కులవృత్తులే ఆధారం | decades of proffesional works | Sakshi
Sakshi News home page

కులవృత్తులే ఆధారం

Published Wed, Aug 10 2016 7:15 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM

వడ్రంగి పని చేస్తున్న పండరి

వడ్రంగి పని చేస్తున్న పండరి

  • ఆదరణ లేకున్నా వీడని మమకారం
  • వృత్తిని నమ్ముకునే దశాబ్దాలుగా జీవనం
  • బతుకుబండిని లాగుతున్న వైనం
  • సర్కార్‌ చేయూతనివ్వాలని వేడుకోలు
  • జోగిపేట: ‘విద్యలెన్ని ఉన్నా.. కుల విద్యకు సాటిరావు’ అంటూ వృత్తి గొప్పతనాన్ని వర్ణించాడో కవి. కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తేనే వృత్తిని ఆస్వాదించవచ్చు. తృప్తి  పొందొచ్చు. గతాన్ని.. ప్రస్తుతాన్ని పరిశీలిస్తే కులవృత్తులపై ఆధారపడి జీవించే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. పారిశ్రామికీకరణ, ఆధునిక పోకడలు మార్కెట్లో ప్రవేశించడంతో వృత్తికి ఆదరణ లేకుండాపోయింది. అయినా జోగిపేట, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్‌ లాంటి పట్టణాల్లో పలువురు దశాబ్దాల తరబడి కులవృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారు.

    వృత్తినే దైవంగా భావిస్తున్నారు. కష్టపడి కుటుంబాలను పోషిస్తున్నారు. కొన్ని కుటుంబాలైతే పిల్లలతో పాటు అందరూ కూడా వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నారు.  పిల్లలను ఉన్నతంగా చదివిస్తున్నారు. కులవృత్తితో బతుకుబండిని లాగిస్తున్న కొందరిపై అభిప్రాయాలను ‘సాక్షి’ సేకరించింది.

    నాలుగు దశాబ్దాలుగా...
     నాలుగు దశాబ్దాలుగా.. వడ్రంగి పనిచేసుకుంటూ బతుకుతున్నా. కులవృత్తినే దైవంగా భావిస్తున్నారు. ఇప్పటోళ్లు కుల వృత్తి చేసేందుకు ముందుకు వస్తలేరు. మా కాలంలో చేసినం. కానీ అప్పుడు ఇప్పుడు కష్టమే. ఈ పని చేసుకుంటనే పిల్లలను సదివిస్తున్నా. కూతురును ఎంబీఏ చదివిస్తున్న మిగతా వారిని ఇక్కడే చదివిస్తున్నాను. సర్కారు పట్టించుకుంటేనే ముందు..ముందు కుల వృత్తులు బతుకుతాయి. - పండరి, వడ్రంగి

    ఇస్త్రీతోనే బతుకు...
    బట్టలు ఉతుకుతూ, ఇస్త్రీ చేస్తూ బతుకు ఎల్లదీస్తున్నా. పదేళ్లుగా ఇదే పని చేసుకుంటున్నా. ఇది తప్ప మరొకటి తెల్వది. నాకు ఇద్దరు పిల్లలు. ఇస్త్రీ చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నా. కులవృత్తి తప్ప వేరే పని చేసే పరిస్థితులు లేవు. కుల వృత్తిమీదనే ఆధారపడి జీవనం సాగించుకుంటూ బట్ట, పొట్ట పూర్తికి సంపాదించుకుంటున్నా. ప్రభుత్వం మాలాంటి వృత్తి చేసుకునేటోళ్లకు సాయం చేస్తే మా బతుకులు బాగుపడతాయి. సర్కారు సబ్సిడీ రుణాలు, అందరికి పెన్షన్లు ఇప్పియ్యాలి. - మురళీ, రజకుడు

    దర్జా లేకున్నా...
    కుల వృత్తిపై ప్రేమతోనే కాలం వెళ్లదీస్తున్నాను. ప్రస్తుతం ఉన్న ఖర్చులకు, చదువులకు కులవృత్తులపై ఆధారపడటం చాలా కష్టంగా ఉంది. బతుకు భారంగా తయారవుతుంది. అయినా  నా కొడుకును హైదరాబాద్‌లో ఎంఏ చదివిస్తున్నాను. ఇప్పుడు రెడీమేడ్‌ ప్రపంచం నడుస్తుండడంతో దర్జీలకు గిరాకీ తగ్గింది. ఏదో గిన్ని రోజుల నుంచి కులవృత్తి మీదే ఆధారపడి బట్టపొట్ట మందం బతికినం. ప్రభుత్వం సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి. అర్హులకు ఫించన్లు ఇయ్యాలే. మా బతుకులకు భరోసా ఇయ్యాలె. అట్లయితేనే మా బతుకులు బాగుపడుతయ్‌. - విశ్వేశ్వరరావు, దర్జీ

