ప్రతి కుటుంబానికి ‘దీపం’ కనెక‌్షన్
Published Wed, May 17 2017 11:23 PM | Last Updated on Tue, Sep 5 2017 11:22 AM
కర్నూలు(అగ్రికల్చర్): వచ్చే నెల 2 నాటికి రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ దీపం పథకం కింద కనెక‌్షన్ ఇవ్వాలని, ఇందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీపం పథకం అమలుపై ఆ శాఖ కమిషనర్ రాజశేఖర్‌తో కలసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో రాష్ట్రాన్ని కిరోసిన్ రహిత రాష్ట్రంగా ప్రకటించాలని నిర్ణయించిందని, ఇందులో భాగంగా ప్రతి కుటుంబానికి గ్యాస్ కనెక‌్షన్ ఉండి తీరాలని తెలిపారు.
రేషన్ కార్డు కలిగి ఉండి ఇంతవరకు గ్యాస్ కనెక‌్షన్ లేని కుటుంబాలను గుర్తించి వారికి గ్యాస్ కనెక‌్షన్‌లు ఇవ్వాలని ఆదేశించారు. కర్నూలు నుంచి జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో రేషన్ కార్డు ఉండి గ్యాస్ కనెక‌్షన్ లేని కుటుంబాలు 1.75 లక్షలు ఉన్నాయని, వీటికి జూన్2 లోపు గ్యాస్ కనెక‌్షన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రూ.1000 కే గ్యాస్ కనెక‌్షన్‌పై పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. డీఎస్‌ఓ సుబ్రహ్మణ్యం, కర్నూలు, నంద్యాల, ఆదోని ఆర్‌డీఓలు హుసేన్ సాహెబ్, రాంసుందర్‌రెడ్డి, ఓబులేసు పాల్గొన్నారు.
Advertisement
Advertisement