ట్యాబ్‌ల పేరుతో డాబు
Published Tue, Jul 25 2017 1:24 AM | Last Updated on Tue, Sep 5 2017 4:47 PM
నిడమర్రు : చదువుల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా పురస్కారాలు ప్రచార ఆర్భాటంగా ఉన్నాయని విద్యార్థుల తల్లితండ్రులు విమర్శిస్తున్నారు. ఉన్నత, మాధ్యమిక పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు వారికి ఏటా నగదు పురస్కారాలతోపాటు ట్యాబ్‌లను అందించేందుకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. ఈ పురస్కారాలు ఏటా ప్రచారం కోసం మాత్రమే సా...గుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గత ఏడాది ఎంపికైన విద్యార్థులకు రెండు రోజుల క్రితమే నగదు జమచేసినట్లు అధికారులు చెపుతున్నారు. ట్యాబ్‌లైతే నేటికీ విద్యార్థులకు అందలేదు. ఈ ఏడాదికి సంబంధించి ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమం మే నెల్లోనే పూర్తయింది. అయితే ఈ ఏడాది ఎవరు ఎంపికయ్యారనే సమాచారం జిల్లా అధికారులు వద్ద లేదు. దీంతో ఈ ప్రతిభ పురస్కారాలు జన సమీకరణ చేసుకునే ప్రభుత్వ ప్రచారంగా మిగిలుతున్నాయి.
ట్యాబ్ డాబేనా..? ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనల మేరకు ప్రతిభా అవార్డులకు అన్ని విద్యాస్థాయిల నుంచి
జిల్లాలో 525 మంది ఎంపికయ్యారు. 10వ తరగతి నుంచి 388 మంది, ఇంటర్ మీడియట్ నుంచి 39 మంది, ఉన్నత, సాంకేతిక విద్యలో ప్రతిభ చాటిన మరో 98 మందికి ఆయా శాఖల అధికారుల ద్వారా ఎంపిక చేశారు వీరికి ఒక్కొక్కరికి రూ. 20 వేలు నగదు, ట్యాబ్‌లు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది, దీని కోసం గత ఏడాది అక్టోబర్‌లో విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వాటిని అందించాలని అధికారులు జిల్లా నుంచి విద్యార్థులను విజయవాడ తీసుకు వెళ్లారు. అయితే ప్రభుత్వం ముఖ్యులు ఎప్పటిలాగే జిల్లాకు ఒకరిద్దరి చొప్పున ఎంపికచేసిన విద్యార్థులకు ట్యాబ్‌లు, నగదు, పురస్కారాలు సీఎం చేతుల మీదుగా పంచి చేతులు దులుపుకున్నారు. కార్యక్రమం అనంతరం మిగిలిన వారికి ప్రతిభా అవార్డుల సర్టిఫికెట్లు మాత్రమే అందించారు. వారందరికీ ట్యాబ్‌లు వారి వారి స్కూల్స్, కళాశాలలకు పంపిస్తామని చెప్పి ఒట్టి చేతులతో వెనక్కి పంపారు. ఇది జరిగి ఏడాది అవుతున్నా నేటికీ ట్యాబ్‌లు మాత్రం విద్యార్థులకు చేరలేదు.
రెండేళ్లుగా ఇలాగే..
2014–15 సంవత్సరానికి తిరుపతిలో జరిగిన ప్రతిభా పురస్కారాల్లో కూడా విద్యార్థులకు పురస్కారాలు సరిగా అందలేదని విమర్శలున్నాయి. అయినా 2015–16 ఏడాదిలోనూ ప్రభుత్వం ఆ విషయాన్ని సరిదిద్దుకోలేదు, నగదు కోసం విద్యార్ధులు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి, సాంకేతిక కారణాలతో చాలామంది విద్యార్థులకు 2014–15 సంవత్సరం పురస్కార నగదు ఇప్పటికీ బ్యాంక్ ఖాతాలో జమకాలేదని తెలిసింది. 2015–16 సంవత్సరానికి నగదు జమలు అరకొరగా జరిగినట్లు ఉపాధ్యాయులు చెపుతున్నారు. ఈ రూ. 20 వేలు నగదు జమలు కూడా రెండు రోజుల క్రితమే విద్యార్థుల ఖాతాలో వేసినట్లు డీఈవో ఆర్‌ఎస్ గంగాభవాని తెలిపారు. గత ఏడాదికి సంబంధించిన ట్యాబ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయని వాటిని ఆయా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థు లకు అందిస్తామని తెలిపారు. ఈ నగదు జమలు అరకొరగా జరిగినట్లు హెచ్‌ఎంలు తెలిపారు.
ఈ ఏడాది పురస్కారాలు హుళక్కేనా..?
రెండేళ్లుగా జిల్లా నుంచి 500 మందికి పైగా విద్యార్థులు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఈ ప్రతిభా పురస్కార కార్యక్రమం మే 24న విజయవాడలో ముగిసింది. ఈ ఏడాది జిల్లాకు ఒక్కరి చొప్పున మాత్రమే పిలిచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు. ఈ ఏడాది ఎంతమంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారో అధికారులకే తెలియని పరిస్థితి. నేటీకీ ఆ జాబితా జిల్లా అధికారులకు అందలేదు. జిల్లాలో ఈ ఏడాది ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 84.3 ఉన్నా 10 జీపీఏ సాధించిన విద్యార్థులు సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది 10 జీపీఏ 1,301 మంది విద్యార్థులు సాధించారు. మరి వీరిలో ఎంతమందికి పురస్కారాలు అందాయో అన్న విషయం నేటికీ ప్రభుత్వం స్పష్టం చెయ్యలేదు. దీంతో ఈ ఏడాది ప్రతిభా పురస్కారాలు ఇస్తారా ఇవ్వరా అనే సందిగ్ధం విద్యార్థులు తల్లిదండ్రుల్లో నెలకొంది. ప్రయివేటు విద్యా సంస్థలకు పంపిణీపై అనుమానం గత ఏడాదికి సంబంధించిన ట్యాబ్‌లను ప్రయివేటు విద్యార్థులకు వారి కళాశాలలకు పంపిస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పడంతో ఇంటర్, డిగ్రీ, సాంకేతిక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విధానం వల్ల కళాశాల విద్యార్థులు ట్యాబ్‌లు మాకు అందవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సీనియర్స్‌కు నేటికీ ట్యాబ్‌లు అందలేదని వారే చెపుతున్నారు. పురస్కారాలు అందుకుని ఏడాది పూర్తవుతున్నందున విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆయా కళాశాలలను విడిచిన నేపథ్యంలో పూర్వ కళాశాల యాజమాన్యాలు వారికి ట్యాబ్‌లు ఇచ్చే విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నా ఉన్నత విద్యకు ఎంతో అవసరం
నేను ప్రస్తుతం పెదవేగి గురుకుల కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. ప్రతిభా అవార్డుతో పాటు రూ. 20 వేల నగదు, ట్యాబ్ ఇస్తానన్నారు, దీని కోసం నా బ్యాంక్ ఖాతా నెంబర్ తీసుకున్నారు, కానీ నేటి వరకూ అందలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఆ రెండు నాకు చాలా అవసరం.
– తోట యహోషువ, ప్రతిభా అవార్డు పురస్కార గ్రహీత, దేవరగోపవరం
పురస్కారం విషయంలో ప్రభుత్వం స్పందించాలి
మా పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే, వీరంతా నూజివీడు ట్రిపుల్ ఐటీ, పెదవేగి గురుకుల పాఠశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్నారు. పురస్కారం అందుకుని ఏడాది అవుతున్నా నేటికీ ట్యాబ్‌లు కూడా పంపిణీ చెయ్యకపోవడం దురదృష్టకరం.
– కమ్మిల నాగలక్ష్మి, చైర్మన్, ఎస్‌ఎంసీ, జెడ్పీ సూ్కల్, పెదనిండ్రకొలను
బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం
మా అబ్బాయి గత ఏడాది ప్రతిభా అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డులో భాగంగా రూ. 20 వేలు నగదు ఇస్తామన్నారు. నేటీకీ ఆ నగదు జమకాలేదు. దీనికోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం. అప్పట్లో విజయవాడ వస్తేనే అవార్డు ఇస్తామంటే వ్యయ ప్రయాసలతో అక్కడికి వెళ్ళాము. కానీ నేటికీ ట్యాబ్ అందలేదు. నగదు జమకాలేదు.
– తోట వెంకమ్మ, పెదనిండ్రకొలను
ఈ ఏడాది జాబితాపై ఎటువంటి సమాచారం లేదు
ప్రతిభా పురస్కారాల పంపిణీ ఈ ఏడాది జాబితాపై నేటి వరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు. గత నెలలో జరిగిన కార్యక్రమంకు జిల్లాకు ఒక విద్యార్థి చొప్పున పిలిచారు. గత ఏడాదికి సంబంధించిన ప్రోత్సాహకంగా అందించే రూ. 20 వేలు నగదు విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకి వారం రోజుల క్రితం జమచేశాము. ఏ విద్యార్థి ఖాతాలోనైనా నగదు జమ కానట్లయితే నాదృష్టికి తీసుకువస్తే బ్యాంకర్లతో మాట్లాడి పరిష్కరిస్తాము.
– ఆర్‌ఎస్ గంగాభవాని, జిల్లా విద్యాశాఖాధికారి
Advertisement