జోరుగా బ్లాక్ దందా
Published Fri, Jul 29 2016 11:49 PM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM
l మూడు నెలలుగా రెవెన్యూ స్టాంపుల కొరత
l సరఫరా చేయని ప్రభుత్వం
l రూపాయి స్టాంప్ ఐదు రూపాయలకు అమ్మకాలు
జనగామ :
రూపాయి రెవెన్యూ స్టాంపు.. ఐదు పలుకుతుంది.. ప్రైవేట్‌లో జోరుగా అమ్మకాలు జరుగుతుంటే.. పోస్టాఫీసులో మాత్రం లేవనే సమాధానం వినిపిస్తుంది. జనగామ సబ్ డివిజన్‌లో మూడు నెలలుగా రెవెన్యూ స్టాంపుల కొరత కలవరపెడుతుంది. జనగామ నియోజక వర్గంతో పాటు లింగాలఘణపురం, రఘునాథపల్లి పరిధిలోని 15 సబ్ పోస్టాఫీసుల్లో రెవెన్యూ స్టాంపుల కొరత ఏర్పడింది. ప్రైవేట్ మార్కెట్‌లో మాత్రం విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారు. ఒక్క రూపాయి స్టాంపును ఏకంగా ఐదు రూపాయలకు విక్రయిస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. పోస్టాఫీసులకు మూడు నెలలుగా లేని సరఫరా.. ప్రైవేట్ మార్కెట్‌లో ఎలా దొరుకుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు లో రుణాలు, ఉద్యోగులు, ప్రైవేట్ ఫైనాన్స్‌లు, ఎల్‌ఐసీ, చిట్‌ఫండ్స్ ఇలా అనేక రకాల వాటికి రెవెన్యూ స్టాంపులు తప్పనిసరి. సబ్ డివిజన్ పరిధిలో కొంతమంది ఏజెంట్ల కనుసన్నలల్లో కొనసాగుతున్న రెవెన్యూ స్టాంపుల బ్లాక్ దందాపై పోస్టల్ శాఖ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.
మూడు నెలలుగా కొరత ఉంది
మూడు నెలలుగా రెవెన్యూ స్టాంపుల కొరత ఏర్పడింది. హైదరాబాద్ సర్కిల్ స్టాంపు డిపో నుంచి రావాల్సి ఉన్నాయి. జనగామతో కలుపుకుని 15 మండలాల పరిధిలో ప్రతి నెల రూ.30వేల రెవెన్యూ స్టాంపుల అమ్మకాలు ఉంటాయి. పదిహేను రోజుల క్రితమే ఇండెంట్ కూడా పంపించాం. ప్రైవేట్ మార్కెట్‌లో అధిక ధరలకు
అమ్ముతున్నారనే విషయం దృష్టికి రాలేదు.
–సాంబశివుడు,పోస్టుమాస్టర్, జనగామ హెడ్ ఆఫీస్
రెవెన్యూ స్టాంపు రూ.5కు అమ్ముతున్నారు
పోస్టాఫీసులో రెవెన్యూ స్టాంపులు లేకపోవడంతో ప్రైవేట్‌లో ఐదు రూపాయలకు విక్రయిస్తున్నారు. మూడు నెలలుగా ఫోస్టాఫీసులకే సరఫరా లేని పరిస్థితులో ప్రైవేట్‌లో లక్షల్లో రెవెన్యూ స్టాంపులు ఎలా దొరుకుతున్నాయి. దీనిపై పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలి.
–కాసుల శ్రీనివాస్, జిరాక్స్ సెంటర్ యజమాని
Advertisement
Advertisement