దారికాసిన మృత్యువు
దారికాసిన మృత్యువు
Published Thu, Aug 18 2016 1:30 AM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM
కాళ్ల : రహదారులపై దారి కాసిన మృత్యువు ముగ్గురిని బలిగొంది. బస్సు ఢీకొని ఒకరు, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి మరొకరు మరణించగా, చెట్టును ఢీకొన్న ఓ మోటర్‌సైక్లిస్టు దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామానికి చెందిన దవులూరి కమలరత్నం, ఎలిజబెత్‌రాణి దంపతులు మోటార్‌సైకిల్‌పై ఉండి మండలం పెదపుల్లేరు వెళ్లి తిరిగివస్తుండగా.. కాళ్ల పీహెచ్‌సీ పరిధిలో రుద్రాయకోడు వంతెనపై ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే దవులూరి ఎలిజబెత్‌రాణి (40) మృతి చెందారు. భర్త కమలరత్నంకు తీవ్రగాయాలయ్యాయి. మితిమీరిన వేగంతో వచ్చిన బస్సు ఢీకొనడంతోపాటు సుమారు 15 అడుగుల మేర ఈడ్చుకుపోవడంతో ఎలిజబెత్ అక్కడికక్కడే మరణించారు. కమలరత్నాన్ని భీమవరం ఆస్పత్రికి తరలించారు. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుతారనుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కాళ్ల హెడ్‌కానిస్టేబుల్ గోపాలకృష్ణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని..
భీమవరం అర్బన్ : మండలంలోని లోసరి గరవళ్లదిబ్బ వద్ద మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా, కృత్తివెన్ను మండల లక్ష్మీపురం పల్లిపాలెం గ్రామానికి చెందిన మల్లాడి నరసింహస్వామి (47), కలిదిండి మండలం చొరంపూడికి చెందిన తిరుమాని ఏలియా ఇద్దరూ కలిసి మోటార్ సైకిల్‌పై నాగిడిపాలెం గ్రామంలో పనులు ముగించుకుని అర్ధరాత్రి 11 గంటల సమయంలో లక్ష్మీపురం పల్లిపాలెం వెళ్తుండగా లోసరిలోని గరవళ్లదిబ్బ గుడి వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో మల్లాడి నరసింహస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుమాని ఏలియా తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి ఏలియాను అంబులెన్సులో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడు ఏలియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ ఎం.కె.వి.సత్యనారాయణ బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టును ఢీకొని మోటార్‌సైక్లిస్ట్
లింగపాలెం : చెట్టును ఢీకొని మోటార్‌సైక్లిస్ట్ మృతిచెందిన ఘటన మంగళవారం రాత్రి ఏలూరు మండలం వట్లూరు వద్ద జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. లింగపాలెం మండలం ముడిచెర్ల గ్రామానికి చెందిన బాల బాబ్జి(40) కొంతకాలంగా ఏలూరులో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి హనుమాన్ జంక్షన్‌కు పనిమీద మోటార్‌సైకిల్‌పై వెళ్తుండగా, వట్లూరు వద్ద ఓ చెట్టును ఢీకొట్టి మరణించారు. బాబ్జి అంత్యక్రియలు బుధవారం ముడిచెర్ల గ్రామంలో జరిగాయి. బాబ్జి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాబ్జి వైఎస్సార్ సీపీ నేత బాల సుబ్బారావు ఏకైక కుమారుడు. వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళీరామకృష్ణ, కామవరపుకోట సొసైటీ అధ్యక్షుడు ఘంటా సత్యంబాబులకు స్వయనా బావమరిది. బాబ్జి మృతి వార్త తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నేతలతోపాటు, పలు పార్టీల నాయకులు ముడిచెర్లలోని ఆయన ఇంటికి వచ్చారు. బాబ్జి మృతదేహాన్ని ఘంటా మురళీరామకృష్ణ, చింతలపూడి మాజీ సమితి అధ్యక్షుడు మందలపు సత్యన్నారాయణ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ముసునూరి వెంకటేశ్వరావు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రావి కొండయ్య, కె.గోకవవరం సొసైటీ అధ్యక్షుడు ఎ.సూరిబాబు సందర్శించారు.
Advertisement
Advertisement