కేజ్‌వీల్స్‌తో తారురోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్లు
- కేజ్‌వీల్స్‌తో రోడ్డెక్కుతున్న ట్రాక్టర్లు
- పట్టించుకోని అధికారులు
- కోట్లాది రూపాయలు వృథా
మెదక్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రూ. కోట్లు వెచ్చించి మారుమూల ప్రాంతాలకు సైతం రహదారులు నిర్మిçస్తుంటే కొందరు ట్రాక్టర్ కేజ్‌వీల్స్‌తో ఇష్టానుసారంగా రోడ్లపైకి వస్తున్నారు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తున్నారు. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. తారు రోడ్లపై కేజ్‌వీల్స్ ఉన్న ట్రాక్టర్లు తిరగరాదనే నిబంధన ఉన్నప్పటికీ ఇది ఎక్కడా అమలు కావడంలేదు.
మెదక్ మండల పరిధిలోని కూచన్‌పల్లి, సర్ధన, జక్కన్నపేట, చిట్యాల, బ్యాతోల్, బూర్గుపల్లి, గాజిరెడ్డి, కప్రాయిపల్లి, కొత్తపల్లి, రాజిపేట, వాడి తదితర గ్రామాలకు ఇటీవల తారు రోడ్లు వేశారు. అయితే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంట పొలాల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంతో కొందరు ట్రాక్టర్ల యజమానులు కేజ్‌వీల్స్‌తో తారురోడ్లపై తిప్పుతున్నారు. దీంతో రోడ్లు పాడైపోయి ఏడాదిలోగానే గుంతలమయంగా మారుతున్నాయి.
పదికాలలు మన్నికగా ఉండాల్సిన రోడ్లు మున్నాళ్లకే పాడైపోతున్నాయి. రూ. కోట్లతో తారు రోడ్లు నిర్మించిన అధికారులు ఆ రోడ్లపై ఓ బోర్డు పాతి చేతులు దులుపుకుంటున్నారు. రోడ్లపై కేజ్‌వీల్స్ ఉన్న ట్రాక్టర్లను తిప్పితే జరిమానాతో పాటు జైలుశిక్ష విధిస్తామని ఓ హెచ్చరిక బోర్డు మాత్రం ఏర్పాటుచేస్తున్నారు. అయితే ఇటువంటి సంఘటనల్లో ఇప్పటి వరకు ఎక్కడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. రహదారులు మన్నికగా ఉండాలంటే గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం సంబంధిత అధికారులపై ఉంది. లేకుంటే ప్రతియేటా రోడ్ల మరమ్మతులకోసం ప్రజాధనం వృధాగా వెచ్చించకతప్పదు.