తెలుగు తెరపై నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో నటించి ప్రత్యేకత సాధించుకున్నారు నటి అన్నపూర్ణ. 'స్వర్గం నరకం' అనే సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయిన ఆమె అతి తక్కువ కాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు వారందరికి సుపరిచితం అయ్యారు. దాదాపు 700 సినిమాల్లో నటించిన ఆమె వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఇటీవలె ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఓ అమ్మాయిని దత్తత తీసుకొని అపురూపంగా పెంచుకున్నానని, అయితే ఆమె అనూహ్యంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని తెలిసి షాక్‌కి గురయ్యానని తెలిపారు.
'అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా నా కూతురు కీర్తిని సినిమాల్లోకి పంపించొద్దని అనుకున్నా.డాక్టర్ లేదా ఇంజనీర్ వంటి పెద్ద చదువులు చదివిద్దామని కలలు కన్నా. కానీ ఆమెకు చదువు అంతగా అబ్బలేదు. పదవ తరగతి అనంతరం మాకు తెలిసిన వాళ్లలో ఓ సంబంధం ఉంటే మాట్లాడాను. ఇద్దరికి నచ్చింది అన్న తర్వాతే పెళ్లి చేశాను. ఒక ఏడాదికి ఆమెకు పాప పుట్టింది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఓ రోజు ఉదయాన్నే మా అల్లుడు ఫోన్ చేసి మీ కూతురు ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు.
అసలు కీర్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఇప్పటికీ తెలియదు. నా కూతురికి కోపం ఎక్కువ. అందులోనూ మా ఇంట్లో గారాభంగా పెరిగింది. ఇంట్లో పనులు చేయడం రాదు తనకు. మెట్టినింటి వాళ్లు ఏమైనా అన్నారా లేదా భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు వచ్చాయా అన్నది నాకు తెలియదు. ఆ విషయాల గురించి మా అమ్మాయి ఏనాడు నాకు చెప్పలేదు. క్షణికావేశంలో మరి అలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు. కానీ ఇప్పుడు ఈ లోకంలో లేదు' అంటూ గతాన్ని తలుచుకొని బాధపడింది.
Comments
Please login to add a commentAdd a comment