ఎట్టకేలకు డీఎడ్ పరీక్షలు
ఎట్టకేలకు డీఎడ్ పరీక్షలు
Published Mon, May 29 2017 11:03 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
-జూలై 6 నుంచి 12 వరకు నిర్వహణ
రాయవరం(మండపేట) : ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయ శిక్షణ కోర్సు(డీఎడ్) 2015–17 బ్యాచ్‌కు సంబంధించి తొలి ఏడాది పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఎట్టకేలకు సన్నద్ధమైంది. ఈ మేరకు శుక్రవారం పరీక్షల టైం టేబుల్ వెల్లడించారు. జూలై 6 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆరో పేపరు మినహా మిగిలిన ఐదు సబ్జెక్టులకు సంబంధించి కొత్త, పాత సిలబస్ అనుసరించి ప్రశ్నపత్రాలు ఉంటాయి. ఆరో పేపరుకు మాత్రం కొత్త సిలబస్‌ను అనుసరించనున్నట్లు ప్రకటించారు.
తొమ్మిదినెలలు ఆలస్యం..
2015–17 విద్యా సంవత్సరానికి 2015 డిసెంబరులో డీఎడ్ ప్రవేశాలు పొందిన ఛాత్రోపాధ్యాయులకు వాస్తవానికి 2016 సెప్టెంబరులోనే పరీక్షలు జరగాల్సి ఉంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో లోపాల వల్ల పరీక్షల నిర్వహణలో జాప్యం చోటు చేసుకుంది. స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో ఒక్కో ప్రవేశానికి రూ.2 వేల అపరాధ రుసుమును విధిస్తూ గత డిసెంబరులో ఉత్తర్వులు జారీ చేశారు. అపరాధ రుసుమును రూ.వెయ్యికి తగ్గించాలని కోరుతూ అన్ ఎయిడెడ్ కళాశాలల యాజమాన్యాల చేసి విజ్ఞప్తులతో పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యమైంది. తొమ్మిది నెలలు ఆలస్యంగా జూలై 6 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
చివరి అరగంటలో బిట్ పేపరు..
2015–17 బ్యాచ్‌కు కొత్త సిలబస్‌లను అనుసరించి పరీక్షలను నిర్వహించనుండగా, అంతకు ముందు బ్యాచ్‌కు సంబంధించి మాత్రం పాత సిలబస్‌ను అనుసరించి పరీక్షలను నిర్వహిస్తారు. వారికి ఇదే చివరి అవకాశంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరు పేపర్లకు సంబంధించి అభ్యర్థులకు చివరి అరగంటలోనే 20 మార్కులకు బిట్ పేపరు ఇవ్వనున్నారు. బిట్ పేపరు ఇవ్వడం ఇదే తొలిసారిగా అధ్యాపకులు పేర్కొంటున్నారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్ కళాశాలల నుంచి సుమారు మూడు వేల మంది ఛాత్రోపాధ్యాయులు పరీక్షలకు హాజరు కానున్నారు. వీరిలో కన్వీనర్, యాజమాన్య కోటా నుంచి 2,122 మంది ప్రవేశాలను పొందగా 841 మంది స్పాట్ అడ్మిషన్ల పేరుతో ప్రవేశాలను పొందడం గమనార్హం. ఇదిలా ఉండగా మొదటి సంవత్సరం శిక్షణ పూర్తి చేసుక్ను ఛాత్రోపాధ్యాయులు రెండో ఏడాది శిక్షణ గతేడాది అక్టోబరు నెల నుంచి పొందుతున్నారు. రెండేళ్ల పరీక్షలు ఒకేసారి రాయాల్సి వస్తుందేమోనని ఇప్పటి వరకు ఛాత్రోపాధ్యాయులు భయాందోళనలు వ్యక్తం చేశారు. తాజాగా డీఎడ్ పరీక్షల నిర్వహణకు తేదీలను ప్రకటించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం..
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పరీక్షలను నిర్వహిస్తాం. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నాం.
–అప్పారి జయప్రకాష్, ప్రభుత్వ డైట్ కళాశాల, బొమ్మూరు
అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం..
ఛాత్రోపాధ్యాయుల మొదటి సంవత్సరం పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తాం.
– జి.నాగేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల విభాగం, కాకినాడ
Advertisement