కరువు సీమగా డెల్టా
ఇలాంటి పరిస్థితి దురదృష్టకరం
ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది తార్కాణం
రైతులతో మాట్లాడిన వైఎస్సార్ సీపీ నేత ఎంవీఎస్ నాగిరెడ్డి
తెనాలి/ చుండూరు: కృష్ణా పశ్చిమ డెల్టాలో మాగాణి భూముల్లో వరిసాగుకు అన్నదాతలు పడుతున్న అవస్థలు వైఎస్సార్‌సీపీ రైతువిభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ నాగిరెడ్డిని కదిలించాయి. కరువుసీమ అనంతపురంలో కనిపించే దృశ్యాలను సస్యశ్యామలమైన డెల్టాలో వీక్షించాల్సి రావటం రైతుల దురదృష్టకరమనీ, ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇంతకు మించిన తార్కాణం మరొకటి లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. వరిసాగు సంక్షోభంలో ఉన్న పశ్చిమడెల్టా పరిధిలోని వేమూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ రైతువిభాగం బృందం మంగళవారం పర్యటించింది. పార్టీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మేరుగ నాగార్జున, రైతువిభాగం రాష్ట్ర కార్యదర్శి తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, యలవర్తి నాగభూషణం, పార్టీ నేతల బృందం మంగళశారం ఉదయం తెనాలి నుంచి బయలుదేరి వేమూరు నియోజకవర్గం చుండూరు మండలంలోని మోదుకూరును సందర్శించింది. అక్కడి టీఎస్ చానల్‌కు విడుదల చేస్తున్న సాగునీరు దిగువ ప్రాంతాలకు చేరటం లేదు. దీంతో ఆ ప్రాంతం రైతాంగం టీఎస్ ఛానల్ నుంచి ఆయిల్ ఇంజిన్లతో నీటిని తోడి బ్రాంచి కాలువలకు మళ్లిస్తున్నారు. నెం.2, నెం.3 బ్రాంచి కాలువల్లో ఇదే తరహాలో ఏడు నుంచి పది వరకు ఆయిల్ ఇంజిన్లను వినియోగిస్తూ బ్రాంచి కాలువలకు నీరు మళ్లించటాన్ని, అక్కడ్నుంచి మళ్లీ ఇంజిన్లతో పంటపొలాలకు కిలోమీటర్ల లెక్కన తరలిస్తుండటాన్ని ప్రత్యక్షంగా చూశారు. గ్రామానికి చెందిన రైతు గోగిరెడ్డి బాపిరెడ్డికి చెందిన ఎండిపోతున్న అయిదెకరాల వెదసాగు పొలానికి వెళ్లి, రైతు దుస్థితిని అడిగి తెలుసుకున్నారు.