108 వాహనంలోనే ప్రసవం
- తెరుచుకోని శివ్వంపేట పీహెచ్‌సీ
- ఇబ్బందులు పడిన బాలింత
శివ్వంపేట: పురిటినొప్పులు రావడంతో ఆదివారం 108 వాహనంలో ఆసుపత్రికి బయలుదేరిన గర్భిణి మార్గమధ్యంలో ఆ వాహనంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. అక్కడి నుంచి శివ్వంపేట పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ఆసుపత్రి తెరుచుకోకపోవడంతో బాలింత తీవ్ర ఇబ్బందులు పడింది. గత్యంతరం లేక నర్సాపూర్ ఆసుపత్రికి చేరుకుంది. వివరాలు ఇలా...శివ్వంపేట మండలం పిల్లుట్లకు చెందిన కానుకుంట లక్ష్మి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారమిచ్చారు. వెంటనే ఆ వాహనం గ్రామానికి చేరుకుని లక్ష్మిని నర్సాపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో వాహనంలోనే మగబిడ్డకు జన్మనిచ్చింది.
108 ఈఎంపీ శ్రీనివాస్, పైలట్ రమేష్ సమయస్ఫూర్తితో ఆమెకు సుఖప్రసవం జరిగేలా సహకరించారు. అనంతరం బాలింతకు వెంటనే ఇంజక‌్షన్ ఇవ్వాల్సి ఉండగా మధ్యాహ్నం 12.30గంటలకు శివ్వంపేట ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రికి తాళం వేసి ఉండడంతో చేసేదేమి లేక కొద్దిసేపు ఎదురు చూశారు. ఎవరూ రాకపోవడంతో బాలింతను 108 అంబులెన్సులోనే నర్సాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పీహెచ్‌సీ ఎదుట నిరసన...
శివ్వంపేటలో వైద్యులు, సిబ్బంది విధులకు రాకపోవడంతో రోగులకు సరైన సేవలు అందడం లేదంటూ ఆసుపత్రి ఎదుట శివ్వంపేట, పిల్లుట్ల వాసులు నిరసన తెలిపారు. ఐదు రోజుల క్రితం శివ్వంపేట చెరువు కట్ట వద్ద రోడ్డు ప్రమాదం జరగ్గా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్సనిమిత్తం ప్రభుత్వాసుపత్రికి రాగా తాళం వేసి ఉండడంతో ప్రైవేటుకు వెళ్లాల్సి వచ్చింది. శివ్వంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తీరుపై వారు మండిపడ్డారు. కలెక్టర్ స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.