curency
-
ఎన్నికల దారిలో కరెన్సీ!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్దమొత్తంలో పంపుతున్న నగదు ఏమవుతోంది? ఎటు పోతోంది? ఎవరు దాచుకుంటున్నారు? ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ నేతలు, బడాబాబులు ముందుగానే భారీ మొత్తంలో పెద్ద నోట్లను నిల్వ చేసుకున్నారా? కర్ణాటక ఎన్నికలకు ఇక్కడ్నుంచే నగదు తరలివెళ్తోందా? తెలంగాణ, ఏపీలో నగదు కష్టాలకు అసలు కారణాలు ఇవేనని అటు బ్యాంకర్లు.. ఇటు ఆర్బీఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు ఎంత నగదు పంపినా.. సగానికిపైగా ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులే వేలాడుతున్నాయి. స్వయంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి కరెన్సీ కొరత తీవ్రతను అంగీకరించింది. రాష్ట్రంలో అత్యధిక ఏటీఎంలు ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతులెత్తేసింది. సగానికిపైగా ఏటీఎంలను అనధికారికంగా మూసివేసింది. మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రాలను వెతుక్కుంటూ తిరిగినా ఏటీఎంలలో డబ్బుల్లేవు. ఖాతాదారులకు అత్యవసరమై బ్యాంకుకు వెళ్లినా రూ.10 వేలకు మించి డబ్బులు ఇవ్వడం లేదు. పెద్ద నోట్లను రద్దు చేసి ఏడాదిన్నర అవుతున్నా ఈ పరిస్థితి మారకపోవడం గమనార్హం. మూడు నెలలుగా కొరత తీవ్రం తెలుగు రాష్ట్రాల్లో మూడు నెలలుగా నగదు కొరత తీవ్రతరమైంది. ప్రజల డిమాండ్‌కు సరిపడేంత నగదు పంపాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా ఆర్బీఐకి లేఖలు రాశాయి. మొన్నటివరకు రాష్ట్రంలో నగదు లేకపోవటంతో ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి డబ్బు తెచ్చి ఏటీఎంలలో అందుబాటులో ఉంచారు. జనవరి, ఫిబ్రవరిలో నగదు విత్‌డ్రా అంచనాలకు మించి పెరిగిపోయింది. ఆర్బీఐ అనుమతి తీసుకుని మహారాష్ట్ర, కేరళలోని తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌కు నగదు తెప్పించినట్లు ఎస్బీఐ అధికారులు చెబుతున్నారు. మార్చి నెల ఆర్థిక సంవత్సరాంతం కావటంతో మిగతా రాష్ట్రాల నుంచి డబ్బు తీసుకోవటం కష్టంగా ఉందని వారు పేర్కొంటున్నారు. ఏటీఎంలలో గతంలో 95 శాతం మేర నగదు ఉండేదని, ఇప్పుడు అది 60 శాతానికి పడిపోయిందని అంగీకరిస్తున్నారు. వెయ్యి కోట్లు కావాలని ఇండెంట్ పెడితే ఆర్బీఐ నుంచి అందులో సగమే వస్తోందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇక్కడే కొరత ఎందుకు? ఇరుగు పొరుగు రాష్ట్రాలకు మించిన నోట్ల కొరత తెలుగు రాష్ట్రాల్లో నెలకొనడంపై ఆర్బీఐ సైతం విస్మయం వ్యక్తం చేస్తోంది. గతేడాది ఏప్రిల్ నుంచి మార్చి మొదటి వారం వరకు హైదరాబాద్ రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయానికి ఆర్బీఐ రూ.53 వేల కోట్లు పంపింది. పెద్దనోట్ల రద్దు నుంచి ఇప్పటివరకు రూ.83 వేల కోట్లు పంపిణీ చేసింది. దేశంలోని మొత్తం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లోకెల్లా ఇదే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. ఇంత డబ్బు తెలుగు రాష్ట్రాలకు చేరుతున్నా బ్యాంకుల్లో, ఏటీఎమ్‌ల్లో కొరత ఎందుకుందనే సందేహాలు వెంటాడుతున్నాయి డిపాజిట్లు నిల్.. విత్‌డ్రాలు ఫుల్.. నోట్ల రద్దు అనంతరం ఖాతాదారులకు బ్యాంకుల పట్ల అభద్రతా భావం పెరిగింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఖాతాదారులు తాము చేసిన పొదుపు డబ్బును సైతం బ్యాంకుల నుంచి ఉపసంహరించుకుంటున్నారు. బ్యాంకుల నుంచి బయటికి వెళ్లిన కరెన్సీ తిరిగి బ్యాంకులకు రావడం లేదు. జీఎస్టీ తర్వాత డిజిటల్ లావాదేవీలు జరిగితే ఐటీ కట్టాలనే భయంతో వ్యాపారులు నగదు వాడకాన్నే ప్రోత్సహించడం కొరతకు మరో కారణం. నగదు విత్ డ్రాలు పెరగడంతో పాటు డిపాజిట్లు బాగా తగ్గిపోయాయి. వేతన జీవులు కూడా ఒకేసారి డబ్బును డ్రా చేసుకుంటున్నారు. దీంతో బ్యాంకులు, ఏటీఎంలలో నగదుకు కటకట తప్పటం లేదని ఎస్బీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. ఇటీవల కేంద్రం తెచ్చిన ఎఫ్ఆర్డీఐ ఫైనాన్షియల్ రెజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్ఆర్డీఐ) బిల్లుతో డిపాజిటర్లలో లేనిపోని భయం పట్టుకుంది. దీంతో బ్యాంకుల నుంచి ఎక్కువ మంది సొమ్ము విత్‌డ్రా చేసుకున్నారు. ఈ బిల్లు కారణంగా బ్యాంకులు నష్టపోతే తీసుకునే చర్యల్లో డిపాజిటర్లు కూడా కొంత భరించాల్సి ఉంటుందనే ప్రతిపాదన ఉన్నట్టు ప్రచారం జరిగింది. అదేమీ లేదని కేంద్రం స్పష్టత ఇచ్చినా ఖాతాదారుల్లో భయాందోళనలు తగ్గలేదు. కర్ణాటక వైపు కరెన్సీ! గతేడాది సెప్టెంబర్ నుంచే ఆర్బీఐ రూ.2 వేల నోట్లను బ్యాంకులకు సరఫరా చేయటం లేదు. మరోవైపు ఖాతాదారుల నుంచి కూడా ఈ నోట్లు బ్యాంకులకు రావడం లేదు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అన్ని పార్టీలు, బడా రాజకీయ బాబులు పెద్ద నోట్లను ఇప్పటికే భారీ ఎత్తున దాచిపెట్టినట్టు ఆరోపణలున్నాయి. కర్ణాటకలో మే నెలలో ఎన్నికలు జరుగనున్నాయి. అక్కడ రాజకీయ పార్టీల ప్రచారం మొదలైంది. ఎన్నికలకు భారీ ఖర్చు పెట్టేందుకు పోటీ పడుతున్న అక్కడి నేతలు ఇప్పటికే నగదును సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఏపీ, తెలంగాణ నుంచి భారీ మొత్తం కర్ణాటకకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. నేతలతో సన్నిహిత సంబంధాలున్న బడా కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు వీలైనంత డబ్బును ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి పంపినట్లు ప్రచారం జరుగుతోంది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆదివారం భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి షార్జా వెళుతున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా విదేశీ కరెన్సీ బయటపడింది. అనంతరం ఆ వ్యక్తిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
’కట్టలు’ తెగాయ్
పందెం కోడి గెలిచింది జూదం జూలు విదిల్చింది పనిచేయని కోర్టు ఉత్తర్వులు, పోలీస్ ఆంక్షలు నేడు, రేపు ఇదే జోరు సెక్షన్ 144 విధిస్తున్నట్టు ప్రకటించిన కలెక్టర్ కనిపించని జాయింట్ యాక్షన్ టీమ్‌లు మార్టేరులో పొట్టేలు పందేలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : పండగ వేళ పందెం కోడి గెలిచింది. కోర్టులిచ్చిన ఉత్తర్వులు అపహాస్యం పాలయ్యాయి. సంప్రదాయం పేరిట రాజకీయ పార్టీల నేతలు దగ్గరుండి మరీ కోడి పందేలు వేయించారు. ఒకరోజు ముందువరకూ హడావుడి చేసిన జాయింట్ యాక్షన్ టీములు, పోలీసులు పత్తా లేకుండా పోయారు. శుక్రవారం సాయంత్రానికి కోడి పందేలు నిర్వహించే చోట 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ ప్రకటించగా, ఎక్కడా దాని ప్రభావం కనపడలేదు. కోడిపందేల ముసుగులో జూదం యథేచ్ఛగా సాగింది. మద్యం ఏరులై పారింది. మీడియాను అనుమతించకుండా పోటీలు జరుపుకోవచ్చని ప్రభుత్వం నుంచి అనధికారికంగా అనుమతులు రావడంతో పందేలరాయుళ్లు చెలరేగిపోయారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఖమ్మం జిల్లా జూబ్లీపుర గ్రామానికి చెందిన గంగవరపు లక్ష్మీదయాకర్ అనే వ్యక్తి తన లైసెన్స్ రివాల్వర్‌తో మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి మరీ తన అనందాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా పందేల రాయుళ్ల మధ్య బెట్టింగ్‌లు జరిగాయి. గాల్లోకి కాల్పులు జరిపిన దయాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుమంట్ర మండలం మార్టేరులో పొట్టేలు పందేలు నిర్వహించారు. ఎక్కడ చూసినా పందేలే భీమవరం మండలం వెంపలో ఫ్లడ్ లైట్ల వెలుగుల నడుమ రేయింబవళ్లు పందేలు వేస్తున్నారు. ఆకివీడు మండలం ఐ.భీమవరం గ్రామంలో ప్రధాన బరిగా ఉన్న ఎఫ్‌సీఐ గోడౌన్ల ప్రాంతంలో కోడి పందేలు వేయరాదంటూ పోలీసులు, రెవిన్యూ యంత్రాంగం అడ్డుకుంది. ఒక దశలో పందేల రాయుళ్లు తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. చివరకు ఉండి ఎమ్మెల్యే కలవూడి శివ వత్తిడితో మధ్యాహ్నం నుంచి అనుమతి ఇచ్చారు. పోలేరమ్మ గుడివద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డింకీ పందాలను ఎమ్మెల్యేతో బీజేపీ నేతలు కనుమూరి రఘురామకృష్ణంరాజు, శ్రీనివాస వర్మ తిలకించారు. భీమవరం మండలం వెంప, తోకతిప్ప గ్రామాల్లో భారీ పందేలు వేస్తుండగా దిరుసుమర్రు, ఈలంపూడి, వీరవాసరం మండలంలోని కొణితివాడ, నవుడూరు, ఉత్తరపాలెం, అండలూరు, వీరవాసరం, నందమూరు గరువు తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. వీరవాసరం మండలం కొణితివాడ చుట్టుపక్కల గ్రామాల ఏడు గ్రామాల్లోని సంఘ పెద్దలు ఉత్తరపాలెంలో నిర్వహించే కోడి పందాలకు పోటీగా మరొక బరిని సిద్ధం చేయడంతో మహిళలు అడ్డుకున్నారు. దేవరపల్లి మండలంలో దేవరపల్లి, చిన్నాయిగూడెం, పల్లంట్ల, త్యాజంపూడి, లక్ష్మీపురం గ్రామాల్లో భారీ పందేలు నిర్వహించారు. గోపాలపురం మండలం గుడ్డిగూడెం, వెంకటాపాలెం, కొవ్వూరుపాడు, వాదాలకుంట గ్రామాల్లో పందేలు జరిగాయి. నల్లజర్ల మండలం నల్లజర్ల, అనంతపల్లి, చోడవరం, పోతవరం, ద్వారకాతిరుమల మండలంలో రాళ్లకుంట, వెంకటకృష్ణాపురం, దోసన్నపాడు, తిమ్మాపురం గ్రామాల్లో భారీగా పందేలు ప్రారంభించారు. తొలిరోజు పందేలకు ప్రముఖులు ఎవరూ హాజరుకాకపోయినప్పటికీ మండల స్థాయి టీడీపీ నాయకులు బాధ్యతలు తీసుకుని జోరుగా నిర్వహించారు. దెందులూరులో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దగ్గరుండి మరీ పందేలను నిర్వహిస్తున్నారు. పెదవేగి మండలం కొప్పాకలో పోటీల వద్దకు పోలీసులు, మీడియా రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొగల్తూరులో పందేలు నిర్వహించే బరికి వేలం నిర్వహించారు. నిడమర్రు మండలం పత్తేపురంలో భారీ పందేలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు వీటిని ప్రారంభించారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. ఈ బరిని స్థానిక నాయకుడొకరు రూ.32 లక్షలు చెల్లించి వేలంలో దక్కించుకున్నట్టు సమాచారం. జూలు విదిల్చిన జూదం.. ఏరులై పారిన మద్యం కోడి పందేల బరులకు అనుబంధంగా కోతాట, గుండాట పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. అక్కడే మద్యం లూజు విక్రయాలు భారీగా సాగుతున్నాయి. నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో భీమేశ్వరస్వామి ఆలయం వద్ద పందేలు జరుగుతున్నాయి. బువ్వనపల్లి, తోకలపల్లి గ్రామాల్లో చిన్న బరులు ఏర్పాటు చేఽశారు. ఇక్కడ పందేల కంటే పేకాట, గుండాట వంటి జూదాలకే అధిక ప్రాధాన్యత ఉంది. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని 14 గ్రామాల్లో కోడి పందాల శిబిరాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకూ ఎటువంటి అనుమతులు ఇవ్వకపోవడంతో బరులు ఏర్పాటు చేసే ప్రాంతాల వద్ద పోలీసులు పికెట్లు ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించారు. 11గంటల తరువాత పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనధికారిక అనుమతులు రావడంతో పోలీసు గప్‌చిప్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మార్టేరు, ఆలమూరు, పెనుమంట్ర, వడలి, సిద్ధాంతం, దొంగరావిపాలెం, ములపర్రు, ఆచంట, కొడమంచిలి, వల్లూరు గ్రామాలలో కోడి పందేలు, జూదం నిర్వహించారు. ఆచంట మండలం వల్లూరులో పందేల బరిని వేలం వేయగా, గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రూ.2 లక్షలకు దక్కించుకున్నట్టు సమాచారం. చింతలపూడి మండలం వెంకటాపురం, సీతానగరం, నాగిరెడ్డిగూడెం, లింగపాలెం మండలంలోని కొణిజర్ల, ములగలంపాడు, కామవరపుకోట మండలం రావికంపాడు, కళ్లచెర్వు, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో భారీగా పందేలు నిర్వహించారు. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల్లో ఉదయం 10 గంటలకే కోడి పందేలు, గుండాట, కోతాట తదితర జూద క్రీడలు ప్రారంభించారు. పాలకొల్లు మండలంలో టీడీపీ నేత ఆధ్వర్యంలో పూలపల్లి బైపాస్ రోడ్డులో కోడి పందేలు వేశారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోని గుంజవరం, గూటాల, పి.రాజవరం, పి.అంకంపాలెం, కామయ్యపాలెం, రాచన్నగూడెం, ములగలంపల్లి, తాటియాకులగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, బూసరాజుపల్లి, దొరమామిడి, వెలుతురువారిగూడెం, టి.నరసాపురం, బందంచర్ల, రామవరం, తిరుమలదేవిపేట, అప్పలరాజుగూడెం, రామానుజపురం, బయ్యనగూడెం, కుక్కునూరు మండలం వీరవల్లి, వేలేరు గ్రామాల్లో కోడిపందేలు జరిగాయి. -
నోట్ల కష్టాలు గవర్నర్‌కు విన్నవిస్తాం
విజయపురిసౌత్ : నోట్ల రద్దుతో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలను వివరించేందుకు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గవర్నర్‌ను కలవనున్నట్టు మాచర్ల ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. విజయపురిసౌత్‌లోని మాచర్ల జెడ్పీటీసీ శేరెడ్డి గోపిరెడ్డి గృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బ్యాంకుల్లో సైతం చిన్ననోట్లు అందుబాటులోకి రాలేదన్నారు. రైతులు, సన్న, చిన్నకారు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నోట్ల రద్దు విషయం ముందుగానే తెలిసినా ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని చూపించలేకపోయారని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు విషయంపై ప్రధానికి స్వయంగా లేఖ రాశానని చెప్పటమే ఇందుకు నిదర్శనమన్నారు. దేశం, రాష్ట్రంలోని ప్రజలకు ప్రత్యామ్నాయాన్ని చూపించాల్సిన బాధ్యత అటు ప్రధాని మోదీపై, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఉందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరూ రాష్ట్ర గవర్నర్‌ను మధ్యాహ్నం 2.30 గంటలకు కలిసి ప్రజల బాధలను వివరిస్తామన్నారు. అనంతరం జెడ్పీటీసీ గోపిరెడ్డి విజయపురిసౌత్‌లో పారిశుధ్య సిబ్బంది లేకపోవటంతో ఎక్కడ చెత్త అక్కడే నిలిచి వీధులు అపరిశుభ్రంగా ఉన్నాయని, సిబ్బంది నియామకం జరిగేలా చూడాలని ఎమ్మెల్యేను కోరారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారం చేస్తానని హామీనిచ్చారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ నాయకులు జూలకంటి వీరారెడ్డి, బూడిద శ్రీను తదితరులు ఉన్నారు. -
అవే బాధలు
7వ తేదీ వచ్చినా జమ కాని పింఛన్లు సగం జీతమైనా తీసుకోలేకపోయిన ఉద్యోగులు ఇంటి అద్దెలు చెల్లించలేక అగచాట్లు సాక్షి ప్రతినిధి, ఏలూరు : తెల్లారితే చాలు జనమంతా బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఏడో తేదీ వచ్చినా నగదు కోసం ఇక్కట్లు తప్పడం లేదు. పెద్ద నోట్ల రద్దు పుణ్యామాని ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు.. బ్యాంకుల్లో నగదు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల ఉద్యోగులెవరూ పూర్తి జీతం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంలలో రోజుకు రూ.2 వేలకు మించి రాకపోవడం, ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లి క్యూలో నిల్చోలేని కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు రూ.10 వేల వరకు మాత్రమే సొమ్ము తీసుకోగలిగారు. పెద్ద నోట్లు రద్దు చేసి 28 రోజులు దాటినా ఇప్పటికీ బ్యాంకుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. తగ్గని తోపులాటలు ఉంగుటూరు మండలం కైకరంలోని ఎస్బీఐ బ్రాంచికి మంగళవారం మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తోపులాట జరిగింది. దీంతో, బ్యాంక్ తలుపుల అద్దాలు పగిలిపోయాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముహుర్తాలు పెట్టుకున్న వారు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లి కార్డు చూపించి రూ.2.50 లక్షలు డ్రా చేసుకోవచ్చని చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. బ్యాంకులకు సరిపడా డబ్బులు రావడం లేదు. దీంతో ప్రతి బ్రాంచి ముందు వందలాది మంది క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరికి రూ.2 వేల నుంచి రూ.4 వేల చొప్పున సర్దుబాటు చేస్తున్నారు. ప్రస్తుతం క్యూలో ఉన్న వారికి కొంత మొత్తం ఇవ్వడానికే డబ్బులు సరిపోవడం లేదని, పెళ్లిళ్ల కోసం రూ.2.50 లక్షలు ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సుదూర ప్రాంతాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి డబ్బుల కోసం వృద్ధులు ఆటోలు కట్టించుకుని రావాల్సి వస్తోంది. ఒకటికి రెండుసార్లు తిరగాల్సి రావడంతో వచ్చిన డబ్బులో సగం ఆటోలకే ఖర్చవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చాలామంది పండుటాకులకు ఇంకా పింఛన్ సొమ్ము బ్యాంకుల్లో పడకపోవడంతో వారు బ్యాంక్‌లు, పంచాయతీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానం కాకపోవడం తదితర సాంకేతిక కారణాలతో మరికొన్ని ఖాతాల్లో సొమ్ము జమ కావడం లేదని మునిసిపల్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ చిల్లర దొరకకపోవడం, రూ.500 నోట్లు సరిపడా అందుబాటులోకి రాకపోవడం వల్ల ప్రజల ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. ఏపీకి రూ.2 వేల కోట్లకు పైగా నగదు వచ్చిందని, ఆ మొత్తాలను జిల్లాలకు పంపించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా అవసరానికి సరిపడా డబ్బులు అందలేదు. దీంతో బ్యాంకుల్లో ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి -
కొత్త కరెన్సీ పై రంగుపడితే చెల్లదు
పాలకొల్లు టౌన్:: కరెన్సీ నోట్లపై ఆకతాయిల పిచ్చిరాతలు.... వ్యాపారులు డినామినేషన్ కోసం(నోట్లు లెక్కింపు గుర్తు కోసం) పెన్సిల్, బాల్‌పెన్ ఉపయోగించి కరెన్సీ నోట్లపై రాయడం ఇప్పటివరకు జరుగుతూనే వచ్చింది. అయితే పెద్దనోట్లు రద్దు తరువాత కొత్త రెండు వేల నోటుపై పెన్సిల్, బాల్పెన్లతో ఏవిధమైన రాతలు రాసినా బ్యాంక్ అధికారులు చెల్లవని చెప్పడంతో ఖాతాదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజర్వు బ్యాంక్ గతంలోనే కరెన్సీ నోట్లపై ఏవిధమైన రాతలు రాయకూడదని పబ్లికేషన్ ఇచ్చినట్లు కొంతమంది బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఈ ఆదేశాలు బ్యాంక్ అధికారులకు, ఉన్నతస్థాయి వర్గాలకు మాత్రమే తెలుసు. దీనిపై రిజర్వుబ్యాంక్, జాతీయ బ్యాంకులు ఈ విషయాలను సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వివరించకపోవడంతో కొత్తనోట్లపై రాతలతో ఆ నోట్లు మారక సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు అన్ని బ్యాంకుల్లోనూ ఖాతాదారులు తీసుకువెళ్లిన నోట్లు లెక్కింపు తరువాత బ్యాంక్ క్యాష్ కౌంటర్లోని ఉద్యోగి పెన్సిల్‌తో రాయడం అందరికీ తెలిసిందే. కొత్త నోట్లు రద్దు తరువాత బ్యాంక్ అధికారుల ఇచ్చిన ఆదేశాల మేరకు బ్యాంకు ఉద్యోగులు డినామినేషన్ కోసం పెన్సిల్‌తో రాయడం మానేసి అటువంటి కరెన్సీ ఖతాదారులు తీసుకుస్తే తీసుకోకపోవడం వంటి చర్యలు చేపట్టారు. కాయకష్టం చేసుకునే రోజువారి కార్మికులకు తమ కష్టానికి సొమ్ము చేతిలో పడిందనే ఆతృత తప్ప ఇవి పరిశీలించే ఆలోచన వారికి ఉండదనేది అందరికీ తెలిసిన విషయమే. గత రెండు రోజులుగా ఖాతాదారులు, కార్మికులు పెన్సిల్, పెన్ గీతాలున్న రూ.2వేలు నోట్లు పట్టుకుని కొంతమంది బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోవడంతో పాటు ఆ నోట్లు తీసుకోమని తిరస్కరించడంతో దిక్కుతోచని స్థితిలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొట్టిమిట్టాడుతున్నారు. అయితే కొంతమంది బ్యాంక్ అధికారులను వివరణ కోరాగా కరెన్సీనోట్లపై ఏ విధమైన రాతలు రాసినా స్కానింగ్ అవ్వదని రిజర్వు బ్యాంక్ గతంలో ఆదేశాలు జారీ చేసిందని చెబుతున్నారు. అయితే జిల్లాలోని ఏ బ్యాంకులోనూ కొత్త రూ.2వేల నోటుపై పెన్సిల్, బాల్‌పెన్ రాతలు ఉంటే ఖాతాదారుల నుంచి తీసుకోవడం లేదు. దీనిపై రిజర్వుబ్యాంక్ అధికారులు, బ్యాంక్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని పలువురు చెబుతున్నారు. -
గట్టెక్కేదెలా!
