
అట్టపెట్టె..అరకిలో బంగారం..!
ఫాయిల్స్ రూపంలోకి మార్చి తెచ్చిన స్మగ్లర్
స్కానింగ్‌కు చిక్కకుండా కార్బన్స్ వినియోగం
కేరళవాసిని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు
సాక్షి, హైదరాబాద్: దుబాయ్, సౌదీ నుంచి బంగారాన్ని విమాన మార్గంలో అక్రమంగా తరలించే ముఠాలు నానాటికీ తెలివి మీరు తున్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో 3 రోజుల క్రితం జెడ్డా నుంచి ‘రెక్టమ్ కన్‌సీల్‌మెంట్’ద్వారా వచ్చిన 2 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం మరువకముందే.. మరో కొత్త పంథా వెలుగులోకి వచ్చింది. మస్కట్ నుంచి వస్తున్న కేరళ వాసి దాదాపు అర కేజీ బంగారాన్ని ఫాయిల్స్ రూపంలోకి మార్చి అట్టపెట్టె గోడల్లో అమర్చి తీసుకు వస్తూ గురువారం కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. ఈ తరహాలో స్మగ్లింగ్ శంషా బాద్‌లో చిక్కడం అరుదని అధికారులు చెబుతున్నారు. ఒమర్ ఎయిర్‌లైన్స్‌ఫ్‌లైట్ లో(నం.డబ్ల్యూవై–325) ఓ వ్యక్తి శంషా బాద్‌కి చేరుకున్నాడు. టికెట్ రేటు తక్కు వగా ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చానని చెప్పిన ఇతడి వ్యవహారంపై ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్‌కు సమాచా రం అందింది.
బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నాడనే అనుమానంతో సదరు వ్యక్తితో పాటు అతడి లగేజ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇతగాడు తన వస్త్రాల్ని ఓ అట్టపెట్టె (కార్టన్‌బాక్స్)లో పెట్టుకు రావడం అధికా రుల అనుమానాలకు బలాన్నిచ్చింది. ఆ పెట్టెను స్కానింగ్ చేయగా.. ఎలాంటి అను మానాస్పద వస్తువు కనిపించలేదు. దాన్ని తెరిచి చూడగా అందులో వస్త్రాలే కనిపిం చాయి. సాధారణంగా ఇలాంటి కార్టన్ బాక్సుల గోడల లోపలి వైపు ముడతల వంటి డిజైన్ ఉంటుంది. కానీ ఆ బాక్సు గోడలు ఆ రకంగా ఉండకపోవడంతో అధికారులు ఆ బాక్సును తెరిచి పరిశీ లించారు. బంగారాన్ని ఫాయిల్స్ రూపం లోకి మార్చి, ఆ గోడలకు అమర్చడంతో పాటు దానిపై అట్టతోనే మరో పొర ఏర్పా టు చేశారని వెల్లడైంది. ఫాయిల్స్‌కు అటు ఇటు మందంగా ఉన్న కార్బన్ పేపర్స్ పెట్టినందునే స్కానింగ్‌లో చిక్కలేదని గుర్తించారు. బాక్సు 4 గోడలకు ఉన్న 4 ఫాయిల్స్ 467గ్రా. బరువుందని, దీని ధర రూ.13.64 లక్షలుగా నిర్ధారించారు. దీని వెనుక ఉన్న సూత్రధారులు ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కేజీ స్మగ్లింగ్ చేస్తే రూ. 3 లక్షల లాభం..
దేశంలో పసిడికి ఉన్న డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి జరగట్లేదు. ఈ కారణంగానే దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. ఆయా దేశాల నుంచి పసిడిని కొనుగోలు చేసిన వారు అధికారికంగా ఇక్కడకు తీసుకురావాలన్నా పరోక్ష పన్ను విధానంతో లాభసాటి కావట్లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడికి ఉన్న ఖరీదును ప్రతి 15 రోజులకు సరాసరి తీసుకుని ఆ మొత్తంపై 10 శాతం దిగుమతి సుంకం చెల్లించేలా కేంద్రం నిబంధనలు రూపొందించింది. దీంతో కనీసం రూ.మూడు వేల వరకు పన్ను పడుతోంది. ఈ లెక్కన కేజీ బంగారం దేశీయ మార్కెట్‌లో కొనుగోలు చేయడానికి రూ.27 లక్షల నుంచి రూ.29 లక్షల వరకు అవుతుండగా.. దుబాయ్ తదితర దేశాల్లో గరిష్టంగా రూ.25 లక్షలకే దొరుకుతుంది. దీంతో అన్ని ఖర్చులూ పోయినా.. స్మగ్లర్లకు కనిష్టంగా రూ.3 లక్షల లాభం ఉంటోంది.