పుంజుకున్నాయ్
న్యాయస్థానాల ఉత్తర్వులు.. పోలీసుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా కోడిపందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. డెల్టా, మెట్ట ప్రాంతాల్లో పెద్దఎత్తున బరులు వేశారు. వాటిచుట్టూ గుండాట, పేకాట, కోతాట వంటి జూదాలను నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేశారు. డెల్టా ప్రాంతంలోని భీమవరం, వెంప ప్రాంతాల్లో పెద్దఎత్తున కోడి పందాలు నిర్వహించేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి పందాల రాయుళ్లు భీమవరం తరలివచ్చారు.
భీమవరం/నల్లజర్ల :సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో కోళ్లకు కత్తులు కట్టకుండా.. బెట్టింగ్‌లు వేయకుండా పందాలు నిర్వహిస్తామని పైకి చెబుతున్నప్పటికీ బరుల్లో బరితెగించి పందాలు వేసేందుకు నిర్వాహకులు కత్తులు నూరుతున్నారు. పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు భీమవరంలో తన నివాసంలో మంగళవారం పందెం వేసి.. జిల్లాలో తాను కోడి పందాలను ప్రారంభించినట్టు ప్రకటించుకున్నారు. కత్తులు, బెట్టింగ్‌లు లేకుండా పందాలు నిర్వహించటం ద్వారా సంప్రదాయాలను కాపాడవచ్చని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
మెట్టలోనూ..
మెట్ట ప్రాంతంలో బుధవారం నుంచి ఫ్లడ్‌లైట్ల వెలుగులో నిరంతరాయంగా పందాలు నిర్వహించేందుకు పలుచోట్ల ఏర్పాట్లు చేశారు. ద్వారకాతిరుమల, నల్లజర్ల, తాడేపల్లిగూడెం, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో పెద్దఎత్తున పందాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. నల్లజర్లలోని శ్రీనివాసా థియేటర్ వెనుక విశాలమైన ప్రదేశంలో షామియానాలు వేసి ముందస్తు ఏర్పాట్లు చేశారు. జిల్లాస్థాయి ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో ఈ ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెబుతున్నారు. రాత్రివేళ కూడా కోడి పందాలు, జూదాలు నిర్వహిం చేందుకు అనువుగా భారీ జనరేటర్ సాయంతో ఫ్లడ్‌లైట్లు బిగించారు. ఇక్కడ ఒక్క గుండాట కోసమే బరి నిర్వాహకులకు రూ.3 లక్షలు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. నల్లజర్ల మండలం అనంతపల్లి, చోడవరం, తెలికిచెర్ల, పోతవరం, దూబచర్లలో కూడా బరులు సిద్ధం చేస్తున్నారు.
అడ్డుకునేందుకు పోలీసుల యత్నం
కోడి పందాలను అడ్డుకునేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పందాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో పెద్దఎత్తున బలగాలను మోహరించారు. జిల్లాలో పెద్ద బరులైన వెంప, భీమవరం ప్రకృతి ఆశ్రమం, ఐ.భీమవరం, లోసరి ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. బరుల వద్ద వేసిన షామియానా, ఫర్నిచర్‌ను పోలీసులు తొలగించి స్టేషన్లకు తరలిస్తున్నారు. దీంతో కోడి పందాల బరుల వద్ద తీవ్ర గందరగోళం నెలకొని ఉంది.