    బంగారం పట్టినా..
    స్వర్ణకారుడిగా బంగారు, వెండి ఆభరణాలను తయారు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. 30 ఏళ్లుగా కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాను. వృత్తిని నమ్ముకొని ధైర్యంగా పనిచేసుకుంటున్నాను. మా కుటుంబం అంతా కుల వృత్తిపై ఆధారం. సీజన్‌ బట్టి ఈ వృత్తి ద్వారా ఆదాయం వస్తుంది. ఆషాఢమాసాల్లో అంతంతే ఉంటుంది. వస్తువులు రెడీమేడ్‌గా దొరకడం వల్ల స్వర్ణకారులకు కాస్త గిరాకీ తగ్గింది. బ్యాంకులు స్వర్ణకారులకు లోన్‌లు ఇవ్వాలి. కులవృత్తులు అంతంకాకుండా చూడాలె. - రెడ్డిపల్లి చంద్రయ్య, గోల్డ్‌ స్మిత్‌

    బట్ట, పొట్ట మందమే...
    పదేళ్లుగా క్షవర వృత్తి చేసుకుంటూనే కుటుంబాన్ని పోషిస్తున్నా. వృత్తిపై మమకారంతో కులవృత్తినే నమ్ముకున్నాను. కులవృత్తి చేస్తే బట్టపొట్ట మందమే కానీ ఆస్తులు సంపాదించే పరిస్థితిలేదు. పైసా కూడబెట్టిందైతే లేదు. కులవృత్తి చేసి బతికే వారికి సహకార సబ్సిడీ రుణాలు ఇప్పిస్తే కొంత వరకు బాగుపడతాం. వృత్తి అభివృద్ధి చేసుకొని జీవిస్తాం. పింఛన్ల సౌకర్యం కల్పించాలి. - మధుకిరణ్, నాయీబ్రాహ్మణుడు

    చేయూతలేని చేనేత
    చేనేత వృత్తిలో 25 సంవత్సరాల జీవితం గడిచిపోయింది. చేసే వృత్తితోనే బట్టాపొట్టా గడుస్తది. దీనిపైనే ఆధారపడి ఇళ్ళు మొత్తం బతకాలే. పిల్లల చదువులు సాగుతున్నాయి. పిల్లలను చదివిద్దామంటూ చాలా ఇబ్బందిగా ఉంది. పెరుగుతున్న ఖర్చులకు..ఈ సదువులు...ఫీజులుసూత్తేనే భయమైతుంది. అయినా ఎలాగో సంసారం నెట్టుకొస్తున్నాం. సర్కారు సాయం చేస్తే మా బతుకులు బాగు పడుతాయ్‌. సర్కారు బడుల్లోనే మా పిల్లలను చదివించినం. గిట్లనే ఉంటే రాను రానూ నేత మగ్గాలు కనిపించకుండా పోతయ్‌. చేనేత కార్మికులు నేసిన బట్టలకు పైసలు పెంచాలి. - సంగయ్య, నేత కార్మికుడు

    కుటుంబానికి అన్నం పెడుతుంది
    మా కుటుంబం అంతా మోచి వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. 40 ఏళ్లుగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. మా ముగ్గురు పిల్లలను డిగ్రీలు చదివించాను.  మా భార్యకి క్యాన్సర్‌ ఆపరేషన్‌ అయి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కులవృత్తిపై నమ్మకంతో అప్పులు చేసి తీరుస్తున్నా కులవృత్తే మా కుటుంబ సభ్యులందరికి అన్నం పెడుతుంది.  ప్రభుత్వం రుణాలను, పెన్షన్‌లు ఇప్పించి ఆదుకోవాలి. కుటుంబం అంతా దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ప్రభుత్వం మాలాంటి వారిని ఆదుకోవాలి. - దుర్గారాజ్‌, మోచీ

    మాంసం అమ్ముకుంటేనే..
    మాంసం అమ్ముకుంటూ మా కుటుంబాన్ని పోషిస్తున్నాను. మా తల్లిదండ్రులు పెద్దగా చదివించకపోవడంతో ఈ వృత్తిపైనే ఆధారడి బతుకుతున్నాం. నా ఇద్దరు పిల్లలను మాత్రం చదివిస్తున్నాను. సీజన్‌, అన్‌సీజన్‌ ఉన్నా తట్టుకొని ఈ వృత్తిలో కొనసాగుతున్నాం. జీవాల హెచ్చుతగ్గులు కావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. - కటికె లక్ష్మణ్‌, మాంసం విక్రయదారుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement