సైబర్ నేరాల అదుపునకు ప్రత్యేక బృందాలు
-
ఎస్పీ రవి ప్రకాష్
ఐ.పోలవరం :
జిల్లాలో సైబర్ నేరాల అదుపునకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ అన్నారు. పాత యింజరంలో ఉన్న మండల పోలీస్ స్టేషన్‌ను ఆయన మంగళవారం తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో యువత సైబర్ నేరాలకు, వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉందని దీనిని ఆదిలోనే నియంత్రించేలా తగు చర్యలు తీసుకొంటున్నామన్నారు. అలాగే అమలాపురం సూదాపాలెంలో దళితులపై జరిగిన సంఘటన పునరావృతం కాకుండా చూస్తామన్నారు. జిల్లాలో ఈ ఏడాది క్రైం రేటు 20 శాతం తగ్గిందన్నారు. హైవే దాబాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పక్కనే ఉన్న యానం నుంచి అధిక సంఖ్యలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు తెలిసిందని, వీటి అదుపుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల పోలీసులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని అన్న విలేకరుల ప్రశ్నకు చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పులు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదన్నారు. ఇప్పటికే జిల్లాలో ఒక సీఐని వీఆర్‌లో ఉంచామని అలాగే హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, ఎస్‌ఐని సస్పెండ్ చేశామన్నారు. తుని జాతీయ రహదారిపై చేసిన నిఘాలో లారీల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశామన్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు లైఫ్ జాకెట్లు ధరించాలని, దీనిపై మత్యకార గ్రామాల్లో అవగాహన ఏర్పాటు చేయాలని డీఎస్పీ అంకయ్యకు సూచించారు. అలాగే జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీఐ కేటీవీటీ రమణరావు, ఎస్‌ఐ టి.క్రాంతికుమార్, సిబ్బంది ఉన్నారు.