మాకు దిక్కెవరు బిడ్డా..
♦ కోలుకోని రాంసింగ్ తండా అంతా నిర్మానుష్యం
♦ పెళ్ళయిన ఇంట చావు డప్పులు
♦ బాధిత కుటుంబాల్లో ఆర్తనాదాలు
♦ దేవుడు కనికరం చూపలేదని శాంతిబాయి రోదన
♦ అమ్మేదంటూ అమాయకంగా అడుగుతున్న చిన్నారులు
‘దేవుడా మాకిదే గోస... మాపై కని కరం లేదెందుకు?... మా ఇంట్లోళ్లం దరిని తీసుకుపోయినవు.. ఈ తండా కు మా నాయన పేరే పెట్టుకున్నం... మా కుటుంబానికే ఇంత అన్యాయం చేస్తావా?... అంటూ రాంసింగ్ తండాకు చెందిన దన్జీరాం భార్య శాంతిబాయి రోదించిన తీరు అందరిని కలిచివేసింది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడడంతో శాంతిబాయి తల్లడిల్లిపోయింది. భర్త,కొడుకు, కూతు రు, ఇద్దరు మరుదులను కోల్పో యి దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఘటనను తలచుకుంటూ కన్నీరుమున్నీరైంది. - కంగ్టి
కంగ్టి: దెగుల్‌వాడి దేవ్‌లా తండా ఘటన నింపిన విషాదం నుంచి ఇంకా రాంసింగ్ తండా కోలుకోలేదు. మూడు రోజులైనా ఇంకా విషాదఛాయలు వీడలేదు. తండా మొత్తం మూగబోయింది. ఆదివారం వివాహ తంతును పూర్తిచేసుకుని ఆనందంతో ఇంటికి బయలు దేరిన పెళ్లి బృందం మరో ఐదు నిమిషాల్లో పచ్చని పందిరికి చేరుకుంటామనేలోపు ఘోరం జరిగిపోయింది. విద్యుత్ వైర్లు లారీని తగలడంతో విద్యుదాఘాతానికి ఏడుగురు అక్కడిక్కడే ప్రాణాలు వదిలిన విషయం తెల్సిందే. పెళ్లయిన పది గంటల్లోపే తండాలో పెడబొబ్బలు, చావు డప్పులు మోగడం ప్రతిఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
పెళ్లిబృందం లారీకి విద్యుత్ తీగలు తగలడంతో చోటుచేసుకున్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు విడిచారు. అందులో చౌకన్‌పల్లి రాంసింగ్ తండాకు చెందిన ఆరుగురు మృత్యువాత పడ్డారు. అందులో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారుండడం అందరిని కలిచివేసింది. తమ తండ్రి పేరుతో ఉన్న రాంసింగ్‌తండాలో తమ కుటుంబానికే ఇంతటి అన్యాయం ఎందుకు జరిగిందంటూ నూతన వరుడు శివాజీ తల్లి, దన్జీరాం భార్య శాంతిబాయి రోదించింది. భగవాన్ హమాపర్ థోడాభీ ఛాయాభీ రకాడోకోని (దేవుడికైనా మాపై కనికరం ఎందుకు రాలేదు) అంటూ పెడబొబ్బులు పెట్టింది. హమ్‌కూ జీవా?(తామెలా బతకాలి?), బగర్‌వాలి వసరేర్ ఛోరి ఛిచాబర్(అనాథలుగా మిగిలిన పిల్లలు), ఏ య్యాడీ కన్నాఅయిచ్చీ(అమ్మా... ఎప్పుడోస్తావూ..) రోదించింది.
షాక్ నుంచి తేరుకోని వధూవరులు...
దన్జీరాంతోపాటు ఆ కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో ఇంటిల్లిపాదిని అనాథలను చేసింది. దన్జీరాంతోపాటు సోదరులు రాములు, వినోద్, కొడుకు శ్రీను, కూతురు కిస్సీబాయి ప్రాణాలు కోల్పోయారు. అదే తండాకు చెందిన రవి అలియాస్ లవ్ మరణించాడు. ఈ ఘటనతో నూతన వధూవరులు అర్చన, శివాజీ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు.
సోదరుడి పెళ్లికోసం వచ్చి..
కిస్సీబాయి కర్ణాటక నుంచి సోదరుడు శివాజీ పెళ్లి కోసం వచ్చి ఊహించని రీతిలో ప్రాణాలు విడిచింది. పెద్దవడ్‌గాంకు చెందిన దేవ్యాతో కిస్సీబాయికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వలస జీవులుగా జీవితాన్ని గడుపుతున్న వీరిలో పెను విషాదం చోటుచేసుకొంది. వీరికి అస్సీబాయి(8), సోనాబాయి(6), జగ్‌రాం(4), రాధా(2) పిల్లలున్నారు. ఈ ఘటనలో తల్లి ప్రాణాలు కోల్పోవడంతో అమాయక కూతురు సోనాబాయి తల్లి శవం ముందు నిలబడి చేతులు చాచి... ‘ఏ య్యాడీ క న్నాఆయిచ్ఛీ’ అంటూ ఏడ్వడంతో అక్కడున్న వారిని కలిచివేసింది.
వరుడి బాబాయిల మృత్యువాత...
బతుకుదెరువు కోసం పట్నం బాట పట్టి గప్‌చుప్‌లు అమ్ముకొంటూ జీవనం సాగిస్తున్న వరుడు శివాజీ బాబాయిలు రాములు, వినోద్‌లు కూడా మృత్యువాత పడ్డారు. వీరు పెళ్లికి రెండ్రోజుల ముందే రాంసింగ్ తండాకు చేరుకున్నారు. మూడో రోజే విద్యుదాఘాతానికి బలయ్యారు. రాములుకు భార్య మరోనిబాయి, కూతురు పూజ, కుమారులు యువరాజ్(8వ త రగతి), సచిన్ (ఆరోతరగతి) ఉన్నారు. వినోద్‌కు భార్య సోనాబాయి, కూతురు పవిత్ర(5 నెలలు), కుమారుడు కార్తీక్(3) ఉన్నారు. భర్త వినోద్‌ను కోల్పోయిన సోనాబాయి రోదనలు మిన్నంటాయి.
దన్జీరాం కుటుంబంలో మిగిలింది వీరే...
దన్జీరాంతోపాటు ఆయన కుమారుడు శ్రీను, కూతురు కిస్సీబాయి, ఇద్దరు సోదరులు రాములు, వినోద్ మరణించారు. అయితే ఈ కుటుంబంలో దన్జీరాం భార్య శాంతిబాయి, ముగ్గురు కుమారులు సంతోష్, అశోక్, శివాజీ, కూతురు పూలీబాయి మాత్రమే మిగిలారు.
నిశ్చితార్థం రోజే రవి అంత్యక్రియలు..
ఇదే తండాకు చెందిన బాబూసింగ్ కుమారుడు రవి(లవ్)కి నిశ్చితార్థం జరగాల్సిన రోజే అంత్యక్రియలు జరపాల్సి వచ్చింది. సోమవారం నిశ్చితార్థం జరగాల్సి ఉన్నందున శివాజీ పెళ్లికి వెళ్లొద్దని వారించినా వినలేదు. సాయంత్రం వరకు వస్తానని రవి తన తండ్రికి నచ్చజెప్పి వెళ్లాడు. అంతలోనే తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. రవికి ఐదుగురు అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు.
పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయంలో..
ఖేడ్ మండలం హంగిర్గా(కే) శ్యామాతండాకు చెందిన అశోక్ కు ఈ మధ్యే నిశ్చితార్థమైంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడు మమ్మల్ని వదిలిపోయాడని తల్లిదండ్రులు రోదిస్తున్నారు.