దేదీప్యమానం
- కార్తీక కడ సోమవారం పోటెత్తిన ఆలయాలు
- శ్రీశైలంలో లక్షదీపోత్సవం
- ఆకట్టుకున్న శివమణి
శివతాండవలయ విన్యాసం
- మహానందిలో లక్ష కుంకుమార్చన
శ్రీశైలం: కార్తీక కడ సోమవారం.. జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మల్లన్న దర్శనానికి భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఉచిత, ప్రత్యేక దర్శన కిటకిటలాడాయి. ఉచిత దర్శనానికి 6గంటలకు పైగా సమయం పట్టగా, ప్రత్యేక దర్శనానికి 3గంటలకు పైగా, అభిషేకానంతర దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. సోమవారం రాత్రి ఆలయప్రాంగణంలో లక్షదీపోత్సవం ముగిసిన వెంటనే ప్రముఖ సంగీత దర్శకుడు శివమణి ప్రదర్శించిన శివతాండవ లయ విన్యాసం ఆకట్టుకుంది.
మహానందిలో..
శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారికి సోమవారం లక్షకుంకుమార్చన పూజలు వైభవంగా జరిగాయి. నంద్యాలకు చెందిన డాక్టర్ జి.రామకృష్ణారెడ్డి, విజయకుమారి దంపతులు దాతలుగా పాల్గొన్నారు. స్థానిక హోమశాలలో రుద్ర, చండీ హోమాలను నిర్వహించి పూర్ణాహుతి పూజలు చేశారు. ఆదివారం లక్ష బిల్వార్చనలో ఉపయోగించిన బిల్వాలను పురాతన కోనేరులో నిమజ్జనం చేశారు. దేవస్థానం పాలకమండలి చైర్మన్ పాణ్యం ప్రసాదరావు, ఈఓ బి.శంకర వరప్రసాద్, వేదపండితులు రాధాకృష్ణశర్మ, రవిశంక అవధాని తదితరులు పొల్గాన్నారు.
భక్తులమధ్య తోపులాట...!
భక్తులు ఎక్కువగా రావడంతో సోమవారం మహానందిలో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. రుద్రగుండం కోనేరు ఎదుట ఏర్పాటు చేసిన అదనపు టికెట్ కౌంటర్‌లో భక్తుల మధ్య తోపులాట జరిగింది.