బతుకు బాటలో మృత్యుగూటికి
Published Fri, Jan 13 2017 12:26 AM | Last Updated on Tue, Sep 5 2017 1:06 AM
- ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం
- నందివర్గం సమీపంలో ఘటన
బనగానపల్లె రూరల్ :
కుటుంబ జీవనం కోసం కూలీ పనులకు వెళ్లిన ఓ యువకున్ని మృత్యువు ట్రాక్టర్ ప్రమాదం రూపంలో పొట్టనపెట్టుకుంది. బాధిత కుటుంబీకులకు తీరని రోదన మిగిల్చింది. నందివర్గం సమీపంలో గురువారం జరిగిన ఈ ఘటనలో ఎస్.సురేష్ (20) అనే యువకుడు అక్కడికక్కడే మరణించాడు. ఏఎస్‌ఐ చంద్రశేఖర్, కుటుంబ సభ్యుల వివరాల మేరకు బీరవోలు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, బాలహుస్సేనమ్మ దంపతులకు సురేష్, సంతోష్ కుమారులు. సురేష్‌తో పాటు అదే గ్రామానికి చెందిన బాషా ట్రాక్టర్‌కు నాపరాయి లోడింగ్ పనులకు వెళ్లారు. పలుకూరు గనిలో నాపరాయి గద్దెలను లోడ్ చేసుకుని బండి ఆత్మకూరు గ్రామానికి బయలుదేరారు. నందివర్గం సమీపానికి రాగానే ట్రాక్టర్ డ్రైవర్ సడన్‌బ్రేకులు వేయడంతో ట్రాలీ బోల్తా పడింది. ఘటనలో ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న సురేష్‌పై రాళ్లు పడడంతో అక్కడిక్కడే మృతి చెందారు. బాషాకు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులు..
మృతి చెందిన సురేష్ నేత్రాలను ఆయన తల్లిదండ్ల్రులు దానం చేశారు. నంద్యాల
శాంతిరామ్ వైద్యశాల కంటివైద్యులు బాధిత కుటుంబీకుల నుంచి మృతుడి నేత్రాలను స్వీకరించారు.
Advertisement