
ఓటమి భయంతోనే దాడులు
►అధికార బలాన్ని ప్రయోగిస్తే ప్రజలు ఊరుకోరు
►చంద్రబాబు ప్రజాద్రోహి
►ఉప ఎన్నికలో టీడీపీకి గుణపాఠం తప్పదు
►వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి
►ఇంటింటి ప్రచారానికి అపూర్వ స్పందన
నంద్యాల అర్బన్: ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే అధికార పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకుని తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేయిస్తోందని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘అధికార’ బలం ప్రయోగించి..ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, గట్టిగా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఆదివారం ఆయన నంద్యాల పట్టణంలోని 19, 20 వార్డులు, మండలంలోని రాయమాల్పురం, మునగాల గ్రామాల్లో నిర్వహించిన ప్రచారానికి విశేష స్పందన లభించింది. వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిల్పా మోహన్‌రెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా చంద్రబాబు ప్రజాద్రోహిగా మిగిలారన్నారు. ఆయనకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గోరుకల్లు రిజర్వాయర్ నిర్మించి ఎస్సార్బీసీ ద్వారా మునగాల, రాయమాల్పురం, ఊడుమాల్పురం గ్రామాల రైతులకు సాగునీరు అందించారని గుర్తు చేశారు. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంతో ప్రజల్లో అసహనం పెరిగిపోయిందన్నారు. టీడీపీ ఓటమి పాలవుతుందని తెలిసి నాయకులకు పదవులు, కార్యకర్తలకు డబ్బు ఎర వేస్తున్నారన్నారు. నంద్యాల ప్రజలు విజ్ఞులు అని, ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పార్టీ సీఈసీ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రైతులు, మహిళలు, నిరుద్యోగులు.. ఇలా ప్రతి ఒక్కరినీ మోసం చేసిన చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో టీడీపీ డబ్బు సంచులు సిద్ధం చేసుకుందన్నారు.
మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నిక ధర్మం, అధర్మం మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. ముస్లింలపై రాష్ట్ర ప్రభుత్వం కపట ప్రేమ చూపుతుందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముస్లింలకు చేసిన సేవలు ఎనలేనివన్నారు. అందుకే మైనార్టీలు ఎప్పుడూ వైఎస్సార్‌సీపీ వెంటే ఉంటారన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ ఉప ఎన్నిక గెలుపును వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానుకగా ఇవ్వాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో 19వ వార్డు పార్టీ ఇన్‌చార్జ్ వై.భీమ్‌రెడ్డి, గోస్పాడు మాజీ ఎంపీపీ రాజశేఖర్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు దేశం సుధాకర్‌రెడ్డి, సిమెంట్ ప్రసాదరెడ్డి, మహేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, నాజర్‌రెడ్డి, గోవిందరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, భూషణం, శ్రీనివాసగౌడ్, వెంకటేశ్వరగౌడ్, రాజగోపాల్‌రెడ్డి, బాల హుసేనయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.