‘వారసత్వం’పై ఉత్కంఠ
సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. శుక్రవారం జరగనున్న సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో వారసత్వ ఉద్యోగాలు పొందేందుకుగల అర్హతలు, ఇతర బెనిఫిట్స్‌పై కీలకనిర్ణయాలు తీసుకోనున్నారు. హైదరాబాద్‌లో యాజమాన్యంతో గురువారం జరిగిన చర్చల్లో గుర్తింపు కార్మిక సంఘం నేతలు షరతుల్లేని వారసత్వం కోసం పట్టుబట్టారు.
♦ రాజధానిలో సింగరేణి కార్మిక సంఘం నేతల లాబీయింగ్
♦ షరతులు లేని విధానం అమలు చేయాలని పట్టు
♦ రెండేళ్ల సర్వీస్ విధానాన్ని పునరుద్ధరిస్తామంటున్న సంస్థ
♦ నేడు బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం
గోదావరిఖని(పెద్దపల్లి): సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. శుక్రవారం జరగనున్న సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో వారసత్వ ఉద్యోగాలు పొందేందుకుగల అర్హతలు, ఇతర బెనిఫిట్స్‌పై కీలకనిర్ణయాలు తీసుకోనున్నారు. ఈనేపథ్యంలో సింగరేణి అధికారిక గుర్తింపు సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు బి.వెంకట్రావు, కెంగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, కనకరాజు, సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవితతోపాటు ఇతర ప్రభుత్వ పెద్దలు, సింగరేణి యాజమాన్యంతో గురువారం విడివిడిగా సమావేశమయ్యారు. బోర్డుసమావేశాన్ని ప్రభావితం చేయగలరని భావిస్తున్న ముఖ్యమైన అధికారులు, ప్రభుత్వ పెద్దలతో లాబీయింగ్ జరుపుతూ తమవాదన వినిపించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి షరతులు లేని వారసత్వ ఉద్యోగాలు పొందేహక్కును కార్మికులకు కల్పించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.
రెండేళ్ల సర్వీస్ నిబంధన వద్దు
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కవిత, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్, ఇతర డైరక్టర్లతో విడివిడిగా సంఘం నాయకులు సమావేశమయ్యారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 1998లో అప్పటి ప్రభుత్వం రద్దుచేసిన వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరిస్తారనే ఆశతో కార్మికలోకం ఉందని, ఆంక్షలతో కూడిన ఉద్యోగాలకు కార్మికులు ఒప్పుకోవడంలేదని వారికి వివరించారు. ‘ఎలాంటి షరతులు లేకుండా వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలను సింగరేణి యాజమాన్యం పాటించేలా చూడాలని విజ్ఞప్తిచేశారు. 1998 కన్న ముందున్న విధానంలో రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ సర్వీసు ఉన్న ఉద్యోగుల కుమారులు, అల్లుళ్లకు మాత్రమే ఉద్యోగాలు లభించే ఆస్కారం ఉందని, తద్వారా సుమారు ఏడు వేల మంది కార్మికులు నష్టపోతారని తెలిపారు. ఇది ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి ఆంక్షలు విధించడమేనని స్పష్టంచేశారు. బోర్డు సమావేశంలో ఒకరోజు ముందు పదవీ విరమణ చేసే కార్మికుడికి కూడా వారసత్వ ఉద్యోగాలు వర్తించేలా విధివిధానాలు రూపొందించాలని కోరారు. రెండేళ్ల సర్వీస్ వదిలిపెట్టాలనే నిబంధనలు విధిస్తే సింగరేణిలో ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల్లో 48 నుంచి 58 సంవత్సరాల వయస్సు మధ్య సుమారు 30 వేల మందికి ఈ పథకం వర్తించే అవకాశముంది.
1981 నాటి చట్టానికే యాజమాన్యం మొగ్గు?
సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకుల వాదనను సంఘం గౌరవాధ్యక్షురాలు, ఎంపీ కవిత బలపరచగా, సింగరేణి యాజమాన్యం మాత్రం సంసిద్ధత వ్యక్తం చేయనట్లు తెలిసింది. 1981లో రూపొందించిన వారసత్వ ఉద్యోగాల కల్పన(రెండేళ్ల సర్వీసు నిబంధన)చట్టాన్ని కాదని, అందరికీ ఉద్యోగాలు కల్పించేలా విధివిధానాలను రూపొందిస్తే న్యాయపరమైన అడ్డంకులు వచ్చే అవకాశం ఉందని సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. 1998లో పక్కనబెట్టిన వారసత్వ ఉద్యోగాల కల్పన చట్టం–1981ని పునరుద్ధరించడం ద్వారా న్యాయపరంగా సమస్యలు రావని అభిప్రాయపడ్డట్టు సమాచారం. బోర్డు సమావేశంలో కోల్ ఇండియా లిమిటెడ్, కేంద్ర ప్రభుత్వ ఇంధన మంత్రిత్వ శాఖల నుంచి వచ్చే ప్రతినిధులు షరతులు లేని వారసత్వ ఉద్యోగాలకు అంగీకరించకపోవచ్చని కూడా చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవాలని కార్మిక నేతలు ప్రయత్నించినా వీలు కాలేదు. దీంతో శుక్రవారం జరిగే బోర్డు సమావేశం కీలకం కానుంది.
నేటి కీలక అంశాలపై నిర్ణయం...
వారసత్వఉద్యోగాలతోపాటు పలుఅంశాలపై హైదరాబాద్ సింగరేణి భవన్‌లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన శుక్రవారం జరగనున్న బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 2015–16లో సంస్థ సాధించిన రూ.1066కోట్ల లాభాలనుంచి 23శాతం వాటాను కార్మికులకు చెల్లించగా..దీనికిసంబంధించి సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. అలాగే సింగరేణి వ్యాప్తంగా ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో అవసర నిమిత్తం 15డోజర్ల కొనుగోలు, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కోల్‌వాషరీస్ ఏర్పాటు, మణుగూరులోని ఓపెన్‌కాస్ట్‌లో కొత్తగా ఓవర్‌బర్డెన్(మట్టి తొలగింపు) కాంట్రాక్ట్‌పై డైరెక్టర్లు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.