దళితులు మదర్ థెరిస్సా వారసులు
– కర్నూలు డయాసిస్ బిషప్ పూల ఆంథోని
కర్నూలు (టౌన్): మదర్ థెరిస్సా వారసులుగా దళితులు సమాజ సేవకు ముందుండాలని కర్నూలు డయాసిస్ బిషప్ పూల ఆం«థోని పేర్కొన్నారు. ఆదివారం స్థానిక నంద్యాల చెక్‌పోస్టు వద్ద ఉన్న లూర్డు మాత కథిడ్రిల్ దేవాలయంలో దళిత విమోచన దినోత్సవాన్ని ఫాదర్ సిద్దిపోగుల దేవదాసు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ మాట్లాడుతూ క్రైస్తవులంతా సమసమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. గోరక్షాదళ్ పేరిట దేశవ్యాప్తంగా దళిత, గిరిజన, మైనార్టీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చెప్పులు కుట్టడం, శవాలు పూడ్చడం, బట్టలు ఉతకడం, బండలు కొట్టడం... ఇలా ఎవరికి తొచినట్లు వారు సమాజాన్ని శుభ్రం చేస్తున్నారన్నారు. వీరంతా లేకపోతే ప్రపంచమంతా అంధకారమవుతుందన్నారు. భ్రూణ హత్యలు, మహిళలపై అత్యాచారాలు, పర్యావరణాన్ని నాశనం చేసే చర్యలు ఇంకా ఎనాళ్లు కొనసాగుతాయని ప్రశ్నించారు. మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్న కార్యకర్తలపై జరుగుతున్న దాడులను, హత్యలను ఆయన ఖండించారు. ప్రపంచ వ్యాప్తంగా పోప్ ఫ్రాన్సిస్–1 ఆదేశాల మేరకు క్యాథలిక్‌లు దళిత విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. అంటరాని తనాన్ని, వివక్షను విడనాడి సోదరభావాన్ని ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫాదర్లు విజయరాజ్, సంజీవరావు, లూర్థు, పరంజాల్, సిస్టర్లు పాల్గొన్నారు.