
వైభవంగా దీపార్చన సేవ
ఇంద్రకీలాద్రి : ఇంద్రకీలాద్రిపై కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు జరుగుతున్న దీపార్చన సేవ శనివారం వైభవంగా జరిగింది. సాయంత్రం అమ్మవారికి పంచహారతుల అనంతరం మల్లేశ్వరస్వామి వారి ఆలయం నుంచి శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవ మూర్తులను పల్లకీపై ఊరేగింపుగా రాజగోపురం వద్దకు తీసుకువచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆది దంపతులకు దీపార్చన సేవ జరిగింది. దీపార్చన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు...
శనేశ్వర యంత్ర పూజ
అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న యంత్ర పూజలలో భాగంగా శనివారం శని త్రయోదశిని పురష్కరించుకుని శనేశ్వర స్వామి వారి యంత్ర పూజలు జరిగాయి. అర్చకులు కరణం శరత్‌కుమార్ , సుదర్శన కృష్ణలు శనేశ్వర స్వామి వారి యంత్రాన్ని రంగు రంగుల మగ్గులతో వేసి పూజలు నిర్వహించారు. స్వామి వారి యంత్రం చుట్టు ఏర్పాటు చేసిన దీపాలను భక్తులు వెలిగించి పూజలు నిర్వహించారు.
పౌర్ణమిన మహా పూజ
ఇంద్రకీలాద్రిపై సోమవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని మహా పూజ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. రాజగోపురం వద్ద నిర్వహించే ఈ పూజ రాత్రి 7–30 గంటలకు ప్రారంభం కానుంది. రూ. 1,116ల టికెటు కొనుగోలు చేసిన భక్తులు ఈ పూజలో పాల్గొనవచ్చు.