మా మొర వినే ఆప్షనే లేదా? | Five District Employee Separation Process In Telangana | Sakshi
Sakshi News home page

మా మొర వినే ఆప్షనే లేదా?

Published Thu, Dec 16 2021 2:57 AM | Last Updated on Thu, Dec 16 2021 3:33 AM

Five District Employee Separation Process In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇలాంటి ఉదంతాలు ప్రతీ జిల్లాలో కోకొల్లలు. ఇలా అసంతృప్తి, ఆందోళనల మధ్య ఉద్యోగుల విభజన శరవేగంగా సాగిపోతోంది. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న డిమాండ్‌ను గానీ, సీనియారిటీ వల్ల అన్యాయం జరుగుతోందన్న జూనియర్ల వాదనను గానీ ఎక్కడా పరిగణలోనికి తీసుకోలేదు. దీంతో ఎవరు ఎక్కడకు వెళ్తారో? ఎంతమంది స్థానికేతర జిల్లాలకు వెళ్తారో తెలియక ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో ఇప్పటికే విభజన ప్రక్రియ కీలక దశకు  చేరుకుంది. ఉద్యోగులు ఇచ్చిన ఆప్షన్లను పరిశీలించి, జిల్లా కేటాయింపు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా మెదక్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియడంతో గురువారం నుంచి ఆప్షన్లు తీసుకుంటున్నారు. దీంతో ఈ జిల్లా ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 13న ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి, ఆప్షన్ల పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అదే రోజు రాత్రి విభజనకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విడుదల చేశారు. దీంతో ఉద్యోగులు స్థానికత, ఆప్షన్ల విషయంలో నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడింది.

నకిలీల నాటకం..
దివ్యాంగుల ప్రాధాన్యతనూ కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. 75 శాతం వైకల్యం ఉంటే నిబంధనల ప్రకారం ఆప్షన్లలో రిజర్వేషన్‌ ఇవ్వాలి. కానీ ఇష్టానుసారం తప్పుడు ధ్రువీకరణలు పెడుతున్నారని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు వచ్చాయి. భవిష్యత్‌లో ఇవన్నీ కోర్టు కేసుల వరకూ వెళ్లే వీలుందని, సమస్య మరింత జఠిలమవుతుందని పలువురు టీచర్లు చెప్పారు. హడావిడి విభజన వల్లే ఈ సమస్య తలెత్తుతోందని అంటున్నారు.

సంతృప్తినివ్వని ఊరట!
ఉద్యోగుల విభజనలో ఉపాధ్యాయులే ఎక్కువ. వారి నుంచి వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా ఉన్నతాధికారులు కొంత ఊరట కల్పించే దిశగా ఆలోచనలు చేస్తున్నారు. విభజనలో జిల్లా మారకపోతే వీలైనంత వరకూ వాళ్లు పనిచేస్తున్న స్కూల్లోనే కొనసాగించేలా అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు. సాధ్యాసాధ్యాలపై జిల్లా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అయితే, ఈ చిన్న ఊరట ఉపాధ్యాయ వర్గాలను ఏమాత్రం సంతృప్తి పర్చడం లేదు.  

‘జిల్లాల్లో సీనియారిటీ జాబితా పెట్టామని అధికారులు చెబుతున్నారే గానీ దాన్ని ఎక్కడా డిస్‌ప్లే చేయలేదు. అభ్యంతరాలు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. నాకు మూర్ఛవ్యాధి ఉన్న సంతానం ఉందని, ఆప్షన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరేందుకూ చాన్స్‌ లేకుండా పోయింది. సీనియారిటీలో వెనుకబడి ఉండటం వల్ల ఎక్కడేస్తారో అని గందరగోళంగా ఉంది.’– కార్తీక్, టీచర్, వరంగల్‌ జిల్లా 

‘నాకు సీనియారిటీ లేకపోవడంతో కొత్తగూడెం జిల్లాలో వేస్తారేమో? ఆ జిల్లాలో ఎక్కడ పోస్టింగ్‌ ఇస్తారో? కనీసం వంద కిలోమీటర్ల దూరంలో పనిచేయాల్సి వస్తుందేమో. నాకు వృద్ధ తల్లిదండ్రులున్నారు.. వాళ్లను అక్కడకు తీసుకెళ్లడం అదనపు భారమవుతుంది.’– వసంత్, టీచర్, ఖమ్మం జిల్లా
 
నేను మేడ్చల్‌ జిల్లాలో పనిచేస్తున్నా.. అత్తమామలతో హైదరాబాద్‌లో ఉంటున్నా. ఈ జిల్లాలో పుట్టి పెరిగిన నాకు దూరప్రాంతానికి బదిలీ తప్పదేమోనని భయంగా ఉంది. స్థానికతకు ప్రాధాన్యత నిస్తే, సమీపంలోనే ఏదో ఒక స్కూల్లో అవకాశం ఉంటుంది.’  – స్వరూప, టీచర్, మేడ్చల్‌ జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement