’కట్టలు’ తెగాయ్‌ | Ðcock fight betting | Sakshi
Sakshi News home page

’కట్టలు’ తెగాయ్‌

Published Fri, Jan 13 2017 9:37 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM

’కట్టలు’ తెగాయ్‌

’కట్టలు’ తెగాయ్‌

 పందెం కోడి గెలిచింది
 జూదం జూలు విదిల్చింది
 పనిచేయని కోర్టు ఉత్తర్వులు, పోలీస్‌ ఆంక్షలు
 నేడు, రేపు ఇదే జోరు
 సెక‌్షన్‌ 144 విధిస్తున్నట్టు ప్రకటించిన కలెక్టర్‌
 కనిపించని జాయింట్‌ యాక‌్షన్‌ టీమ్‌లు
 మార్టేరులో పొట్టేలు పందేలు
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
పండగ వేళ పందెం కోడి గెలిచింది. కోర్టులిచ్చిన ఉత్తర్వులు అపహాస్యం పాలయ్యాయి. సంప్రదాయం పేరిట రాజకీయ పార్టీల నేతలు దగ్గరుండి మరీ కోడి పందేలు వేయించారు. ఒకరోజు ముందువరకూ హడావుడి చేసిన జాయింట్‌ యాక‌్షన్‌ టీములు, పోలీసులు పత్తా లేకుండా పోయారు. శుక్రవారం సాయంత్రానికి కోడి పందేలు నిర్వహించే చోట 144 సెక‌్షన్‌ అమలు చేస్తున్నట్టు కలెక్టర్‌ కె.భాస్కర్‌ ప్రకటించగా, ఎక్కడా దాని ప్రభావం కనపడలేదు. కోడిపందేల ముసుగులో జూదం యథేచ్ఛగా సాగింది. మద్యం ఏరులై పారింది. మీడియాను అనుమతించకుండా పోటీలు జరుపుకోవచ్చని ప్రభుత్వం నుంచి అనధికారికంగా అనుమతులు రావడంతో పందేలరాయుళ్లు చెలరేగిపోయారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో
ఖమ్మం జిల్లా జూబ్లీపుర గ్రామానికి చెందిన గంగవరపు లక్ష్మీదయాకర్‌ అనే వ్యక్తి తన లైసెన్స్‌ రివాల్వర్‌తో మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి మరీ తన అనందాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా పందేల రాయుళ్ల మధ్య బెట్టింగ్‌లు జరిగాయి. గాల్లోకి కాల్పులు జరిపిన దయాకర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పెనుమంట్ర మండలం మార్టేరులో పొట్టేలు పందేలు నిర్వహించారు.
 
ఎక్కడ చూసినా పందేలే
భీమవరం మండలం వెంపలో ఫ్లడ్‌ లైట్ల వెలుగుల నడుమ రేయింబవళ్లు పందేలు వేస్తున్నారు. ఆకివీడు మండలం ఐ.భీమవరం గ్రామంలో ప్రధాన బరిగా ఉన్న ఎఫ్‌సీఐ గోడౌన్ల ప్రాంతంలో కోడి పందేలు వేయరాదంటూ పోలీసులు, రెవిన్యూ యంత్రాంగం అడ్డుకుంది. ఒక దశలో పందేల రాయుళ్లు తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. చివరకు ఉండి ఎమ్మెల్యే కలవూడి శివ వత్తిడితో మధ్యాహ్నం నుంచి అనుమతి ఇచ్చారు. పోలేరమ్మ గుడివద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డింకీ పందాలను ఎమ్మెల్యేతో బీజేపీ నేతలు కనుమూరి రఘురామకృష్ణంరాజు, శ్రీనివాస వర్మ తిలకించారు. భీమవరం మండలం వెంప, తోకతిప్ప గ్రామాల్లో భారీ పందేలు వేస్తుండగా దిరుసుమర్రు, ఈలంపూడి, వీరవాసరం మండలంలోని కొణితివాడ, నవుడూరు, ఉత్తరపాలెం, అండలూరు, వీరవాసరం, నందమూరు గరువు తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. వీరవాసరం మండలం కొణితివాడ చుట్టుపక్కల గ్రామాల ఏడు గ్రామాల్లోని సంఘ పెద్దలు ఉత్తరపాలెంలో నిర్వహించే కోడి పందాలకు పోటీగా మరొక బరిని సిద్ధం చేయడంతో మహిళలు అడ్డుకున్నారు. దేవరపల్లి మండలంలో దేవరపల్లి, చిన్నాయిగూడెం, పల్లంట్ల, త్యాజంపూడి, లక్ష్మీపురం గ్రామాల్లో భారీ పందేలు నిర్వహించారు. గోపాలపురం మండలం గుడ్డిగూడెం, వెంకటాపాలెం, కొవ్వూరుపాడు, వాదాలకుంట గ్రామాల్లో పందేలు జరిగాయి. నల్లజర్ల మండలం నల్లజర్ల, అనంతపల్లి, చోడవరం, పోతవరం, ద్వారకాతిరుమల మండలంలో రాళ్లకుంట, వెంకటకృష్ణాపురం, దోసన్నపాడు, తిమ్మాపురం గ్రామాల్లో భారీగా పందేలు ప్రారంభించారు. తొలిరోజు పందేలకు ప్రముఖులు ఎవరూ హాజరుకాకపోయినప్పటికీ మండల స్థాయి టీడీపీ నాయకులు బాధ్యతలు తీసుకుని జోరుగా నిర్వహించారు. దెందులూరులో ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ దగ్గరుండి మరీ పందేలను నిర్వహిస్తున్నారు. పెదవేగి మండలం కొప్పాకలో పోటీల వద్దకు పోలీసులు, మీడియా రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొగల్తూరులో పందేలు నిర్వహించే బరికి వేలం నిర్వహించారు. నిడమర్రు మండలం పత్తేపురంలో భారీ పందేలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు వీటిని ప్రారంభించారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు.  ఈ బరిని స్థానిక నాయకుడొకరు రూ.32 లక్షలు చెల్లించి వేలంలో దక్కించుకున్నట్టు సమాచారం. 
 
