మద్యం దుకాణాల్లోనూ స్వైప్‌ యంత్రాలు | swiping mechines in wine shops | Sakshi
Sakshi News home page

మద్యం దుకాణాల్లోనూ స్వైప్‌ యంత్రాలు

Published Mon, Nov 21 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM

swiping mechines in wine shops

రూ.2 వేల నోటు రద్దుకు కట్టుబడి ఉన్నా
 డిసెంబర్‌ 10న పోలవరం కాంక్రీట్‌ పనులు ప్రారంభం
 పురుషోత్తం పట్నం ఎత్తిపోతల ద్వారా 9 నెలల్లోనే విశాఖకు నీరు
 ఏప్రిల్‌ నాటికి సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో అగ్రస్థానం
 
 
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
రాష్ట్రంలో మద్యం దుకాణాల్లోనూ స్వైప్‌ యంత్రాలను అందుబాటులో ఉంచుతామని, నోట్ల రద్దుతో ఎవరికీ ఇబ్బందులు రాకుండా చూస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నగదు కొరత వల్ల ఇబ్బందులు ఉన్నందున ప్రత్యామ్నాయాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. చౌక దుకాణాల మొదలుకొని ప్రతిచోట స్వైప్‌ యంత్రాలు అందుబాటులో ఉంచడం ద్వారా నోట్ల రద్దు వల్ల ఎదురౌతున్న సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చన్నారు. మద్యం దుకాణాలలో వీటిని ఏర్పాటు చేయడం వల్ల తాగి డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఉండదని, కార్డు కూడా పోగొట్టుకుంటే చేయగలిగిందేమీ లేదని అన్నారు. ఇప్పటికీ రూ.2వేల నోట్ల రద్దుకు తాను పోరాడుతున్నానని, వాటిని రద్దు చేయడమే మంచిదని ఒక ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు చెప్పారు. పెద్దనోట్ల రద్దు వల్ల ఇబ్బందులు ఎదుర్కొనేందుకు క్యాష్, రూపీ, మొబైల్‌ బ్యాంకింగ్‌ వంటి మూడు విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. సహకార బ్యాంకుల్లోనూ నోట్ల మార్పిడి, పాత నోట్లు చెల్లుబాటు అయ్యేలా కేంద్రం, రిజర్వు బ్యాంకు అధికారులతో మాట్లాడుతున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. రుపీకార్డు, ఈపోస్, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు. 
 
డిసెంబర్‌ 10న పోలవరం కాంక్రీట్‌ పనులు ప్రారంభం
డిసెంబర్‌ 10వ తేదీన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కాంక్రీటు పనులను ప్రారంభించనున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి గత రెండున్నర సంవత్సరాల కాలంలో రూ.19 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. జాతీయ ప్రాజెక్ట్‌ కావడంతో దీని నిర్మాణానికి నిధుల కొరత ఏర్పడదని ముఖ్యమంత్రి చెప్పారు. 50 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో, 21 అతిపెద్ద మెయిన్‌ గేట్లతో, 21 మీటర్ల ఎత్తున ఉండే స్పిల్‌వే స్పిల్‌వేకు సంబంధించిన పనులు ఈనెల 29వ తేదీ నాటికి పూర్తి చేసేందుకు కేంద్ర జల వనరుల శాఖతో కలిసి కృషి చేస్తున్నామన్నారు. నిర్మాణంలో పూర్తిగా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నామన్నారు.  
 
9 నెలల్లో ఎడమ కాలువ నుంచి నీరు
పట్టిసీమ నుంచి కుడికాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీరిచ్చిన విధంగానే తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద ఎడమ కాలువపై నిర్మాణం చేపట్టే ఎత్తిపోతల ప్రాజెక్టును 9 నెలల్లో పూర్తి చేసి విశాఖ జిల్లాకు నీరందిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. పట్టిసీమను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక మోడల్‌ ప్రాజెక్టుగా తీసుకుందని చెప్పుకొచ్చారు. 
 
నిర్వాశసితులకు ఇంకేం చేయాలిఽ
పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు ఇప్పటికే ఎంతో చేశామని, రూ.25వేల కోట్ల నుంచి రూ.27వేల కోట్ల వరకూ వివిధ రూపాల్లో నిధులు ఇచ్చామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇస్తున్నామన్నారు. నిర్వాసితులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తున్నామని, కొన్ని కొన్ని తప్పిదాలు జరిగినా అధిగమించి మెరుగైన ప్యాకేజీని అందిస్తున్నామని చెప్పారు.
 
ఏప్రిల్‌ నాటికి సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో అగ్రస్థానం
వచ్చే ఏప్రిల్‌ నాటికి సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఉంగుటూరు మండలం గొల్లగూడెంలో ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో పోలవరం కుడికాల్వ గట్టుపై నెలకొల్పిన ఐదు మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ 2022 నాటికి 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు. భవిష్యత్‌లో ఎక్కడ వీలైతే అక్కడ బొగ్గు, సూర్యరశ్మి, గాలి ద్వారా పెద్దఎత్తున విద్యుత్‌ ఉత్పత్తిని చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు వివరించారు. థర్మ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి వలన కాలుష్యం ఎక్కువ అవుతున్నదని, దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి పెద్ద పీట వేస్తున్నదని చెప్పారు.  ఇప్పటికే 4వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తికి టెండర్లు పిలిచి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలో పనులు ప్రారంభించామన్నారు. వ్యవసాయం వల్ల ఎక్కువ ఆదాయం రాదని, అందువల్ల అనుబంధ పరిశ్రమలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు పంటలు పండుతున్నా కూడా విశాఖ కన్నా తలసరి ఆదాయంలో వెనుకబడి ఉందన్నారు.  విశాఖ ఆదాయంలో ముందుండటానికి  పరిశ్రమలు కూడా ఒక కారణమన్నారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు  దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, జెన్‌కో ప్రిన్సిపల్‌ కార్యదర్శి అజయ్‌జైన్, పోలవరం ఇంజినీరు ఇన్‌ఛీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు కాటంనేని భాస్కర్, హెచ్‌.అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు.  
 
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement