ఆ కుటుంబాన్ని వెంటాడిన మృత్యువు..
♦ తండ్రి దశదిన కర్మ కాకుండానే కూమార్తె దుర్మరణం
♦ శోకసద్రంలో కుటుంబం
♦ గ్రామంలో విషాదఛాయలు
ఆ కుటుంబ పెద్దదిక్కును మృత్యువు మింగేసింది.. ఆసరా కోల్పోయి పుట్టెడు కష్టాల్లో మునిగిపోయింది.. అయినా సంప్రదాయాలకు విలువనిచ్చే గ్రామీణులు దశదిన కర్మకు బుధవారం ఏర్పాట్లు చేసుకున్నారు.. పనుల్లో భాగంగా సైకిల్ ఇంటికి వెళ్తున్న కుమార్తెను బస్సు రూపంలో మృతువు వేటాడింది.
ఉంగుటూరు(గన్నవరం) : మండలంలోని ఆత్కూరు గ్రామానికి చెందిన ఆంతోని ఇటీవల ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన దశదిన కర్మ బుధవారం పెట్టుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పనుల బాధ్యత పెద్ద కుమార్తె చూస్తోంది. అందులో భాగంగా మంగళవారం బ్యాంకు వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకొస్తోంది. అయితే స్కూల్ బస్సు రూపంలో మృతువు ఆమెను తీసుకెళ్లింది. పోలీసుల కథనం మేరకు.. మంగళవారం సాయంత్రం ఆత్కూరు జెడ్పీ స్కూల్‌లో చదువుతున్న పఠాన్ ఆషాబీ స్కూలు నుంచి ఇంటికి వస్తోంది. ఆషాబీ సైకిల్‌పై, కె.ప్రవళిక వెనుక ఎక్కింది.
జాతీయ రహదారి దాటుతుండగా అదే సమయంలో గన్నవరం వైపు వస్తున్న స్కూల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ప్రవళిక (18)పై బస్సు టైర్ ఎక్కడంతో 108లో పిన్నమనేని వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ప్రవళిక మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టు నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆషాబీ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ప్రమాదానికి కారణమైన బస్సును గ్రామస్తులు అడ్డుకున్నారు. తల్లి వాణి, కుటుంబ సభ్యులు శోకసద్రంలో మునిగారు. బాధిత కుటుంబాన్ని సర్పంచి కుర్రా సుబ్బారెడ్డి, వైస్ ఎంపీపీ ఆర్నేపల్లి సింహాచలం పరామర్శించి సానుభూతి తెలిపారు. ఎస్‌ఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.