బాబ్బాబు.. పోలవరం రండి
బాబ్బాబు.. పోలవరం రండి
Published Thu, Dec 29 2016 9:58 PM | Last Updated on Mon, Sep 4 2017 11:54 PM
సీఎం చంద్రబాబు పర్యటనకు జనాన్ని తరలించేందుకు పాట్లు
అధికారులకు టార్గెట్లు
జిల్లా నుంచి 40 వేల మందిని తరలించాలని ఆదేశం
’తూర్పు’ నుంచి 20 వేల మందిని తీసుకు రావాలని లక్ష్యం
వెయ్యికి పైగా స్కూల్ బస్సులను స్వాధీనం చేసుకున్న రవాణా శాఖ
ప్రైవేట్ పాఠశాలలకు, క్వారీ పరిశ్రమలకూ సెలవు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పర్యటన అధికారులకు తలనొప్పిగా మారింది. పోలవరం ప్రాజెక్ట్ వద్ద స్పిల్ వే కాంక్రీట్ పనులు ప్రారంభించేందుకు వస్తున్న ముఖ్యమంత్రి అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సభను విజయవంతం చేసే బాధ్యత అధికారులపై పెట్టారు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారందరినీ ఈ సభకు తరలించాల్సిందేనని ఆదేశాలు అందాయి. దీంతో డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, వివిధ పథకాల కింద లబ్ధి పొందిన వారిని బహిరంగ సభకు రావాలంటూ అధికారులు బ్రతిమలాడుతున్నారు. జనాన్ని పోలవరం తరలించే విషయంలో ఆ శాఖ ఈ శాఖ అని లేకుండా అన్ని శాఖల అధికారులకు లక్ష్యాలు నిర్దేశించారు. చివరకు వ్యవసాయ శాఖ అధికారులపైనా జనాన్ని తీసుకొచ్చే బాధ్యతలు పెట్టారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి రైతులను, తెలుగుదేశం కార్యకర్తలను తరలించాలని నిర్ణయించారు. ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి 40 వేల మందిని, తూర్పుగోదావరి జిల్లా నుంచి 20 వేల మందిని తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి టార్గెట్లు ఇచ్చారు. శుక్రవారం ప్రైవేట్ స్కూల్స్‌కు సెలవు ప్రకటించారు. స్కూల్ బస్సులను తమకు అప్పగించాలని రవాణా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని ఇంజినీరింగ్ కళాశాలల నుంచి విద్యార్థులను తరలించేందుకు పాఠశాలల బస్సులను పోలవరంవైపే నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి మండలం నుంచి వెయ్యి మందిని తీసుకురావాలని జిల్లా కలెక్టర్ నుంచి తహసీల్దార్లకు ఆదేశాలు అందాయి. ప్రతి మండలానికి 20 నుంచి 35 బస్సులు వస్తాయని, వీటిని గ్రామాలకు పంపించి జనాన్ని ఎక్కించి ప్రాజెక్టు వద్దకు పంపాలని ఆదేశాలు అందాయి. జన సమీకరణ చేయాల్సిన బాధ్యతను వీర్వోలు, వెలుగు సిబ్బంది, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. ఈ బాధ్యతను అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులకు అప్పగించకుండా ఉద్యోగులపై భారం వేయడం విమర్శలకు దారితీస్తోంది. మరోవైపు పోలవరం నిర్వాసితుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతాయనే భయం నెలకొంది. ఆ ప్రాంతం కొండల మధ్య ఉండటం, మావోయిస్టుల ప్రభావం ఉంటుందన్న అనుమానంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 7 వేల మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. సభకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, ఉమాభారతి హాజరుకానున్నట్టు సమాచారం.
క్వారీ పరిశ్రమలకూ సెలవు
దేవరపల్లి :ముఖ్యమంత్రి పోలవరం పర్యటన సందర్భంగా దేవరపల్లి, కొవ్వూరు మండలాల్లో గల నల్లరాతి క్వారీలు, క్రషర్లకు శుక్రవారం సెలవు ప్రకటించాలని ఆదేశాలు అందాయి. దీనివల్ల సుమారు 6 వేల మంది కార్మికులు ఒకరోజు ఉపాధి కోల్పోతారని కార్మిక సంఘం నాయకుడు షేక్ మస్తాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు గుండుగొలనుకొవ్వూరు, పోలవరం రోడ్డుపై క్వారీ లారీలు తిప్పవద్దని జల్లా అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో యజమానులు పరిశ్రమకు సెలవు ప్రకటించారు. ఈ కారణంగా సుమారు 67 క్వారీలు, 115 క్రషర్లు మూతపడనున్నాయి. దాదాపు రెండు వేల క్వారీ లారీలు నిలిచిపోనున్నాయి.
Advertisement