పశ్చిమగోదావరి, నిడమర్రు: ఆర్జించిన నగదుపై రాబడి వచ్చే ఇతర పెట్టుబడి మార్గాల్లో దాచుకోవడంతో భవిష్య నిధిపై భరోసా ఉంటుంది. ఆర్థికపరంగా ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా పెట్టుబడికి హామీతో నిర్ధిష్టమైన రాబడి ఇచ్చే పొదుపు మార్గం బ్యాంక్/పోస్టాఫీస్ డిపాజిట్లు. డిపాజిట్ రూపంలో పెట్టిన పెట్టుబడికి లభించే వడ్డీ తక్కువగా ఉన్నా పెట్టుబడి పరంగా ఎటువంటి రిస్క్‌లేదు. బ్యాంకుల్లో అందుబాటులో ఉండే డిపాజిట్లు రకాలు, వాటి వల్ల ప్రయోజనాలు, ఏది మీకు అనుకూలం తదితర సమాచారం తెలుసుకుందాం..
బ్యాంకు డిపాజిట్లు రెండురకాలు అవి ఫిక్స్‌డ్
♦ డిపాజిట్లు (ఎఫ్‌డీ), రికరింగ్ డిపాజిట్లు (ఆర్‌డీ) రూపంలో నగదును పెట్టుబడిగా పెట్టవచ్చు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు
ఒక నిర్ణీత మొత్తాన్ని ఒక నిర్ణీత కాలానికి పొదుపుచేస్తే అటువంటి జమ (డిపాజిట్)అని ఫిక్స్‌డ్ డిపాజిట్లు అంటారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు బ్యాంకుల్లో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకూ అందుబాటులో ఉన్నాయి. కాలాన్ని బట్టి, జమ చేసే మొత్తాన్ని బట్టి మరియు బ్యాంకుల బట్టి వడ్డీ శాతం మారుతుంది. సాధారణంగా వృద్ధులకు సీనియర్ సిటిజన్స్ (60 ఏళ్ల వయసు పైబడినవారు) వడ్డీ 0.25 శాతం నుంచి 1.0 శాతం ఎక్కువగా ఉంటుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లను పిల్లల (మైనర్స్) పేరు కూడా తెరవవచ్చు. 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువకాలానికి జమ చేసే టర్మ్ డిపాజిట్లపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ1.5 లక్షల వరకూ ఆదాయంపై పన్ను ఉండదు. వీటిపై వచ్చే వడ్డీ సంవత్సరానికి రూ.10 వేలు వరకు పన్ను ఉండదు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు రెండు రకాలు
ఒకటి టర్మ్ డిపాజిట్లు, రెండోది స్ఫెషల్ డిపాజిట్లుగా ఉంటాయి. టర్మ్ డిపాజిట్లపై వడ్డీ ప్రతి ఆరు నెలలకు ఖాతాదారుని పొదుపు ఖాతాలో జమచేస్తారు. స్పెషల్ టర్మ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ మళ్లీ అదే డిపాజిట్ ఖాతాకు జమ అవుతుంది. అందువల్ల ఖాతాదారునికి వడ్డీ మీద వడ్డీ వస్తుంది. నిర్ణీత కాలానికి ముందుగా ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరిస్తే తక్కువ వడ్డీ రావడంతోపాటు కొంత మొత్తాన్ని అపరాధ రుసుం (పెనాల్టీ) రూపంలో కట్టాల్సి ఉంటుంది.
ఇవీ సౌకర్యాలు
♦ పౌరులు/ ఏకైక యాజమాన్యం కల సంస్థలు/ప్రవేట్ మరియు ప్రభుత్వ కంపెనీలు/ హిందూ అవిభక్త కుటుంబాలు / ట్రస్టులు / సంఘాలు / క్లబ్‌లు/ సమితులు /భారతదేశంలో నివసించే విదేశీయులు ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ పథకాలకు అర్హులు
♦ ఖాతాదారుల సౌకర్యార్థం వివిధ బ్యాంకులు టాక్స్ సేవింగ్ డిపాజిట్లను కల్పిస్తున్నాయి
♦ ఎస్‌బీఐ / ఆంధ్రా బ్యాంక్/ఇతర ప్రైవేట్ బ్యాంకులు తమ ఖాతాదారులకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతా తెరిచే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.
రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ)
నెలనెలా క్రమం తప్పకుండా కనీస మొత్తాన్ని పొదుపు చేసుకుని దానిపై వడ్డీకూడా పొందేదుకు వీలైంది. ఈ డిపాజిట్ ఖాతా ఇది. ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అన్ని బ్యాంకులు/ పోస్టాఫీసులు అందిస్తున్నాయి. పోస్టాఫీసు కంటే బ్యాంకుల్లో ఆర్డీ ఖాతాలే అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ ఆర్డీకి కూడా వర్తిస్తుంది. ఐదేళ్లకు ఆర్డీ ఓపెన్ చేస్తే డిపాజిట్లపై ఐదేళ్ల కాలానికి బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేటే ఆర్డీ ఖాతాకు వర్తిస్తుంది. ఇలా అతి తక్కువ రిస్క్ కలిగి ఉండి తమకు వచ్చే సంపాదనలో కొంత మొత్తాన్ని భవిష్యత్తులో అవసరాలకు సమకూర్చుకోవడానికి ఈ ఆర్డీ పథకాలు చాలా బాగా ఉపయోగపడతాయి
ఆర్డీ సౌకర్యాలు
♦ కనీసం రూ.100 రూపాయల మొత్తం నుంచి నెల నెలా ఆర్డీలో పొదుపు చేసుకోవచ్చు.
♦ కనీస మొత్తం బ్యాంకులను బట్టి మారుతుంది. ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు ఎంపిక చేసుకోవచ్చు.
♦ సాధారణంగా బ్యాంకులు 7 శాతం నుంచి 8 శాతం వరకు వడ్డీని అందజేస్తున్నాయి.
♦ సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీ 0.5 శాతం అదనంగా లభిస్తుంది.
♦ రికరింగ్ డిపాజిట్ చేసిన మొత్తంలో తిరిగి 80 నుంచి 90 శాతం వరకూ రుణం పొందవచ్చు.
♦ రికరింగ్ డిపాజిట్‌లో ఉన్న మొత్తానికి ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ లెక్కగడతారు.
♦ బ్యాంకులు ఖాతాదారుల సేవింగ్స్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా వారి రికరింగ్ ఖాతాకు ప్రతి నెల రికరింగ్ డిపాజిట్ మొత్తాన్ని బదిలీ చేసే సౌకర్యం కల్పిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment