సువర్ణముఖి నదిలో నాటు పడవపై గెడ్డలుప్పి గ్రామస్తుల ప్రయాణం
కొత్తవలస, గెడ్డలుప్పి గ్రామస్తుల తిప్పలు
సీతానగరం: సువర్ణముఖి నది పదిరోజులుగా ఉధతంగా ప్రవహిస్తుండటంతో కొత్తవలస, గెడ్డలుప్పి గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బొబ్బిలి– మక్కువ బీటీరోడ్డులో బగ్గందొరవలస కూడలి నుంచి కూతవేటు దూరంలో ఉన్న గెడ్డలుప్పి, కొత్తవలస గ్రామాల ప్రజల రాకపోకలు సువర్ణముఖీనదిలోంచి సాగుతాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో నదిలో నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొత్తవలస డ్యామ్ వద్ద రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది. డ్యామ్‌పై నాచు చేరడంతో నడవలేకపోతున్నారు. గెడ్డలుప్పి ప్రజల పరిస్థితి మరీ దారుణం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, వర్తకులు గెడ్డలుప్పి–బగ్గందొరవలస గ్రామాల వద్ద సువర్ణముఖీ నది రేవులో ప్రమాదకరమని తెలిసినా విధిలేక నాటు పడవలో రాకపోకలు సాగిస్తున్నారు. సువర్ణముఖినదిపై గెడ్డలుప్పి. బగ్గందొరవలస గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి నిధులు విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంతవరకూ పనులు చేపట్టలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వంతెన నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.