ప్రముఖ బాల నటి మోక్ష ఆశాభావం
పలు అంశాల్లోనూ మంచి పట్టు
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎదుగుదల
తెనాలి: మోక్ష... టీవీ షో, సీరియల్, వెబ్ సిరీస్‌ల ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. మూడున్నరేళ్లకే కెమెరా ముందు కనిపించింది. 13 ఏళ్లకు బాలనటిగా స్టార్‌డమ్‌ను తెచ్చుకుంది. తన అద్భుత నటనతో పద్మమోహన అవార్డు, జాతీయ ప్రతిభా పురస్కార్ సహా 19 అవార్డులను గెలుచుకుంది. ఇటీవల బాలల దినోత్సవంలో భాగంగా జరిగిన వివేక కల్చరల్ ఫెస్ట్‌లో బాల అతిథిగా తన మాట, ఆట, పాటతో సందడి చేసింది. ఈ నేపథ్యంలో పలుకరించిన ‘సాక్షి’తో బోలెడు కబుర్లు పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే...
‘‘ నా పూర్తి పేరు మోక్ష విజయ రామలక్ష్మి. తల్లిదండ్రులు సురేష్‌బాబు, శంకరీ రాజ్యలక్ష్మి. స్వస్థలం రాజమహేంద్రవరం. మూడున్నరేళ్ల వయసులో ఓ ఫంక్షనుకు తీసుకెళ్లారు. అక్కడే టీవీ షోకు ఆడిషను జరుగుతోంది. నన్ను చూసి బాగుందనటంతోపాటు ఆడిషనులో కూర్చోబెట్టారు. సెలెక్టు చేసుకున్నారు. అందరికీ టికెట్లు పంపి, హైదరాబాద్‌కు ఆహ్వానించారు. అలా ఊహ తెలీని వయసులో ‘పిల్లలు పిడుగులు’ టీవీ షోలో నటించాను. తర్వాత అవకాశాలు వరుసకట్టాయి.
హైదరాబాద్‌కు వచ్చేశాం..
నాన్నకు ఊరిలో ఉన్న అట్టల ఫ్యాక్టరీని లీజుకిచ్చి హైదరాబాద్‌కు వచ్చేశారు. అమ్మ ఇక్కడే ‘అమెజాన్’లో వర్క్ చేస్తోంది. పలు టీవీ ఛానళ్లలో ‘అయస్కాంతం’, ‘కోడలు’, ‘సూర్యకాంతం’, ‘గుండమ్మకథ’, ‘శుభస్య శీఘ్రం’, ‘నువ్వేకావాలి’ సీరియల్స్, ‘పిల్లలు పిశాచాలు’తో ఆరంభించి ‘డ్రామా జూనియర్స్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ వంటి టీవీ షోలు, ‘మ్యూజిక్ స్కూల్’, ‘హీరో’ సినిమాలు, మరికొన్ని వెబ్ సిరీస్‌లలో నటించాను. కొన్ని కంటిన్యూ అవుతున్నాయి.
విభిన్న కళల్లోనూ ప్రతిభ
నటనే కాదు.. రచన, చిత్రలేఖనం, డ్యాన్స్, యాంకరింగ్ నాకిష్టం. సినీనటులు శ్రేయ, నాని, అనసూయ ఈ విషయం తెలిసి ప్రశంసించారు. ప్రముఖ యాంకర్ సుమ, ‘నా తర్వాత నువ్వే మోక్ష’ అనటం సంతోషమేసింది. రచనంటే ఇష్టమని చెప్పాకదా... నేను మూడు కథలు రాసుకున్నా. అందులో రెండు షార్ట్ ఫిలిమ్స్, మరోటి వెబ్ సిరీస్. శివుడుకి సంబంధించిన భక్తిపూర్వక కథనం. నాకొచ్చిన కలను డెవలప్ చేసి కథ, స్క్రిప్టు సిద్ధం చేశా. నా దర్శకత్వంలోనే తీయాలని ఆశ పడుతున్నా. తగిన ప్రొడ్యూసర్ ముందుకొస్తే వెబ్ సిరీస్ తీసి, అతి పిన్న దర్శకురాలు అనిపించుకోవాలని ఆశిస్తున్నా.
కథానాయిక కావాలనేదే లక్ష్యం
పెద్దయ్యాక హీరోయిన్‌గా నటించాలనేది నా మరో డ్రీమ్. హైదరాబాద్‌లోనే తొమ్మిదో తరగతి చదువుతున్నా. నెలలో రెండు వారాలు బడికి, రెండు వారాలు షూటింగులకు కేటాయించుకున్నా. ఎక్కడకు వెళ్లిన బుక్స్ వెంటే ఉంటాయి. షూటింగ్ గ్యాప్‌లో చదువుకుంటా. పరీక్షల్లో 90 శాతం పైగానే మార్కులు వస్తుంటాయి. కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్నా. నా కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఎంతో త్యాగం చేశారు. చదువు, నటన, రచన... అన్నింటిలోనూ గెలిచి, నా తల్లిదండ్రులను గెలిపిస్తూ ఉండాలనేది నా ఆశయం.
టాలెంట్ ఉంటే బోలెడు వేదికలు
టీవీ, ఓటీటీ ప్లాట్‌ఫాంలు వచ్చాక చిన్న పిల్లల్నుంచి పెద్దల వరకు నటన, సాంకేతిక నైపుణ్యంలో ఎన్నో అవకాశాలున్నాయి. టాలెంట్ ఉన్నవాళ్లు అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాణించవచ్చు. పిల్లలు చదువుతోపాటు ఏదో ఒక కళలో నైపుణ్యం సాధించాలనేది నా భావన. అప్పుడు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని చెబుతాను. అందుకు నేనే నిదర్శనం. తెనాలి, రాజమహేంద్రవరం అంటే నాకెంతో ఇష్టం. ఎందరో కళాకారులు ఇక్కడ్నుంచి వచ్చారు. మహానటి సావిత్రి నాకు ఆదర్శం. ఆమె సినిమాలు ఇప్పటికీ ఎవర్‌గ్రీనే కదా!’’
Comments
Please login to add a commentAdd a comment