
భార్యను గొంతుకోసి చంపాడు
భార్య గొంతు కోసి దారుణంగా చంపాడో భర్త. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణం జరిగింది.
- తానూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త
- పరిస్థితి విషమం..‘గాంధీ’కి తరలింపు
- దారుణాన్ని కళ్లారా చూసి షాక్‌కు గురైన కుమారుడు
కీసర : భార్య గొంతు కోసి దారుణంగా చంపాడో భర్త. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ దారుణం జరిగింది. రంగారెడ్డి జిల్లా కీసర మండలం కుందన్‌పల్లిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా పోచారం గ్రామానికి చెందిన మద్దుల మహేశ్‌గౌడ్(31), రజిని(26) దంపతులు రెండేళ్ల క్రితం కుందన్‌పల్లికి వలస వచ్చి ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరికి కుమారుడు సోమేశ్(7), కూతురు ఇందు(4) ఉన్నారు. మహేశ్‌గౌడ్ స్థానికంగా తాటి చెట్లు గీసే పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
కొన్నిరోజులుగా దంపతుల మధ్య కుటుంబ కలహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి కూడా గొడవ జరిగింది. మహేశ్‌గౌడ్ భార్యను తీవ్రంగా చితకబాదాడు. దీంతో ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకొని బయటకు వెళ్తానని చెప్పింది. తీవ్ర ఆగ్రహానికి గురైన మహేశ్‌గౌడ్.. కల్లు గీసే కత్తితో భార్య గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రక్తపు మడుగులో రజిని అక్కడికక్కడే ప్రాణం విడిచింది. అనంతరం అదే కత్తితో మహేశ్ తన గొంతు కోసుకున్నా డు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని 108 వాహనంలో గాంధీ ఆస్పత్రికి తరలించారు. మహేశ్ పరిస్థితి విషమంగా ఉంది.
భయంగా ఉందమ్మా.. త్వరగా రండి..
తల్లిదండ్రులు గొడవపడటంతో అలికిడికి కుమారుడు సోమేశ్ (7) నిద్రలేచాడు. తన కళ్లెదుటే తండ్రి మహేశ్‌గౌడ్ తల్లి గొంతు కోశాడు. అనంతరం తాను కూడా గొంతు కోసుకోవడం చూసిన సోమేశ్.. షాక్‌కు గురై తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. తల్లి సెల్ తీసుకొని నగరంలోని నాగోల్ బండ్లగూడ వద్ద నివాసం ఉంటున్న అమ్మమ్మ సోమలక్ష్మికి ఫోన్ చేశాడు. అర్ధరాత్రి కావడంతో ఏడు సార్లు కాల్ చేసిన తర్వాత ఆమె లిఫ్ట్ చేసింది. ‘నాకు చాలా భయంగా ఉందమ్మా తొందరగా రండి.. ’అంటూ విషయం చెప్పాడు. దీంతో సోమలక్ష్మి తన కుమారులతో కలసి కుందన్‌పల్లి చేరుకునేసరికి తెల్లవారుజామున మూడు గంటల సమయమైంది. అప్పటి వరకు ఇద్దరు పిల్లలు రక్తపుమడుగులో ఉన్న తమ తల్లిదండ్రుల వద్దనే బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు.