కోర్టు వద్దన్నా.. కోఢీ కూస్తోంది | court vaddanna.. kodhee koostondi | Sakshi
Sakshi News home page

కోర్టు వద్దన్నా.. కోఢీ కూస్తోంది

Published Tue, Dec 27 2016 12:37 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

కోర్టు వద్దన్నా.. కోఢీ కూస్తోంది - Sakshi

కోర్టు వద్దన్నా.. కోఢీ కూస్తోంది

సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోడి పందేలకు హైకోర్టు బ్రేక్‌ వేసింది. ఎక్కడా వీటిని నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చింది. కోడి పందేల పేరుతో జూద క్రీడలు, మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడి పందేల పేరుతో జంతువులను హింసిస్తున్నారని పీపుల్‌ ఫర్‌ యానిమల్‌ ఆర్గనైజేషన్, యాని మల్‌ వెల్ఫేర్‌ బోర్డు దాఖలు చేసిన పిటీషన్లపై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. వీటిని అడ్డుకునేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఉత్తర్వు లిచ్చింది. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ ఆదేశాలు ఏమేరకు అమలవుతాయన్నదే ప్రశ్నార్థకంగా మారింది. కొన్నేళ్లుగా 
సంప్రదాయం పేరుతో ప్రజాప్రతినిధులే ముందుండి కోడిపందేలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జిల్లాలో ప్రధానంగా భీమవరంలో ప్రకృతి ఆశ్రమం, వెంప, లోసరి, ఆకివీడు మండలం ఐ.భీమవరం, కాళ్ల మండలం సీసలి, ఉండి మండలం మహదేవపట్నం తదితర ప్రాంతాల్లో పందేలు నిర్వహించేందుకు బరులను సిద్ధం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం, లింగపాలెం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో భోగి రోజు నుంచి కనుమ వరకు రాత్రీపగలు తేడా లేకుండా.. ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. 
 
‘ఉత్త’ర్వులేనంటూ..
గత ఏడాది కూడా హైకోర్టు ఆదేశాలు, లోకాయుక్త ఉత్తర్వులు, పోలీసుల ఆంక్షలను తోసిరాజని ప్రజాప్రతి నిధులు స్వయంగా కోడిపందేలు వేశారు. కత్తులు కట్టకుండా డింకీ పందేలు ఆడిస్తున్నామంటూ.. ఎడాపెడా పందేలు వేయించారు. ఈ ఏడాది కూడా అదేవిధంగా జిల్లావ్యాప్తంగా భోగి రోజు మొదలు కోడి పందేలు ఆడించేందుకు బరులు సిద్ధం చేస్తున్నారు. మెట్ట, డెల్టా ప్రాంతాల్లో 50కి పైగా బరులను ఇప్పటికే రెడీ చేసినట్టు సమాచారం. హైకోర్టు ఉత్తర్వులు తమకు ఇంకా అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఈసారి మాత్రం కోర్టు ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని ఏలూరు రేంజి డీఐజీ పీవీ రామకృష్ణ, ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే జిల్లాలో 325 మందిపై బైండోవర్‌ కేసులను నమోదు చేశామని వివరించారు. కోడి పందేల బరులు ఏర్పాటు చేసేవారు, కోళ్లకు కత్తులు కట్టేవారు, పందెం కోళ్లు పెంచేవారితో పాటు పందేలను ప్రోత్సహించే వారిని గుర్తించి బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నారు. గేమింగ్‌ యాక్ట్, ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయల్టీ టువార్డ్స్‌ యానిమల్స్‌.. సెక్షన్ల కింద కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కోడిపందేల నేపథ్యంలోనే జిల్లాలో సీఐల బదిలీలకు బ్రేక్‌ వేసిన సంగతి తెలిసిందే. అయితే. బదిలీ రేసులో ఉన్న ప్రతి సీఐలు తమకు కావాల్సిన ప్రాంతం కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి లేఖలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరు అధికార పార్టీ నేతలను కాదని కోడి పందేలను ఏ మాత్రం అడ్డుకుంటారో తేలాల్సి ఉంది. మూడు రోజులపాటు సాగే పందేలు, జూదాల్లో  సుమారు రూ.200 కోట్లు చేతులు మారతాయని అంచనా. ఏది ఏమైనప్పటికీ సంక్రాంతికి మూడు వారాల ముందే హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో పందేలరాయుళ్లలో కలకలం మొదలైంది.
 
స్వైపింగ్‌ యంత్రాలు సిద్ధం!
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు కష్టాలు తలెత్తడంతో పందేల్లోనూ నగదు రహిత లావాదేవీలు నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు స్వైపింగ్‌ మెషిన్లు సమకూర్చుకున్నట్టు భోగట్టా. నగదు సమకూరని పరిస్థితుల్లో వీటిని వినియోగించాలన్నది నిర్వాహకుల ఉద్దేశం. ఇదిలావుంటే భీమవరం పరిసర ప్రాంతాల్లో కొన్ని బ్యాంకుల నుంచి కొందరు నెల రోజులుగా రూ.2 వేల నోట్ల సేకరణలో నిమగ్నమయ్యారు. రూ.100 నోట్లనూ అందుబాటులో ఉంచుకుంటున్నారు. కోడిపందేల సమయానికి రూ.500 కొత్త నోట్లు ఎలాగూ అందుబాటులోకి వస్తాయని, తద్వారా పందేల జోరు మరింత ఎక్కువగా ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు. చిన్న పందేల్లో కూడా రూ.2 వేలకు తగ్గకుండా ఉంటుందని అంటున్నారు.
 
జూద క్రీడలకు వేలం పాటలు 
కోడిపందేల బరుల ఏర్పాటు చేసే నిర్వాహకులు ఇప్పటికే గుండాట, కోతాట వంటి జూద క్రీడల కోసం స్థలాలు కేటాయించి వేలం నిర్వహిస్తున్నారు. గతేడాది పూలపల్లి, యలమంచిలి, భీమవరం, ఉండి, వెంప తదితర ప్రాంతాల్లో ఒక్కో బరి వద్ద జూదక్రీడా శిబిరాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు బరులు సమకూర్చిన వారికి రూ.28 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు చెల్లించారు. అదే విధానం కొనసాగిస్తూ ఇప్పుడు కూడా వేలం మొదలైంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement