‘టీడీపీ కార్యకర్తల కోసమే వేడుకలు’
అనంతపురం అర్బన్ : రాష్ట్ర స్థాయిలో 70వ స్వాతంత్య్ర వేడుకలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసమే ప్రభుత్వం నిర్వహించి, వేడుకల్ని అధికార పార్టీ కార్యక్రమంగా మార్చిందని కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. వేడుకల్ని తిలకించే భాగ్యాన్ని సామాన్యులకు లేకుండా చేశారని, రాజకీయపార్టీల నేతల్ని ఆహ్వానించాలన్న జ్ఞానం ఆ పార్టీ నాయకులకు లేకుండా పోయిందని మండిపడ్డారు. వేడుకలు నిర్వహించిన నీలం సంజీవరెడ్డి స్టేడియంను శుభ్రం చేసేందుకు మంగళవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయం నుంచి బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని జిల్లా అధ్యక్షులు కోటా సత్యనారాయణ, నగర అధ్యక్షుడు దాదాగాంధీ, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీరమణ, నాయకుల్ని అరెస్టు చేసి టూటౌన్ పోలీసు స్టేషన్‌కి తరలించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్టేడియంలోకి ప్రజల్ని పంపకుండా, పచ్చ జెండాలు పట్టుకున్నవారిని లోపలికి అనుమతించారని దుయ్యబట్టారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరికైనా ఉందా అని ప్రశ్నించారు. అనంతరం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అనంతరం టవర్ క్లాక్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి నాయకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో నాయకులు బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్, అధికార ప్రతినిధి మాసూలు శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అగిశం రంగనాథ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు జి.వాసు, సత్యనారాయణ, నాయకులు కొండారెడ్డి, వైఆర్ కృష్ణ, తిరుపాలు, చంద్రశేఖర్, హరిరాయల్, తదితరలు పాల్గొన్నారు.