suvarnamukhi
-
సువర్ణముఖిలో ప్రమాదకర ప్రయాణం
కొత్తవలస, గెడ్డలుప్పి గ్రామస్తుల తిప్పలు సీతానగరం: సువర్ణముఖి నది పదిరోజులుగా ఉధతంగా ప్రవహిస్తుండటంతో కొత్తవలస, గెడ్డలుప్పి గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బొబ్బిలి– మక్కువ బీటీరోడ్డులో బగ్గందొరవలస కూడలి నుంచి కూతవేటు దూరంలో ఉన్న గెడ్డలుప్పి, కొత్తవలస గ్రామాల ప్రజల రాకపోకలు సువర్ణముఖీనదిలోంచి సాగుతాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో నదిలో నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొత్తవలస డ్యామ్ వద్ద రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది. డ్యామ్‌పై నాచు చేరడంతో నడవలేకపోతున్నారు. గెడ్డలుప్పి ప్రజల పరిస్థితి మరీ దారుణం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, వర్తకులు గెడ్డలుప్పి–బగ్గందొరవలస గ్రామాల వద్ద సువర్ణముఖీ నది రేవులో ప్రమాదకరమని తెలిసినా విధిలేక నాటు పడవలో రాకపోకలు సాగిస్తున్నారు. సువర్ణముఖినదిపై గెడ్డలుప్పి. బగ్గందొరవలస గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి నిధులు విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంతవరకూ పనులు చేపట్టలేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వంతెన నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. -
సువర్ణముఖికి వరద.. భారీగా పంటనష్టం
వంగర (శ్రీకాకుళం): గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటి ప్రవాహం పెరగడంతో.. సువర్ణముఖి నదికి వరద పోటెత్తుతోంది. దీంతో నది తీరంలో ఉన్న గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. తీరంలో ఉన్న కొప్పర, కొండచాకరపల్లి గ్రామాలకు నీటి తాకిడి పెరగడంతో.. గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు. ఒకవేళ వరద ఇలాగే కొనసాగితే.. రాత్రి వరకు గ్రామలు నీట మునిగే ప్రమాదముందని భయపడుతున్నారు. ఇప్పటికే 300 ఎకరాలలో పంట నీటమునిగింది. వరద ఇలాగే కొనసాగితే మా పరిస్థితి ఏంటి అని గ్రామస్థులు వాపోతున్నారు. -
కొట్టుకు పోయిన కాజ్ వే - రాకపోకలు బంద్
విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని సువర్ణముఖి నదిపై కట్టిన కాజ్వే కొట్టుకుపోవడంతో యానాం, దుగవనందగితో సహా పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు సువర్ణముఖి నది పరవళ్లు తొక్కుతూ ప్రవహించడంతో కాజ్వే కొట్టుకుపోయింది.