అవే బాధలు | same struggles continue | Sakshi
Sakshi News home page

అవే బాధలు

Published Tue, Dec 6 2016 11:57 PM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM

అవే బాధలు - Sakshi

అవే బాధలు

7వ తేదీ వచ్చినా జమ కాని పింఛన్లు
 సగం జీతమైనా తీసుకోలేకపోయిన ఉద్యోగులు
 ఇంటి అద్దెలు చెల్లించలేక అగచాట్లు
 
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
తెల్లారితే చాలు జనమంతా బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఏడో తేదీ వచ్చినా నగదు కోసం ఇక్కట్లు తప్పడం లేదు. పెద్ద నోట్ల రద్దు పుణ్యామాని ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు.. బ్యాంకుల్లో నగదు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల ఉద్యోగులెవరూ పూర్తి జీతం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ ఇంటి అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎంలలో రోజుకు రూ.2 వేలకు మించి రాకపోవడం, ప్రతిరోజూ బ్యాంకుకు వెళ్లి క్యూలో నిల్చోలేని కారణంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు రూ.10 వేల వరకు మాత్రమే సొమ్ము తీసుకోగలిగారు. పెద్ద నోట్లు రద్దు చేసి 28 రోజులు దాటినా ఇప్పటికీ బ్యాంకుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. 
తగ్గని తోపులాటలు
ఉంగుటూరు మండలం కైకరంలోని ఎస్‌బీఐ బ్రాంచికి మంగళవారం మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడంతో తోపులాట జరిగింది. దీంతో, బ్యాంక్‌ తలుపుల అద్దాలు పగిలిపోయాయి. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో ముహుర్తాలు పెట్టుకున్న వారు డబ్బుల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లి కార్డు చూపించి రూ.2.50 లక్షలు డ్రా చేసుకోవచ్చని చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. బ్యాంకులకు సరిపడా డబ్బులు రావడం లేదు. దీంతో ప్రతి బ్రాంచి ముందు వందలాది మంది క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరికి రూ.2 వేల నుంచి రూ.4 వేల చొప్పున సర్దుబాటు చేస్తున్నారు. ప్రస్తుతం క్యూలో ఉన్న వారికి కొంత మొత్తం ఇవ్వడానికే డబ్బులు సరిపోవడం లేదని, పెళ్లిళ్ల కోసం రూ.2.50 లక్షలు ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో సుదూర ప్రాంతాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి డబ్బుల కోసం వృద్ధులు ఆటోలు కట్టించుకుని రావాల్సి వస్తోంది. ఒకటికి రెండుసార్లు తిరగాల్సి రావడంతో వచ్చిన డబ్బులో సగం ఆటోలకే ఖర్చవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చాలామంది పండుటాకులకు ఇంకా పింఛన్‌ సొమ్ము బ్యాంకుల్లో పడకపోవడంతో వారు బ్యాంక్‌లు, పంచాయతీ కార్యాలయాల వద్ద  పడిగాపులు కాస్తున్నారు. బ్యాంకు ఖాతాకు ఆధార్‌ కార్డు అనుసంధానం కాకపోవడం తదితర సాంకేతిక కారణాలతో మరికొన్ని ఖాతాల్లో సొమ్ము జమ కావడం లేదని మునిసిపల్‌ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికీ చిల్లర దొరకకపోవడం, రూ.500 నోట్లు సరిపడా అందుబాటులోకి రాకపోవడం వల్ల ప్రజల ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయి. ఏపీకి రూ.2 వేల కోట్లకు పైగా నగదు వచ్చిందని, ఆ మొత్తాలను జిల్లాలకు పంపించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా ఎక్కడా అవసరానికి సరిపడా డబ్బులు అందలేదు. దీంతో బ్యాంకుల్లో ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement