పడిగాపులు | struggles at atm centres | Sakshi
Sakshi News home page

పడిగాపులు

Published Sat, Nov 19 2016 11:51 PM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM

పడిగాపులు

పడిగాపులు

-పనులు మానుకుని బ్యాంక్‌లు, 
-ఏటీఎంల వద్ద మకాం
- తీవ్రమవుతున్న నగదు కష్టాలు
- 30 శాతం కమీషన్‌తో పెద్ద నోట్ల మార్పిడి
 -పెరుగుతున్న మోసాలు
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
కరెన్సీ కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. పనులు మానుకుని రోజంతా బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు పడుతున్నా నగదు అందుబాటులోకి రావడం లేదు. పెద్ద నోట్లు రద్దు చేసి రోజులు గడుస్తున్న కొద్దీ సమస్య పరిష్కారం కాకపోగా తీవ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజల పరిస్థితి మరింత దుర్భరంగా మారుఽతోంది. శనివారం జిల్లాలోని బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. శనివారం డబ్బు మార్పిడిని సీనియర్‌ సిటిజన్లకు మాత్రమే పరిమితం చేయడంతో మిగిలిన వారు నగదు లభించక ఇబ్బంది పడ్డారు. మరోవైపు ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో సోమవారం వరకూ డబ్బు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో దాదాపుగా అన్ని ఏటీఎంలు మూతపడ్డాయి. కొన్ని ఏటీఎంల వద్ద నో క్యాష్‌ బోర్డులు పెట్టగా, మరికొన్ని ఏటీఎంల షట్టర్లను మూసేశారు. 
 
దళారుల వల
ఆదాయ పన్ను శాఖకు చెల్లించే 30 శాతం నగదు తమకు కమీషన్‌గా ఇస్తే చాలు.. రద్దయిన నోట్లను మార్చి కొత్త నోట్లు ఇస్తామంటూ దళారులు ముందుకు వస్తున్నారు. జిల్లాలోని అన్ని పట్టణాలతోపాటు మండల కేంద్రాల్లోనూ ఈ దందా కొనసాగుతోంది. ఈ నెల 8న కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి, ఖాతాల్లో నగదు జమను రూ.2.50 లక్షలకు పరిమితం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎగువ మధ్య తరగతికి చెందిన వారు తమ అవసరాల కోసం ఇళ్లలో దాచుకున్న పాత పెద్ద నోట్లను మార్చుకోవడం కోసం తంటాలు పడుతున్నారు. భూములు, ఫ్లాట్లు కొనుక్కునేందుకు దాచుకున్న డబ్బును ఇప్పుడు ఎలా మార్చుకోవాలో తెలియక దళారులను ఆశ్రయిస్తున్నారు. కొన్నిచోట్ల బ్యాంకు మేనేజర్లు కూడా ఈ దళారులతో కుమ్మక్కైనట్టు వార్తలు వస్తున్నాయి.
సందట్లో సడేమియా
 మరోవైపు వృద్ధులను మోసం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా ఆచంటలో ఆంధ్రాబ్యాంక్‌లో డబ్బు డిపాజిట్‌ చేయడానికి వెళ్లిన వృద్ధురాలి నుంచి రూ.49 వేలు దొంగిలించుకుపోయారు. బాలంవారిపాలెంకు చెందిన ముంగండ వీరరాఘవులు (65) అనే వృద్ధురాలు డ్వాక్రా సంఘంలో వచ్చిన రుణం, ఆమె దాచుకున్న డబ్బులు కలిపి తన ఖాతాలో జమ చేసేందుకు బ్యాంకుకు వెళ్లగా డబ్బును దొంగలు కొట్టేశారు. జీలుగుమిల్లికి చెందిన వ్యాపారి రూ.34 లక్షలు నేరుగా బ్యాంక్‌ మేనేజర్‌కు కమీషన్‌ ఇచ్చి మార్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రూ.2 వేల నోట్లను జిరాక్స్‌ తీసి వాటిని అమాయకులకు అంటగడుతున్నారు. జిల్లాలో వరసగా ఇటువంటి సంఘటనలు చోటుచేసుకుంటుండటంతో అసలు నోటు ఇచ్చినా తీసుకోవడానికి వ్యాపారులు సంశయిస్తున్న పరిస్థితి కనబడుతోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement