ఇదేం దారుణం
పాడిరైతుల పేరుతో బ్యాంకు రుణం
పాలఫ్యాక్టరీ యాజమాన్యం ఘరానా మోసం..?
న్యాయస్థానం నుంచి రైతులకు నోటీసులు
లబోదిబోమంటున్న బాధితులు
బ్యాంకు రుణం పొందాలంటే ఒక రైతుకు ఎంతో కష్టం. దరఖాస్తు దశ నుంచి మంజూరయ్యే వరకూ చాలా అవస్థలు పడాలి. అవసరమైన డాక్యు మెంట్లు సకాలంతో ఇవ్వాలి.. అప్పుడే రుణం మంజూరవుతుంది. అలాంటిది పుత్తూరు మండలంలో కొందరు రైతులకు బ్యాంకు మెట్లెక్కకుండానే రుణాలు మంజూరయిపోయాయి. అంతేకాదు వాళ్లకు అందకుండానే విత్ డ్రా అయిపో యాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఓ సంస్థ వీరిని నిలువునా ముంచేసింది. తమకు తెలియకుండానే రుణాలు మంజూరు చేయించుకుని కాజేశారని రైతులు లబోదిబోమంటున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులొచ్చేవరకూ తమకు రుణాల గురించి తెలియదని వారంటున్నారు..
పుత్తూరు: రైతులకు తెలియకుండానే వారి పేరుతో బ్యాంకు రుణం తీసుకొని ఎగ్గొట్టిన పాలఫ్యాక్టరీ యాజమాన్యం మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధి లోని తిరుమలకుప్పం, పరిసరాల గ్రామాలకు చెందిన పాడిరైతులు పిచ్చాటూరులోని ఓ పాలఫ్యాక్టరీకి కొన్నేళ్లుగా పాలు సరఫరా చేస్తున్నారు. మరిన్ని గేదెలు కొనుగోలు చేసేందుకు రైతులందరికీ బ్యాంకు ద్వారా రుణం మంజూరు చేయిస్తానని ఫ్యాక్టరీ యాజమాన్యం, సిబ్బంది నమ్మబలికారు. ఆశపడిన రైతులు వారికి సంబంధించిన ఆధార్, రేషన్, పొలం పత్రాల నకల్లను ఫ్యాక్టరీ సిబ్బందికి అందించారు. ఇది నాలుగేళ్లనాటి మాట. పాలఫ్యాక్టరీ యాజమాన్యం బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో రైతులు పాల సరఫరాను నిలిపేశారు. రుణం కోసం తాము అందించిన కాగితాల గురించి కూడా మరిచిపోయారు. ఈ నేపథ్యంలో గత నెల న్యాయస్థానం నుంచి రైతులకు నోటీసులందాయి. పుత్తూరు ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి తీసుకున్న రుణాన్ని సక్రమంగా చెల్లించనందుకు నోటీసులు వచ్చాయి.
ఒక్కొక్క రైతు సుమారు 2.90 లక్షలు చెల్లించాలని నోటీసుల్లో ఉండడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తమకు తెలియకుండానే తమ పేరుతో పాలఫ్యాక్టరీ యాజమాన్యం రుణం తీసుకుందని వారు బావురుమంటున్నారు. ఈ మొత్తం కోటి రూపాయలపైగానే ఉంటుందని పేర్కొంటున్నారు. మూడు సంవత్సరాల క్రితం అందించిన జెరాక్స్ పత్రాలతో బ్యాంకు నుంచి రుణం పొందినట్లు వారు రూఢీ చేసుకొన్నారు.
నిబంధనలన్నీ పక్కాగా అమలు...
బ్యాంకు రికార్డుల ప్రకారం రుణం మంజూరు చేసేందుకు అవసరమైన నిబంధనలను పక్కాగా పాటించినట్లు ఉంది. ష్యూరిటీలుగా పాల ఫ్యాక్టరీ యాజమాన్యం, మరో వ్యక్తి ఆస్తిని కూడా జతచేసినట్లు రికార్డుల్లో పొందుపరిచారు. రైతులు, ఏజెంట్లు తీసుకున్న రుణం చెల్లించకపోతే ఫ్యాక్టరీ యాజమాన్యం పూర్తి బాధ్యత వహిస్తామని సైతం బ్యాంకర్లకు అగ్రిమెంట్ ఇచ్చారు. బ్యాంకు మంజూరు చేసిన రుణం సంబంధిత రైతు ఖాతాలోనే జమచేసినట్లు, ఆపై నగదును రైతే విత్ డ్రా చేసినట్లు రికార్డుల ద్వారా తెలు స్తోంది. దీంతో నిబంధనలన్నీ పక్కాగా అమలు చేసినట్లు తెలుస్తోంది.