జువ్వలదిన్నెలో ఢిల్లీ బృందం
-
మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణంపై ఆరా
బిట్రగుంట: బోగోలు మండలం జువ్వలదిన్నెలో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మించే ప్రాంతాన్ని ఢిల్లీకి చెందిన వ్యాప్‌కోస్ అధికారులు మంగళవారం పరిశీలించారు. వ్యాప్‌కోస్ చీఫ్ ఇంజనీర్ రమణతో కూడిన అధికారుల బృందం మినీ ఫిషింగ్‌హార్బర్ నిర్మించే ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులు, తీరంలోని వృక్ష సంపద, పర్యావరణ పరిస్థితులపై ఆరా తీసింది. సుమారు రూ.300 కోట్లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐదువేల మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో 550 పడవల సామర్ధ్యంతో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి జువ్వలదిన్నెలో ఏడాదిన్నర నుంచి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మట్టి పరీక్షలతో పాటు హైడ్రోగ్రాఫికల్, ఆర్థిక, సామాజిక సర్వేలు కూడా పూర్తయ్యాయి. వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రత్యేక పరికరాలు కూడా ఏర్పాటు చేసి విశ్లేషిస్తున్నారు. ఈక్రమంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కారణంగా పర్యావర ణ సంబంధిత అంశాలను అధికారులు పరిశీలించారు. మరో పది రోజుల్లో మరో బృందం పరిశీలించి తుది నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు ఈసందర్భంగా వ్యాప్‌కోస్ అధికారులు తెలిపారు. వారి వెంట కావలి మత్స్యశాఖ అధికారి ప్రసాద్ ఉన్నారు.