కోడిపందాల నిర్వహణకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాల నిర్వహణకు ఎవ్వరికీ అనుమతినిచ్చే ప్రసక్తే లేదని హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందాలను నిర్వహించినా, జూదం ఆడినా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్‌పీలకు గత ఏడాది జారీ చేసిన ఆదేశాలను రాతపూర్వకంగా తమ ముందుంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ బొసాలే, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో చట్టాలను ఉల్లంఘించి సంక్రాతి సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పెందాలు నిర్వహిస్తున్నారని, ఈ పోటీల్లో సంఘ వ్యతిరేక శక్తులు పాల్గొంటున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని అదే జిల్లాకు చెందిన నరహరి జగదీష్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరగా, కోడి పందాల నిర్వహణకు తాము ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదని, పందాలు నిర్వహించినా, జూదం ఆడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్‌పీలకు ఆదేశాలిచ్చామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.
దీనిని రికార్డ్ చేసుకున్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణను ముగిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఆ వ్యాజ్యంలో పిటిషనర్ మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. సంక్రాంతి సందర్భంగా మళ్లీ కోడి పందాల నిర్వహణకు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, పోలీసులు తగిన విధంగా స్పందించడం లేదని పిటిషనర్ వివరించారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం కోడి.