చిన్ననోట్లు ఇప్పట్లో అందుబాటులోకి రావు
చిన్ననోట్లు ఇప్పట్లో అందుబాటులోకి రావు
Published Mon, Nov 21 2016 10:54 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
– సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.2 వేల నోటు వల్ల ప్రయోజనం లేదని, చిన్న నోట్లు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం కనపడటం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో పోలవరం కుడి కాలువ గట్టుపై ఏపీ జెన్‌కో నెలకొల్పిన ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.1000, రూ.500 నోట్ల రద్దు వల్ల కొన్ని సమస్యలు వచ్చాయని, తాను ప్రతిరోజూ ఆ పని మీదే ఉన్నానని, ప్రజల కష్టాలు చూస్తుంటే నిద్ర కూడా రావడం లేదని అన్నారు. కేంద్రం విడుదల చేసిన రూ. 2వేల నోట్లు పెద్ద వారికే ఎక్కువ ఉపయోగపడతాయన్నారు. అవి పేదలకు ఉపయోగపడటం లేదని, చిల్లర నోట్లు దొరకడం లేదని, అవి ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం కనపడటం లేదని అన్నారు. అందుకే అందరూ జన్‌ధన్ యోజన ఖాతాలు తెరవాలని సూచించారు. ఈ నోట్ల కొరత వల్ల వ్యవసాయ పనులు ఆగిపోవడం, చిన్నచిన్న వ్యాపారాలు ఆగిపోవడం, దైనందిన ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోవడానికి వీలు లేదన్నారు. రాబోయే రోజుల్లో అన్నిట్లోనూ ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు వస్తాయని, రేషన్ షాపుల్లోని ఈ పోస్ యంత్రంలో కార్డు పెడితే రూ.20 కట్ చేసుకుని బియ్యం ఇచ్చే పరిస్థితి ఉంటుందని సీఎం అన్నారు. ఎక్కడికక్కడ మొబైల్ బ్యాంకింగ్ వైపు మొగ్గుచూపాల్సిన అవసరం ఉందన్నారు. అందరి వద్ద సెల్‌ఫోన్లు ఉన్నాయి కాబట్టి.. వాటి ఆధారంగా మొబైల్ బ్యాంకింగ్ ఉపయోగించుకుని ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు కొనుక్కోవచ్చన్నారు.
Advertisement