17 రోజులైనా అవే కష్టాలు సొమ్ముల్లేక రైతన్నల గగ్గోలు ఫీజులు కట్టలేక విద్యార్థుల అగచాట్లు పింఛన్ సొమ్ము వేసేది బ్యాంకు ఖాతాల్లోనే సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : పెద్ద నోట్ల రద్దు కారణంగా వ్యవసాయాధారితమైన ’పశ్చిమ’లో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. త్వరలో రబీ సీజన్ ప్రారంభం అవుతోంది. కనీసం పొలం పనులు చేయడానికి, పొలానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి అవకాశం లేకపోవడంతో రబీపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరి కోతలు ప్రారంభం కావడంతో కూలీలకు డబ్బులు సర్దుబాటు చేయడం సమస్యగా మారింది. ఫీజు కట్టే పరిస్థితి లేక విద్యార్థులు ఆగచాట్లు పడుతున్నారు. లింగపాలెం మండలం కొణిజర్ల గ్రామానికి చెందిన నిమ్మగడ్డ రవితేజ ఎస్సై పరీక్షకు అవసరమైన శిక్షణ కోసం రూ.30 వేలు చెల్లించాల్సి ఉండగా, డబ్బు సమకూరకపోవడంతో కోచింగ్‌కు వెళ్లలేక రెండు వారాలుగా ఇంటికే పరిమితమయ్యాడు. కామవరపుకోటకు చెందిన ఎం.బాలాజీకి బ్యాంకు రుణం మంజూరు కాగా, రేపోమాపో సొమ్ము చేతికి వస్తుందని సంబరపడ్డాడు. ఈ లోగా రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయడంతో బ్యాంకు అధికారులు రుణం ఇవ్వడానికి నిరాకరించారు. ప్రస్తుత గందరగోళానికి తెరపడ్డాక వెలువడే ఆదేశాలను అనుసరించి రుణమిచ్చేదీ లేనిదీ చెబుతామన్నారు. ప్రక్కిలంక గ్రామానికి చెందిన చదరాసి శ్రీనివాస్ తన బంధువును ఇటీవల ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే పెద్దనోట్లు తీసుకోలేదని వాపోయాడు. జిల్లాలో ఎవరిని కదిపినా ఇవే కష్టాలు చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ విభేదించకపోయినా.. సరైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఒకటి రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుందని భావించగా.. 17 రోజుల తర్వాత కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. జేబులో పెద్ద నోట్లు కావలసినన్ని ఉన్నా ఇంట్లోకి కావలసిన సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి తలెత్తడంపై సామాన్య మధ్య తరగతి ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. చిల్లర సమస్యతో పెద్ద నోట్లు మార్చుకునే అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులకు వెళ్లినా సొమ్ము రావట్లేదు ఇదిలావుంటే.. పాత నోట్లు తీసుకుని, కొత్తనోట్లు ఇచ్చే కార్యక్రమం నిలిచిపోవడంతో శుక్రవారం కూడా బ్యాంకులు వెలవెలబోయాయి. కరెంట్ అకౌంట్ గలవారికి రూ.20 వేల రూపాయలు తీసుకునే సదుపాయం కల్పించారు. జిల్లాలో ఒక్క స్టేట్ బ్యాంక్ ఏటీఎంలు తప్ప మిగతావి పని చేయలేదు. వాటిలో నగదు పెట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాళ్లపూడి ఆంధ్రాబ్యాంక్‌కు సొమ్ము తీసుకునేందుకు ఖాతాదారులు పెద్ద సంఖ్యలో వచ్చారు. బ్యాంకులో నగదు లేని కారణంగా సొమ్ములు ఇవ్వలేకపోతున్నామంటూ బోర్డు పెట్టారు. ఇదిలావుంటే.. రేషన్ దుకాణాలకు కరెంట్ ఖాతాలు తెరవాలని అధికారుల నిర్ణయించారు. డిసెంబర్ నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో జమ చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
మద్యం దుకాణాల్లోనూ స్వైప్ యంత్రాలు
రూ.2 వేల నోటు రద్దుకు కట్టుబడి ఉన్నా డిసెంబర్ 10న పోలవరం కాంక్రీట్ పనులు ప్రారంభం పురుషోత్తం పట్నం ఎత్తిపోతల ద్వారా 9 నెలల్లోనే విశాఖకు నీరు ఏప్రిల్ నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో అగ్రస్థానం సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్రంలో మద్యం దుకాణాల్లోనూ స్వైప్ యంత్రాలను అందుబాటులో ఉంచుతామని, నోట్ల రద్దుతో ఎవరికీ ఇబ్బందులు రాకుండా చూస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నగదు కొరత వల్ల ఇబ్బందులు ఉన్నందున ప్రత్యామ్నాయాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. చౌక దుకాణాల మొదలుకొని ప్రతిచోట స్వైప్ యంత్రాలు అందుబాటులో ఉంచడం ద్వారా నోట్ల రద్దు వల్ల ఎదురౌతున్న సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. మద్యం దుకాణాలలో వీటిని ఏర్పాటు చేయడం వల్ల తాగి డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఉండదని, కార్డు కూడా పోగొట్టుకుంటే చేయగలిగిందేమీ లేదని అన్నారు. ఇప్పటికీ రూ.2వేల నోట్ల రద్దుకు తాను పోరాడుతున్నానని, వాటిని రద్దు చేయడమే మంచిదని ఒక ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు చెప్పారు. పెద్దనోట్ల రద్దు వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేందుకు క్యాష్, రూపీ, మొబైల్ బ్యాంకింగ్ వంటి మూడు విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. సహకార బ్యాంకుల్లోనూ నోట్ల మార్పిడి, పాత నోట్లు చెల్లుబాటు అయ్యేలా కేంద్రం, రిజర్వు బ్యాంకు అధికారులతో మాట్లాడుతున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. రుపీకార్డు, ఈపోస్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. డిసెంబర్ 10న పోలవరం కాంక్రీట్ పనులు ప్రారంభం డిసెంబర్ 10వ తేదీన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీటు పనులను ప్రారంభించనున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి గత రెండున్నర సంవత్సరాల కాలంలో రూ.19 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. జాతీయ ప్రాజెక్ట్ కావడంతో దీని నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడదని ముఖ్యమంత్రి చెప్పారు. 50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో, 21 అతిపెద్ద మెయిన్ గేట్లతో, 21 మీటర్ల ఎత్తున ఉండే స్పిల్‌వే స్పిల్‌వేకు సంబంధించిన పనులు ఈనెల 29వ తేదీ నాటికి పూర్తి చేసేందుకు కేంద్ర జల వనరుల శాఖతో కలిసి కృషి చేస్తున్నామన్నారు. నిర్మాణంలో పూర్తిగా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నామన్నారు. 9 నెలల్లో ఎడమ కాలువ నుంచి నీరు పట్టిసీమ నుంచి కుడికాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చిన విధంగానే తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద ఎడమ కాలువపై నిర్మాణం చేపట్టే ఎత్తిపోతల ప్రాజెక్టును 9 నెలల్లో పూర్తి చేసి విశాఖ జిల్లాకు నీరందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. పట్టిసీమను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక మోడల్ ప్రాజెక్టుగా తీసుకుందని చెప్పుకొచ్చారు. నిర్వాశసితులకు ఇంకేం చేయాలిఽ పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఇప్పటికే ఎంతో చేశామని, రూ.25వేల కోట్ల నుంచి రూ.27వేల కోట్ల వరకూ వివిధ రూపాల్లో నిధులు ఇచ్చామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తున్నామన్నారు. నిర్వాసితులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తున్నామని, కొన్ని కొన్ని తప్పిదాలు జరిగినా అధిగమించి మెరుగైన ప్యాకేజీని అందిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్ నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో అగ్రస్థానం వచ్చే ఏప్రిల్ నాటికి సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో పోలవరం కుడికాల్వ గట్టుపై నెలకొల్పిన ఐదు మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ 2022 నాటికి 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. భవిష్యత్‌లో ఎక్కడ వీలైతే అక్కడ బొగ్గు, సూర్యరశ్మి, గాలి ద్వారా పెద్దఎత్తున విద్యుత్ ఉత్పత్తిని చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు వివరించారు. థర్మ ద్వారా విద్యుత్ ఉత్పత్తి వలన కాలుష్యం ఎక్కువ అవుతున్నదని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి పెద్ద పీట వేస్తున్నదని చెప్పారు. ఇప్పటికే 4వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి టెండర్లు పిలిచి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలో పనులు ప్రారంభించామన్నారు. వ్యవసాయం వల్ల ఎక్కువ ఆదాయం రాదని, అందువల్ల అనుబంధ పరిశ్రమలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పంటలు పండుతున్నా కూడా విశాఖ కన్నా తలసరి ఆదాయంలో వెనుకబడి ఉందన్నారు. విశాఖ ఆదాయంలో ముందుండటానికి పరిశ్రమలు కూడా ఒక కారణమన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, జెన్కో ప్రిన్సిపల్ కార్యదర్శి అజయ్‌జైన్, పోలవరం ఇంజినీరు ఇన్ఛీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు కాటంనేని భాస్కర్, హెచ్.అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. -
చిన్ననోట్లు ఇప్పట్లో అందుబాటులోకి రావు
– సీఎం చంద్రబాబు సాక్షి ప్రతినిధి, ఏలూరు : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.2 వేల నోటు వల్ల ప్రయోజనం లేదని, చిన్న నోట్లు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం కనపడటం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పోలవరం కుడి కాలువ గట్టుపై ఏపీ జెన్కో నెలకొల్పిన ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.1000, రూ.500 నోట్ల రద్దు వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని, తాను ప్రతిరోజూ ఆ పని మీదే ఉన్నానని, ప్రజల కష్టాలు చూస్తుంటే నిద్ర కూడా రావడం లేదని అన్నారు. కేంద్రం విడుదల చేసిన రూ. 2వేల నోట్లు పెద్ద వారికే ఎక్కువ ఉపయోగపడతాయన్నారు. అవి పేదలకు ఉపయోగపడటం లేదని, చిల్లర నోట్లు దొరకడం లేదని, అవి ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం కనపడటం లేదని అన్నారు. అందుకే అందరూ జన్‌ధన్ యోజన ఖాతాలు తెరవాలని సూచించారు. ఈ నోట్ల కొరత వల్ల వ్యవసాయ పనులు ఆగిపోవడం, చిన్నచిన్న వ్యాపారాలు ఆగిపోవడం, దైనందిన ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోవడానికి వీలు లేదన్నారు. రాబోయే రోజుల్లో అన్నిట్లోనూ ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు వస్తాయని, రేషన్ షాపుల్లోని ఈ పోస్ యంత్రంలో కార్డు పెడితే రూ.20 కట్ చేసుకుని బియ్యం ఇచ్చే పరిస్థితి ఉంటుందని సీఎం అన్నారు. ఎక్కడికక్కడ మొబైల్ బ్యాంకింగ్ వైపు మొగ్గుచూపాల్సిన అవసరం ఉందన్నారు. అందరి వద్ద సెల్ఫోన్లు ఉన్నాయి కాబట్టి.. వాటి ఆధారంగా మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించుకుని ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కొనుక్కోవచ్చన్నారు. -
పడిగాపులు
-పనులు మానుకుని బ్యాంక్‌లు, -ఏటీఎంల వద్ద మకాం - తీవ్రమవుతున్న నగదు కష్టాలు - 30 శాతం కమీషన్‌తో పెద్ద నోట్ల మార్పిడి -పెరుగుతున్న మోసాలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : కరెన్సీ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. పనులు మానుకుని రోజంతా బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతున్నా నగదు అందుబాటులోకి రావడం లేదు. పెద్ద నోట్లు రద్దు చేసి రోజులు గడుస్తున్న కొద్దీ సమస్య పరిష్కారం కాకపోగా తీవ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజల పరిస్థితి మరింత దుర్భరంగా మారుఽతోంది. శనివారం జిల్లాలోని బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. శనివారం డబ్బు మార్పిడిని సీనియర్ సిటిజన్లకు మాత్రమే పరిమితం చేయడంతో మిగిలిన వారు నగదు లభించక ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో సోమవారం వరకూ డబ్బు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో దాదాపుగా అన్ని ఏటీఎంలు మూతపడ్డాయి. కొన్ని ఏటీఎంల వద్ద నో క్యాష్ బోర్డులు పెట్టగా, మరికొన్ని ఏటీఎంల షట్టర్లను మూసేశారు. దళారుల వల ఆదాయ పన్ను శాఖకు చెల్లించే 30 శాతం నగదు తమకు కమీషన్‌గా ఇస్తే చాలు.. రద్దయిన నోట్లను మార్చి కొత్త నోట్లు ఇస్తామంటూ దళారులు ముందుకు వస్తున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లోనూ ఈ దందా కొనసాగుతోంది. ఈ నెల 8న కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి, ఖాతాల్లో నగదు జమను రూ.2.50 లక్షలకు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎగువ మధ్య తరగతికి చెందిన వారు తమ అవసరాల కోసం ఇళ్లలో దాచుకున్న పాత పెద్ద నోట్లను మార్చుకోవడం కోసం తంటాలు పడుతున్నారు. భూములు, ఫ్లాట్లు కొనుక్కునేందుకు దాచుకున్న డబ్బును ఇప్పుడు ఎలా మార్చుకోవాలో తెలియక దళారులను ఆశ్రయిస్తున్నారు. కొన్నిచోట్ల బ్యాంకు మేనేజర్లు కూడా ఈ దళారులతో కుమ్మక్కైనట్టు వార్తలు వస్తున్నాయి. సందట్లో సడేమియా మరోవైపు వృద్ధులను మోసం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఆచంటలో ఆంధ్రాబ్యాంక్‌లో డబ్బు డిపాజిట్ చేయడానికి వెళ్లిన వృద్ధురాలి నుంచి రూ.49 వేలు దొంగిలించుకుపోయారు. బాలంవారిపాలెంకు చెందిన ముంగండ వీరరాఘవులు (65) అనే వృద్ధురాలు డ్వాక్రా సంఘంలో వచ్చిన రుణం, ఆమె దాచుకున్న డబ్బులు కలిపి తన ఖాతాలో జమ చేసేందుకు బ్యాంకుకు వెళ్లగా డబ్బును దొంగలు కొట్టేశారు. జీలుగుమిల్లికి చెందిన వ్యాపారి రూ.34 లక్షలు నేరుగా బ్యాంక్ మేనేజర్‌కు కమీషన్ ఇచ్చి మార్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రూ.2 వేల నోట్లను జిరాక్స్ తీసి వాటిని అమాయకులకు అంటగడుతున్నారు. జిల్లాలో వరసగా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటుండటంతో అసలు నోటు ఇచ్చినా తీసుకోవడానికి వ్యాపారులు సంశయిస్తున్న పరిస్థితి కనబడుతోంది. -
ఒకటా.. రెండా.. ఈ రోజైతే అరవై..
పెద్దనోట్ల కోడ్ భాష ఇది దళారుల హల్ చల్ తాడేపల్లిగూడెం : ’ఒకటా.. రెండా.. ఈ రోజైతేనే 60. ఒకటికి కంటే తక్కువా కుదరదు. ఒకటి పైనే అయితేనే మాట్లాడండి. ఉందా.. ఎక్కడికి రమ్మంటారు. ఎక్కడ ఇవ్వమంటారు’.. ఇదేదో క్రికెట్ బుకీలు ఫస్ట్ ఫ్యాన్సీ.. సెకండ్ ఫ్యాన్సీ.. బాల్ టు బాల్ వేసుకునే పందాలు కాదు. పెద్ద నోట్ల రద్దుతో ఫోన్ల సంభాషణలు ఇవి.పేరుకుపోయిన నల్లధనాన్ని తెల్లవిగా మార్చుకునేందుకు కొందరు.. అందినకాడికి దోచుకుందామని మరికొందరు.. ఇదే ఆసరాగా చేసుకుని కమీషన్ దండుకునేందుకు ఇంకొందరు తమ ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు. డీల్స్ ఇలా.. ప్రధాని మోదీ ప్రకటనతో పెద్ద నోట్ల వ్యవహారం పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మాదిరిగా డబ్బును మార్చే దళారులు తయారయ్యారు. మొదటిరోజు లక్ష బ్లాక్ మనీని వైట్‌గా మార్చేందుకు దళారులు రూ.5 వేలు కమీషన్ తీసుకోగా ఆదివారం నాటికి అది రూ.40 వేలకు చేరింది. అంటే పాత నోట్లు లక్ష ఇస్తే రూ.60 వేలు ఇస్తారు. సోమవారం నాటికి మరికొద్దిగా తగ్గుతుందని, బుధవారం నాటికి మరింత తగ్గుతుందంటూ డబ్బున్నవారితో ఫోన్లలో సంప్రదింపులు జరిపే వారు బిజీబిజీగా ఉన్నారు. డిసెంబర్ 30 తర్వాత ఎందుకూ కొరగాని చిత్తుకాగితాలుగా లెక్కల్లో లేని రద్దు చేసే ప్రమాదం ఉంది. దీంతో అక్రమంగా లెక్కలకు చిక్కకుండా కాస్త సక్రమంగా , ప్రజలను వివిధ రూపాల్లో జలగలుగా పీలుస్తూ సంపాదించిన సొమ్ములను ఇలా వదిలించుకొనే క్రమంలో ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కోటి లెక్కనే ఈ లెక్కల సర్ధుబాటు తతంగం సాగుతోంది -
నోటెత్తిన కష్టాలు....
తీరని నోట్ల కొరత నలుపు, తెలుపు చేసేందుకు అడ్డదారులు హవాలాపై దృష్టి పెట్టిన కుబేరులు సాక్షి ప్రతినిధి, ఏలూరు: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఐదు రోజులు దాటినా ఇప్పటికీ ప్రజల కష్టాలు తీరలేదు. ప్రజలు పనులు మానుకుని బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు క్యూకడుతున్నారు. చిల్లర తీసుకున్నవారే ప్రతిచోటా తీసుకుంటుండటంతో డబ్బులు సరిపోవడం లేదని అందువల్ల ఆదివారం నుంచి చిల్లర మార్చుకునే వారికి ఓటు వేసినప్పుడు వాడే ఇంకు వంటిది వేలిమీద వేయాలని బ్యాంకర్లు భావిస్తున్నారు. నోట్లు మార్చుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉదయం ఎనిమిది గంటల నుంచే బ్యాంకుల ముందుకు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు తాము దాచుకున్న ఐదు వందలు, వెయ్యి రూపాయలలో కొన్ని నకిలీ నోట్లు అని తేలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ బయట చెలామణిలో ఉన్న డబ్బులో నకిలీ నోట్లు ఎక్కువగానే చెలామణి అయ్యాయి.అయితే బ్యాంకుల వద్దకు అవి వెళ్లకపోవడంతో యధేశ్చగా చెలామణి అయిపోయాయి. ఇప్పుడు బ్యాంకర్లు వాటిని నకిలీ నోట్లుగా గుర్తించి చింపివేస్తుండటంతో వాటిని మార్చుకోవడానికి వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆక్వా ఎగుమతుల నుంచి, వ్యాపార లావాదేవీల నిమిత్తం ఖరీదుల కోసమని ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బడా,బడా వ్యాపారులు గతంలో హవాలా ద్వారా డబ్బులు ఏర్పాటు చేసుకునేవారు. అయితే ఇప్పుడు హవాలా వ్యాపారం దాదాపుగా దెబ్బతింది. దీంతో అక్వా రంగంపై నోట్ల రద్దు అంశం తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఇకపై బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిపితే ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో పన్నులు కట్టాల్సి ఉంటుంది. మరి దీనికి సిద్దపడతారా వేరే మార్గం వెతుకుతారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇప్పటి వరకూ బ్యాంకుల వద్దకు సామాన్య, మద్య తరగతి ప్రజలే వస్తున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు. నల్లదనం వెలికి తీయడానికి అంటూ రద్దు చేసిన నోట్ల వల్ల నల్లదనం ఇప్పటి వరకూ బయటకు రాలేదని సమాచారం. నల్లదనం ఉన్న వారు ఈ నోట్లను మార్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. నల్లదనాన్ని కాపాడుకునేందుకు ఎక్కువ మంది బంగారం కొనుగోళ్లు జరిపినట్లు సమాచారం. మరోవైపు ఎక్కువ మందికి బ్యాంకులో రెండువేల రూపాయల కొత్త నోట్లు ఇస్తున్నారు. అయితే అంత మొత్తానికి చిల్లర ఇవ్వలేని పరిస్థితి ఉండటంతో వాటిని మార్చడం కూడా ఇబ్బందికరంగా మారింది. రద్దయిన రూ. 500 స్థానంలో కొత్త నోట్లు ఇంకా బ్యాంకులకు చేరకపోవడంతో ఖాతాదారులకు కేవలం రూ. 2వేల నోట్లు మాత్రమే ఇస్తుండడంతో సామాన్యులు వీటిని ఏమి చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. రోజు వారి ఖర్చులకు ఎవరి దగ్గరకు వెళ్లినా చిల్లరలేదని చెబుతున్నారని వాపోతున్నారు. తమ వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేసేందుకు గంటల తరబడి లైనులో నిలబడినా, బ్యాంకు అధికారులు చేతిలో రూ. 2వేల నోటు పెడుతుండడంతో వారు నిరాశకు గురవుతున్నారు. చాలా చోట్ల బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు శ్రద్ద చూపిస్తున్నారుగాని నోట్లు మార్చడానికి ఇప్పుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టాఫీసుల్లో నోట్ల కొరత వేధిస్తోంది. బ్యాంకుల నుంచి సరిపడా చిల్లర తమకు ఇవ్వకపోవడం వల్ల తాముప్రజల చేత తిట్లు తినాల్సి వస్తోందని పోస్టల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కరెన్సీ గణేషుడు
రూ.9,99,999లతో అలంకరణ సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని స్వప్నకాలనీలోని వినాయకుడిని రూ.9,99,999 కరెన్సీతో ఉత్సవ కమిటీ సభ్యులు అలంకరించారు. కరెన్సీ నోట్లతో దండలు పేర్చి గణేషునితోపాటు మండపాన్ని చూడముచ్చటగా ముస్తాబు చేశారు. సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నగునూరి అశోక్‌కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మాడూరి ప్రసాద్, మండల రైస్‌మిల్లర్స్ ప్రతినిధులు చకిలం మారుతి పలువురు పాల్గొన్నారు.