
సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్యా
సాక్షి, సిటీబ్యూరో: మహిళలను కించపరడం, బహిరంగ ప్రదేశాలు, పని ప్రదేశాల్లో వారిని వేధించడం, చిన్నారులపై అఘాయిత్యాలు వంటి నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీని తీవ్రంగా పరిగణించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా.. ఇలాంటి నేరాల నియంత్రణ కోసం నలుగురు మహిళా పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు శుక్రవారం ప్రకటించారు.
సైబరాబాద్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించి దాదాపు నెల రోజులైన నేపథ్యంలో తన పని తీరును సమీక్షించడంతో పాటు త్వరలో తీసుకోబోయే ప్రత్యేక చర్యలను ఆయన తొలిసారిగా మీడియాకు వివరించారు. మహిళలు, బాలల కేసుల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందంలో మాదాపూర్ జోన్ అడిషనల్ డీసీపీ ఎస్‌కే సలీమా, సైబరాబాద్ క్రైమ్స్ ఏసీపీ టి.ఉషారాణి, శంషాబాద్ ఏసీపీ అనురాధ, ఐటీ కారిడార్ ఉమెన్ ఇన్‌స్పెక్టర్ సునీత సభ్యులుగా ఉంటారన్నారు.
ఈ కేసుల్లో తొలి రెస్పాండెంట్‌గా స్థానిక పోలీసులు ఉంటారని, బాధితులు ఠాణాకు రాలేని సందర్భంలో వారి తరఫున బంధువులు ఫిర్యాదు చేసినా చాలని, తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళా పోలీసు అధికారులు బాధితుల ఇంటికెళ్లి, వారితో మాట్లాడి జరిగి ఘటన తీరు తెలుసుకుంటారని, వారి సంభాషణను కూడా రికార్డు చేయడంతో పాటు ఈ కేసుల్లో దోషులకు శిక్ష పడేలా సరైన ఆధారాలు సేకరిస్తారని కమిషనర్ తెలిపారు.
తమతో సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోలు, బలవంతంగా తీసిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తామని బెదిరించి మహిళలను లోబర్చుకొనేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇలాంటి ఘటనల్లో బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, వారి వివరాలన్నీ గోప్యంగా ఉంచుతామని, నిందితులకు కఠిన శిక్ష పడినప్పుడే నేరాలు తగ్గుముఖం పడతాయని కమిషనర్ సందీప్ శాండిల్యా అన్నారు.
పేపర్ వర్క్‌పై ఫోకస్ పెడితేనే శిక్షలు రెట్టింపు...
‘‘క్రైమ్ సీన్‌లోనే పోలీసు అధికారులు పంచనామా పూర్తి చేయాలి. బాధితుల వివరాలన్నీ రాతపూర్వకంగా నమోదు చేయాలి. ఘటనాస్థలికి క్లూస్‌టీం తప్పనిసరిగా వెళ్లాలి. ఇలా సేకరించే మౌనసాక్ష్యాలే చాలా కేసుల్లో నేరగాళ్లకు భారీ శిక్షలు విధించేందుకు తోడ్పడతాయి. అందుకే నేరగాళ్లను అరెస్టు చేయడమే కాదు వారికి శిక్ష పడేంత వరకు చక్కటి డాక్యుమెంటేషన్(పేపర్ వర్క్)తో పోలీసులు ముందుకు వెళ్లాలి.
ఈ విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలకు వెనుకాడబోం. ఠాణాకు వచ్చే బాధితుల ఫిర్యాదులు స్వీకరించి వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నించాలే గానీ రోజుల తరబడి పోలీసు స్టేషన్లు చుట్టూ తిప్పుకోవద్దు’ అని సందీప్ శాండిల్యా కిందిస్థాయి సిబ్బందిని ఆదేశించారు.
క్యాష్‌లెస్ విధానం షురూ...
సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో మాదిరిగానే సైబరాబాద్‌లోనూ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు క్యాష్‌లెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చారని సందీప్ శాండిల్యా తెలిపారు. ఇంటికి చలాన్లు, సెల్‌ఫోన్లకు సంక్షిప్త సందేశం రాగానే వాహనదారులు దగ్గరలోని ఏపీ ఆన్‌లైన్, మీసేవ/ఈసేవ కేంద్రాలకు వెళ్లి జరిమానా చెల్లించాలన్నారు.