కొత్త కరెన్సీ పై రంగుపడితే చెల్లదు
కొత్త కరెన్సీ పై రంగుపడితే చెల్లదు
Published Tue, Dec 6 2016 10:29 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM
పాలకొల్లు టౌన్:: కరెన్సీ నోట్లపై ఆకతాయిల పిచ్చిరాతలు.... వ్యాపారులు డినామినేషన్ కోసం(నోట్లు లెక్కింపు గుర్తు కోసం) పెన్సిల్, బాల్‌పెన్ ఉపయోగించి కరెన్సీ నోట్లపై రాయడం ఇప్పటివరకు జరుగుతూనే వచ్చింది. అయితే పెద్దనోట్లు రద్దు తరువాత కొత్త రెండు వేల నోటుపై పెన్సిల్, బాల్‌పెన్‌లతో ఏవిధమైన రాతలు రాసినా బ్యాంక్ అధికారులు చెల్లవని చెప్పడంతో ఖాతాదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజర్వు బ్యాంక్ గతంలోనే కరెన్సీ నోట్లపై ఏవిధమైన రాతలు రాయకూడదని పబ్లికేషన్ ఇచ్చినట్లు కొంతమంది బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. ఈ ఆదేశాలు బ్యాంక్ అధికారులకు, ఉన్నతస్థాయి వర్గాలకు మాత్రమే తెలుసు. దీనిపై రిజర్వుబ్యాంక్, జాతీయ బ్యాంకులు ఈ విషయాలను సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వివరించకపోవడంతో కొత్తనోట్లపై రాతలతో ఆ నోట్లు మారక సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు అన్ని బ్యాంకుల్లోనూ ఖాతాదారులు తీసుకువెళ్లిన నోట్లు లెక్కింపు తరువాత బ్యాంక్ క్యాష్ కౌంటర్‌లోని ఉద్యోగి పెన్సిల్‌తో రాయడం అందరికీ తెలిసిందే. కొత్త నోట్లు రద్దు తరువాత బ్యాంక్ అధికారుల ఇచ్చిన ఆదేశాల మేరకు బ్యాంకు ఉద్యోగులు డినామినేషన్ కోసం పెన్సిల్‌తో రాయడం మానేసి అటువంటి కరెన్సీ ఖతాదారులు తీసుకుస్తే తీసుకోకపోవడం వంటి చర్యలు చేపట్టారు. కాయకష్టం చేసుకునే రోజువారి కార్మికులకు తమ కష్టానికి సొమ్ము చేతిలో పడిందనే ఆతృత తప్ప ఇవి పరిశీలించే ఆలోచన వారికి ఉండదనేది అందరికీ తెలిసిన విషయమే. గత రెండు రోజులుగా ఖాతాదారులు, కార్మికులు పెన్సిల్, పెన్ గీతాలున్న రూ.2వేలు నోట్లు పట్టుకుని కొంతమంది బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోవడంతో పాటు ఆ నోట్లు తీసుకోమని తిరస్కరించడంతో దిక్కుతోచని స్థితిలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొట్టిమిట్టాడుతున్నారు. అయితే కొంతమంది బ్యాంక్ అధికారులను వివరణ కోరాగా కరెన్సీనోట్లపై ఏ విధమైన రాతలు రాసినా స్కానింగ్ అవ్వదని రిజర్వు బ్యాంక్ గతంలో ఆదేశాలు జారీ చేసిందని చెబుతున్నారు. అయితే జిల్లాలోని ఏ బ్యాంకులోనూ కొత్త రూ.2వేల నోటుపై పెన్సిల్, బాల్‌పెన్ రాతలు ఉంటే ఖాతాదారుల నుంచి తీసుకోవడం లేదు. దీనిపై రిజర్వుబ్యాంక్ అధికారులు, బ్యాంక్ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని పలువురు చెబుతున్నారు.
Advertisement