
చేవెళ్లను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
- ప్రజాభిప్రాయాన్ని గౌరవించక పోవడం విడ్డూరం
- అంగీకారం తెలిపిన ప్రజాప్రతినిధులు బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్
- జిల్లా సాధన సమితి, అఖిలపక్షం రాస్తారోకో
చేవెళ్ల: పార్లమెంటు నియోజక వర్గ కేంద్రమైన చేవెళ్లను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ జిల్లా సాధన సమితి, అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ హైదరాబాద్-బీజాపూర్ ప్రధాన రహదారిపైనున్న మండల కేంద్రంలోని బస్‌స్టేషన్ ఎదుట శుక్రవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చేవెళ్ల నియోజకవర్గాన్ని వికారాబాద్‌లో కలుపుతూ ప్రభుత్వం ముసాయిదాను విడుదల చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించకుండా పశ్చిమంలో ఉన్న వికారాబాద్‌లో కలపడం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్ నగరానికి ఆనుకొని ఉన్న చేవెళ్ల నియోజకవర్గంలోని మండలాలను వికారాబాద్‌లో కలిపితే పాలనా సౌలభ్యం ప్రజలకా, అధికారులకా, ప్రజాప్రతినిధులకా అంటూ ప్రశ్నించారు. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాలే జిల్లా కేంద్రాలుగా ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని కూడా ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
తమ ప్రాంతాన్ని వికారాబాద్‌లో కలిపినా ఈ నియోజకవర్గానికే చెందిన మంత్రి, జెడ్పీ చైర్‌పర్సన్, ప్రజాప్రతినిధులు కిమ్మనకుండా మౌనంగా ఉండడంలో ఆంతర్యమేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చేవెళ్లను వికారాబాద్‌లో కలపడానికి అంగీకారం తెలిపితే బహిరంగ ప్రకటనలు చేయాలన్నారు. ఇప్పటికీ సమయం మించిపోలేదని, అభ్యంతరాల స్వీకరణకు ప్రభుత్వం నెలరోజులు గడువు ఇచ్చినందున చేవెళ్ల నూతన జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి చొరవ చూపాలని విజ్ఞప్తిచేశారు. రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు జోక్యం చేసుకొని రాస్తారోకో విరమింపజేసి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయపు ఏఓ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో పలుపార్టీల అఖిలపక్ష నాయకులు ప్రభులింగం, రామస్వామి, పాండుయాదవ్, టేకులపల్లి శ్రీనివాస్, సుధాకర్, దామోదర్, గోపాల్‌రెడ్డి, బాలయ్య, అబ్ధుల్‌ఘనీ, హైమద్, విద్యార్థులు, కళాకారులు పాల్గొన్నారు