జూలు విదిల్చిన జూదం.. ఏరులై పారిన మద్యం
కోడి పందేల బరులకు అనుబంధంగా కోతాట, గుండాట పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. అక్కడే మద్యం లూజు విక్రయాలు భారీగా సాగుతున్నాయి. నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో భీమేశ్వరస్వామి ఆలయం వద్ద పందేలు జరుగుతున్నాయి. బువ్వనపల్లి, తోకలపల్లి గ్రామాల్లో చిన్న బరులు ఏర్పాటు చేఽశారు.  ఇక్కడ పందేల కంటే పేకాట, గుండాట వంటి జూదాలకే అధిక ప్రాధాన్యత ఉంది. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని 14 గ్రామాల్లో కోడి పందాల శిబిరాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకూ ఎటువంటి అనుమతులు ఇవ్వకపోవడంతో బరులు ఏర్పాటు చేసే ప్రాంతాల వద్ద పోలీసులు పికెట్‌లు ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించారు. 11గంటల తరువాత పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనధికారిక అనుమతులు రావడంతో పోలీసు గప్‌చిప్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మార్టేరు, ఆలమూరు, పెనుమంట్ర, వడలి, సిద్ధాంతం, దొంగరావిపాలెం, ములపర్రు, ఆచంట, కొడమంచిలి, వల్లూరు గ్రామాలలో కోడి పందేలు, జూదం నిర్వహించారు. ఆచంట మండలం వల్లూరులో పందేల బరిని వేలం వేయగా, గ్రామానికి చెందిన  ఒక వ్యక్తి రూ.2 లక్షలకు దక్కించుకున్నట్టు సమాచారం. చింతలపూడి మండలం వెంకటాపురం, సీతానగరం, నాగిరెడ్డిగూడెం, లింగపాలెం మండలంలోని కొణిజర్ల, ములగలంపాడు, కామవరపుకోట మండలం రావికంపాడు, కళ్లచెర్వు, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో  భారీగా పందేలు నిర్వహించారు. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల్లో ఉదయం 10 గంటలకే కోడి పందేలు, గుండాట, కోతాట తదితర జూద క్రీడలు ప్రారంభించారు. పాలకొల్లు మండలంలో టీడీపీ నేత ఆధ్వర్యంలో పూలపల్లి బైపాస్‌ రోడ్డులో కోడి పందేలు వేశారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోని గుంజవరం, గూటాల, పి.రాజవరం, పి.అంకంపాలెం, కామయ్యపాలెం, రాచన్నగూడెం, ములగలంపల్లి, తాటియాకులగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, బూసరాజుపల్లి, దొరమామిడి, వెలుతురువారిగూడెం, టి.నరసాపురం, బందంచర్ల, రామవరం, తిరుమలదేవిపేట, అప్పలరాజుగూడెం, రామానుజపురం, బయ్యనగూడెం, కుక్కునూరు మండలం వీరవల్లి, వేలేరు గ్రామాల్లో కోడిపందేలు జరిగాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement