాంకులు వెలవెలబోయాయి. కరెంట్ అకౌంట్ గలవారికి రూ.20 వేల రూపాయలు తీసుకునే సదుపాయం కల్పించారు. జిల్లాలో ఒక్క స్టేట్ బ్యాంక్ ఏటీఎంలు తప్ప మిగతావి పని చేయలేదు. వాటిలో నగదు పెట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లపూడి ఆంధ్రాబ్యాంక్‌కు సొమ్ము తీసుకునేందుకు ఖాతాదారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. బ్యాంకులో నగదు లేని కారణంగా సొమ్ములు ఇవ్వలేకపోతున్నామంటూ బోర్డు పెట్టారు. ఇదిలావుంటే.. రేషన్ దుకాణాలకు కరెంట్ ఖాతాలు తెరవాలని అధికారుల నిర్ణయించారు. డిసెంబర్ నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో జమ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Advertisement
Advertisement