నోటెత్తిన కష్టాలు....
నోటెత్తిన కష్టాలు....
Published Sat, Nov 12 2016 6:35 PM | Last Updated on Mon, Sep 4 2017 7:55 PM
తీరని నోట్ల కొరత
నలుపు, తెలుపు చేసేందుకు అడ్డదారులు
హవాలాపై దృష్టి పెట్టిన కుబేరులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఐదు రోజులు దాటినా ఇప్పటికీ ప్రజల కష్టాలు తీరలేదు. ప్రజలు పనులు మానుకుని బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు క్యూకడుతున్నారు. చిల్లర తీసుకున్నవారే ప్రతిచోటా తీసుకుంటుండటంతో డబ్బులు సరిపోవడం లేదని అందువల్ల ఆదివారం నుంచి చిల్లర మార్చుకునే వారికి ఓటు వేసినప్పుడు వాడే ఇంకు వంటిది వేలిమీద వేయాలని బ్యాంకర్లు భావిస్తున్నారు. నోట్లు మార్చుకునేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉదయం ఎనిమిది గంటల నుంచే బ్యాంకుల ముందుకు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు తాము దాచుకున్న ఐదు వందలు, వెయ్యి రూపాయలలో కొన్ని నకిలీ నోట్లు అని తేలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకూ బయట చెలామణిలో ఉన్న డబ్బులో నకిలీ నోట్లు ఎక్కువగానే చెలామణి అయ్యాయి.అయితే బ్యాంకుల వద్దకు అవి వెళ్లకపోవడంతో యధేశ్చగా చెలామణి అయిపోయాయి. ఇప్పుడు బ్యాంకర్లు వాటిని నకిలీ నోట్లుగా గుర్తించి చింపివేస్తుండటంతో వాటిని మార్చుకోవడానికి వచ్చిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆక్వా ఎగుమతుల నుంచి, వ్యాపార లావాదేవీల నిమిత్తం ఖరీదుల కోసమని ఇతర రాష్ట్రాలకు వెళ్ళే బడా,బడా వ్యాపారులు గతంలో హవాలా ద్వారా డబ్బులు ఏర్పాటు చేసుకునేవారు. అయితే ఇప్పుడు హవాలా వ్యాపారం దాదాపుగా దెబ్బతింది. దీంతో అక్వా రంగంపై నోట్ల రద్దు అంశం తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. ఇకపై బ్యాంకుల ద్వారా లావాదేవీలు జరిపితే ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో పన్నులు కట్టాల్సి ఉంటుంది. మరి దీనికి సిద్దపడతారా వేరే మార్గం వెతుకుతారా అన్నది మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. ఇప్పటి వరకూ బ్యాంకుల వద్దకు సామాన్య, మద్య తరగతి ప్రజలే వస్తున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు. నల్లదనం వెలికి తీయడానికి అంటూ రద్దు చేసిన నోట్ల వల్ల నల్లదనం ఇప్పటి వరకూ బయటకు రాలేదని సమాచారం. నల్లదనం ఉన్న వారు ఈ నోట్లను మార్చుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం. నల్లదనాన్ని కాపాడుకునేందుకు ఎక్కువ మంది బంగారం కొనుగోళ్లు జరిపినట్లు సమాచారం. మరోవైపు ఎక్కువ మందికి బ్యాంకులో రెండువేల రూపాయల కొత్త నోట్లు ఇస్తున్నారు. అయితే అంత మొత్తానికి చిల్లర ఇవ్వలేని పరిస్థితి ఉండటంతో వాటిని మార్చడం కూడా ఇబ్బందికరంగా మారింది. రద్దయిన రూ. 500 స్థానంలో కొత్త నోట్లు ఇంకా బ్యాంకులకు చేరకపోవడంతో ఖాతాదారులకు కేవలం రూ. 2వేల నోట్లు మాత్రమే ఇస్తుండడంతో సామాన్యులు వీటిని ఏమి చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. రోజు వారి ఖర్చులకు ఎవరి దగ్గరకు వెళ్లినా చిల్లరలేదని చెబుతున్నారని వాపోతున్నారు. తమ వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేసేందుకు గంటల తరబడి లైనులో నిలబడినా, బ్యాంకు అధికారులు చేతిలో రూ. 2వేల నోటు పెడుతుండడంతో వారు నిరాశకు గురవుతున్నారు. చాలా చోట్ల బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు శ్రద్ద చూపిస్తున్నారుగాని నోట్లు మార్చడానికి ఇప్పుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోస్టాఫీసుల్లో నోట్ల కొరత వేధిస్తోంది. బ్యాంకుల నుంచి సరిపడా చిల్లర తమకు ఇవ్వకపోవడం వల్ల తాముప్రజల చేత తిట్లు తినాల్సి వస్తోందని పోస్టల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement