డీఈఓ కార్యాలయం, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల విభజన పూర్తి
Published Sun, Oct 2 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
విద్యారణ్యపురి : నూతన జిల్లాల పాలన దసరా నుంచే ప్రారంభం కానున్నందున జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయ్యింది. డీఈఓ కార్యాలయం, సర్వశిక్షాభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఉద్యోగులను కలిపి సీనియార్టీ ప్రాతిపదికన డీఈఓ రాజీవ్ కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా జిల్లాలకు కేటాయించారు. ఈనెల 6వతేదీ నుంచే పలువురు ఉద్యోగులు ఫైళ్లు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని శనివారం ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి డీఈఓ రాజీవ్ ఆదేశించారు. వరంగల్ జిల్లా డీఈఓ కార్యాలయానికి 23 మంది, హన్మకొండకు 17 మంది, మహబూబాబాద్‌కు 14మంది, భూపాలపల్లికి 13మంది ఉద్యోగులను కేటాయించారు.
ఆన్‌లైన్‌లో ఫైళ్లు
జిల్లా విద్యాశాఖలో ఆయా సెక్షన్లలో సుమారు 7వేల ఫైళ్ల ప్రాథమిక వివరాలను ఆన్‌లైన్‌లో సంబంధిత ఉన్నతాధికారుకులకు అందుబాటులో ఉంచారు. వాటిలో కరెంట్ ఫైళ్లు, డిస్పోజల్ ఫైళ్లుగా విభజించారు. ఆయా జిల్లాలకు సంబంధించిన ఫైళ్లు కూడా విభజించారు. అందులో 176 కామన్ ఫైళ్లుగా గుర్తించి నాలుగు జిల్లాలతోపాటు సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో కలిసే మండలాలకు కూడా అందుబాటులో ఉంచారు. కామన్ ఫైళ్లను స్కాన్‌చేసి డీవీడీల్లో నింపి, జిరాక్స్‌లు ఆయా జిల్లాలకు పంపనున్నారు. ఒరిజినల్ ఫైళ్లు ప్రస్తుత డీఈఓ కార్యాలయంలో పెడతారు. ఈనెల 3 నుంచే జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని ఫర్నీచర్, కంప్యూటర్లు తదితర సామగ్రిని విభజించి మిగతా మూడు జిల్లాలకు పంపుతారు. ఈనెల 6వతేదీ నుంచే కేటాయించిన ఉద్యోగుల్లో కొందరు ఆయా జిల్లాలకు ఫైళ్లను తీసుకెళ్లి అక్కడ కంప్యూటర్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. ఈనెల 11న జిల్లా కార్యాలయాల విధులు ప్రారంభం కావాల్సి ఉంది.
జిల్లాకు రూ.5లక్షలు
నూతనంగా ఏర్పడే హన్మకొండ, జయశంకర్ జిల్లా (భూపాలపల్లి), మహబూబాబాద్ జిల్లాల్లోని విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో మరమ్మతులు, ఇతర పనులకు రూ.5లక్షల చొప్పున కలెక్టర్ కేటాయించారు. దీంతో ఆయా పనులు ఇప్పటికే మొదలయ్యాయి. భూపాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని ఆర్‌ఎంఎస్‌ఏ గదుల్లోనే డీఈవో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. అందులో మరమ్మతులు చేస్తున్నారు. మహబూబాబాద్‌లో ఎమ్మార్సీ భవనంలో మరమ్మతులు చేస్తున్నారు.
హన్మకొండ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంగా డీఈఓ కార్యాలయం పక్కనే ఉన్న సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు కార్యాలయానికి కేటాయించారు. ఇప్పటికే ఉన్న వరంగల్ డీఈవో కార్యాలయం యథావిధిగా వరంగల్ జిల్లా డీఈఓ కార్యాలయంగా కొనసాగనుంది. సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టు కార్యాలయం భవనం (హన్మకొండ జిల్లా డీఈవో కార్యాలయం)ను వరంగల్ డీఈవో కార్యాలయం ఒకే ఆవరణలో రెండు కార్యాలయాలు ఉండబోతున్నాయి. అయితే ఈ రెండింటికి మధ్య ప్రహరీ నిర్మించేందకు శనివారం సంబంధిత విద్యాశాఖాధికారులు ఉపక్రమించారు. ఈమేరకు పొక్లెయినర్‌తో కందకం తవ్వించారు. పునరాదిరాళ్లు కూడా తెప్పించారు. నాలుగు రోజుల్లో ఈ పను లు పూర్తి కానున్నాయి. ఒకే ఆవరణలో రెండు భవనాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటి మధ్య ప్రహరీ నిర్మిస్తున్నారు. కందకం తవ్వుతుండగా చూసిన వారు అనవసరంగా ప్రహరీ నిర్మిస్తున్నా రని అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Advertisement