కోడి రె‘ఢీ’..! | Police Focus On Cock Fights In the Godavari districts | Sakshi
Sakshi News home page

కోడి రె‘ఢీ’..!

Published Tue, Jan 14 2020 5:44 AM | Last Updated on Tue, Jan 14 2020 5:44 AM

Police Focus On Cock Fights In the Godavari districts - Sakshi

సాక్షి, అమరావతి: కోడి పందేలు జరగనివ్వబోమని పోలీసులు.. జరిపి తీరుతామని నిర్వాహకులు.. ఇలా ఏటా సంక్రాంతి ముందు జరిగే తంతే. ఈ ఏడాది కూడా అదే సీన్‌ రిపీట్‌ అవుతోంది. కానీ, ఈసారి ఒకింత ఉత్కంఠ నెలకొంది. ఉభయ గోదావరి జిల్లాలు సంక్రాంతి మూడు రోజులపాటు కోడి పందేలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వాటిని నిర్వహించడాన్ని ప్రతిష్టగా భావించే వాళ్లంతా మళ్లీ రంగంలోకి దిగారు. ఏదో రకంగా ఒత్తిడి తెచ్చి అనుమతులు తెచ్చుకుంటామనే ధీమాతో నిర్వాహకులు బరి గీస్తున్నారు. ఇందులో భాగంగా  ఉభయ గోదావరి జిల్లాల్లోని వందల గ్రామాల్లో కోడి పందేల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాల్లోని భీమవరం, వెంప, జువ్వలపాలెం, ఐ.భీమవరం, యండగండి, కేశవరం, జంగారెడ్డిగూడెం, పోలవరం, ఎదుర్లంక, కేశనకుర్రు, గోడితిప్ప తదితర 60కి పైగా ప్రాంతాల్లో భారీ పందేల బరులు సిద్ధంచేసుకున్నారు. మరో 400 ఓ మోస్తరు బరులు సిద్ధంచేస్తున్నారు. 

కొనసాగుతున్న పోలీసుల దాడులు
కోడి పందేలకు వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పోలీసులు వాటిని అడ్డుకునేందుకు గట్టి చర్యలు చేపట్టారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఆదివారం వరకు పోలీసులు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు పెద్దఎత్తున దాడులు చేసి శనివారం వరకు 638 కేసులు నమోదు చేశారు. 2,730 మందిపై బైండోవర్‌ కేసులు కట్టారు. కత్తులు కట్టే వారిపై కూడా కేసులు నమోదు చేశారు. పందేలు నిర్వహించకుండా ఆయా ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీసు, స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులతో కమిటీలు వేశారు. 

మద్యం, పేకాటపై ఉక్కుపాదమే..
సంప్రదాయం పేరుతో ఒత్తిడి తెచ్చి కోడి పందేలు నిర్వహించుకోవడానికి పోలీసులు అనధికారికంగా అనుమతిస్తే అవి మూడు రోజులపాటు జరుగుతాయి. ప్రతి బరి వద్ద మద్యం విక్రయాలతోపాటు, పేకాట, గుండాట తదితర ఆటలు పెద్దఎత్తున జరిగేవి. వీటిని నిర్వహించుకునేందుకు గాంబ్లింగ్‌ నిర్వాహకుల వద్ద నుంచి కోడి పందేల నిర్వాహకులకు లక్షల్లో డబ్బులు ముట్టేవి. ఇదే ధైర్యంతో ఈసారి పెద్ద బరుల వద్ద జూదం నిర్వహణకు, మద్యం విక్రయాలకు అనేకమంది వేలం పాట పాడి పెద్ద మొత్తాల్లో డబ్బులు ఇచ్చేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉదా.. తూర్పుగోదావరి జిల్లాలోని ఎదుర్లంక బరికి రూ.65 లక్షలు, గోడితిప్ప రూ.50లక్షలు, కేశనకుర్రు రూ.20లక్షలు చొప్పున చెల్లించి ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. ఇలా అనేక బరుల వద్ద పేకాట, మద్యం అమ్మకాలకు ఒప్పందాలు జరిగాయి. అయితే, ఈసారి కోడి పందేలకు ఒకవేళ అనుమతిచ్చినా అక్కడ పేకాటలు, మద్యం విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపే అవకాశం ఉందని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement