సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్లు చొప్పున ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఐదు జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ సమావేశమయ్యారు.
ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు హైదరాబాద్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులకు అప్పగిస్తున్నట్టు రేవంత్ ప్రకటించారు. సంక్షేమం..అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని, తాను గత సీఎం తరహా కాదని తేల్చి చెప్పారు. జనవరి 26 తర్వాత వారానికి మూడురోజులు సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు సచివాలయంలో అందుబాటులో ఉంటానని చెప్పారు.
ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన
ఈ నెల 26 తర్వాత సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ఉంటుంది. తొలిసభ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహిస్తారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసభ ఇంద్రవెళ్లిలో నిర్వహించగా, సీఎం హోదాలోనూ అక్కడ జరిగే తొలిసభలో రేవంత్ పాల్గొంటారు. ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్మతివనానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు రేవంత్ సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామన్నారు.
రెట్టింపు ఉత్సాహంతో పనిచేయండి
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని, రెట్టి ఉత్సాహంతో పనిచేయాలని పార్టీ నేతలకు రేవంత్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఓట్ల కంటే ఎక్కువ వచ్చేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకుగాను 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలన్నారు.
బీఆర్‌ఎస్ నేతలు బదనాం చేస్తున్నారు
నియోజకవర్గ సమస్యలతోపాటు పార్టీ బలోపేతానికి సీఎం పలు సూచనలు చేశారని మంత్రి సీతక్క వెల్లడించారు. ప్రభుత్వ పథకాల విధివిధానాలు తయారుకాక మునుపే బీఆర్‌ఎస్ నేతలు తమను బదనాం చేస్తున్నారన్నారు. అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని కూల్చుతామని మాట్లాడుతున్నారని, ఐదేళ్ల వరకు ఎన్నికలు రావని బీఆర్‌ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఓటమి పాలైన పార్టీ అభ్యర్థులకు ధైర్యం ఇచ్చేందుకే సీఎం సమావేశం ఏర్పాటు చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. బీఆర్‌ఎస్ పాలన తట్టుకోలేక తమకు అధికారం ఇచ్చారని, వచ్చే టర్మ్‌లోనూ తామే అధికారంలోకి వస్తామని చెప్పారు.
సీఎంగా రేవంత్‌కు వంద మార్కులు : జగ్గారెడ్డి
సీఎంతో జరిగిన భేటీలో ఆరు గ్యారంటీల అమలుపై చర్చ జరిగిందని, నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్ల చొప్పున సీఎం ఇస్తారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. మెదక్ పరిధిలోని రెండు స్థానాలు గెలుచుకోవాలని తమకు దిశానిర్దేశం చేశారన్నారు. అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగలేదన్నారు. ఓటమి పాలైనా తాము పార్టీ తరపున ఎమ్మెల్యేలమని, సీఎంగా రేవంత్‌కు వంద మార్కులు వేస్తానన్నారు. సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటు అంశం చర్చకు వచ్చిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment